వర్సిటీ అధ్యాపకుల ఉద్యోగ విరమణ వయోపరిమితి 65 ఏండ్లకు పెంచాలి

– సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేనికి ఔటా వినతి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాష్ట్రంలోని ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్న అధ్యాపకుల ఉద్యోగ విరమణ వయోపరిమితిని యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ (యూజీసీ) నిబంధనల ప్రకారం 58 నుంచి 65 ఏండ్లకు పెంచాలని ఉస్మానియా యూనివర్సిటీ టీచర్స్‌ అసోసియేషన్‌ (ఔటా) కోరింది. ఈ మేరకు సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రంను ఔటా ఉపాధ్యక్షులు జి మల్లేషం, కె సరస్వతమ్మ, జాయింట్‌ సెక్రెటరీ చలమల వెంకటేశ్వర్లు నేతృత్వంలో గురువారం హైదరాబాద్‌లో కలిసి వినతిపత్రం సమర్పించారు. విశ్వవిద్యాలయాల్లో పనిచేసిన అధ్యాపకులు సైతం తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారని తెలిపారు. అధ్యాపకుల ఉద్యోగ విరమణ వయో పరిమితి 65 ఏండ్లకు పెంచడం వల్ల విశ్వవిద్యాలయాల పరిరక్షణ జరుగుతుందని పేర్కొన్నారు. విశ్వవిద్యాలయాల్లో పరిశోధన, బోధకుల కొరత లేకుండా ఉంటుందని వివరించారు. రాష్ట్రంలో పేదలు, బలహీనవర్గాల నుంచే 80 శాతం మంది విద్యార్థులు వర్సిటీల్లో చేరుతున్నారని గుర్తు చేశారు. విశ్వవిద్యాలయాల్లో ఖాళీగా ఉన్న అధ్యాపకుల పోస్టులు భర్తీ కావడం లేదని తెలిపారు. విద్యార్థి-అధ్యాపకుల నిష్పత్తి తగ్గిపోతున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. ఇది వర్సిటీల గుర్తింపు, అక్రిడిటేషన్లు పొందడంపై ప్రభావం పడుతున్నదని పేర్కొన్నారు. వర్సిటీలను పరిరక్షించాలంటే యూజీసీ నిబంధనల ప్రకారం అధ్యాపకుల ఉద్యోగ విరమణ వయోపరిమితిని 65 ఏండ్లకు పెంచాలని కోరారు. 2016 జనవరి ఒకటి నుంచి 2019 జూన్‌ 30 వరకు ఉన్న యూజీసీ-2016 వేతన బకాయిలు విడుదలయ్యేలా చూడాలని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదించి తమకు న్యాయం జరిగేలా చూడాలని తమ్మినేనికి వారు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఔటా నాయకులు సిహెచ్‌ శ్రీనివాస్‌, బి మంగు, అనంతలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

 

Spread the love