ఈ రోజుల్లో చిన్న వయసులోనే కండ్ల సమస్యలతో బాధపడే వారు చాలా మంది ఉన్నారు. ఉద్యోగం చేసే చోట అదే పనిగా కంప్యూటర్ చూడటం, బయట తిరిగేపుడు దుమ్ము పడటం కండ్ల సమస్యలకు కారణం కావచ్చు. ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్‌ఫోన్ సర్వసాధారణమైంది. ఫోన్ ఎక్కవగా వాడటం కూడా కండ్ల సమస్యలకు కారణం కావచ్చు. అందువల్ల కండ్ల కాపాడుకోవడం తప్పనిసరి. అందుకు ఏమేం చేయాలో చూద్దాం…
సాధారణంగా కంటి రెప్పలు మూసి తెరవటం చేస్తుంటాం. దీని వల్ల కండ్లు తాజాగా ఉంటాయి. కంటి అలసట నివారించేందుకు ఇది ఉపయోగపడుతుంది.
కంప్యూటర్‌పై పని చేసేవారు కండ్ల రెప్పలు మూసి తెరవటం చాలా తక్కువగా చేస్తూ ఉంటారు. కాబట్టి వారు తమ కళ్ళును ప్రతి మూడు నాలుగు సెకన్లు ఒకసారి మూసి తెరుస్తూ వ్యాయామం చేయాలి.
దగ్గరగా ఉన్న వస్తువుల వద్ద ఎక్కువ సమయం గడిపిన తర్వాత దూరపు వస్తువులను చూడటం ఒక అలవాటుగా పాటించాలి. వాకింగ్ లేదా కూర్చొని ఉండగా చుట్టూ దూరంగా ఉన్న వస్తువులను చూడటానికి ప్రయత్నిస్తూ ఉండాలి.
కంటి చూపులో ఎలాంటి సమస్య అయినా కనీసం ఏడాదికి ఒకసారి చెకప్‌కు వెళ్లాలి. కంటి సంబంధిత రోగాలను గుర్తించడం, సరైన చికిత్సకు ఇలా చేయడం చాలా అవసరం.
ఎయిర్ కండిషన్డ్ గాలి కండ్లలో తేమ లేకుండా చేస్తుంది. అందుకే ఏసీ ప్యానెల్‌ను కిందికి లేదా ముఖానికి దూరంగా ఉండేలా చూసుకోవాలి. ఎయిర్ కండీషనర్ గాలి కండ్లను పొడిబార్చడం, అంధత్వం తో పాటు ఇతర కంటి రుగ్మతలకు కారణం కావచ్చు.
దుమ్ము, ధూళీ వంటి వాటితో కండ్లు పాడయ్యే అవకాశం ఉంది. కాబట్టి దుమ్ము, ధూళీ, రసాయనాలతో పని చేసేవారు తప్పనిసరిగా రక్షణకు కండ్లద్దాలు ధరించాలి.
కండ్లు ఒత్తిడిగా ఉన్నాయని భావిస్తే చల్లటి నీటితో కడగాలి. దీనిని రోజువారీ పనిగా అలవాటు చేసుకోండి. నీటితో కండ్లను కడగటం వల్ల అధిక ఒత్తిడి నుండి ఉపశమనం పొందటానికి, వాటిని తాజాగా ఉంచటానికి సహాయం చేస్తుంది.
పడుకొనే ముందు కంటి మేకప్‌ను తొలగించుకోవాలి. రాత్రి కంటి మేకప్ తీయకపోతే ఇరిటేషన్ రావచ్చు. అంతేకాక ఆ మేకప్ కండ్లలోకి వెళ్ళే అవకాశం ఉంటుంది.
నిద్ర లేకపోవడం వల్ల అలసట, తలనొప్పి, చూపు మసక బారేలా చేస్తుంది. చక్కటి నిద్ర మంచి చూపుకు, కంటి కండరాల విశ్రాంతికి సహాయం చేస్తుంది.
తరుచూ గుడ్డు తీసుకోవడం వల్ల అందులోని పోషక పదార్థాలు చురుకైన చూపుకు సహాయపడతాయి. అలాగే వయసు సంబంధిత కంటి వ్యాధులను తగ్గిస్తాయి.
ఆహారంలో కనీసం వారంలో రెండు సార్లు చేపలు ఉండేలా చూసుకోవాలి. చేపలలో ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు ఉండుట వల్ల డ్రై-ఐ సిండ్రోం నివారించేందుకు ఉపయోగపడుతుంది.
నీరు అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు ఉత్తమమైన నివారణ మార్గంగా చెప్పవచ్చు. తరచుగా మసకగా ఉన్న దష్టి నిర్జలీకరణ వల్ల కావచ్చు. అందువల్ల నీటిని తాగుతూ ఉండాలి.
ఆహారంలో పాలకూర ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. పాలకూర అనేక కంటి సంబంధిత సమస్యలను నిరోధించడానికి సహాయపడుతుంది.