గగన కుసుమం గద్దరన్న

పాటల సూరీడు మాయమయ్యేనని
ఎర్రమల్లెలు ఏడుస్తున్నవి
పాదం మీద పుట్టుమచ్చమాయమయ్యేనని
కన్నీళ్లు మాటిమాటికి తడుముతున్నవి

గోసి గొంగడి గొంతు పోవంగా
గద్దరేడని గోసబడుతున్నవి
కనేల్‌ కనేల్‌ అనే కంచు గజ్జెలు
కిమ్మనకుండా మౌనంగానే రోదిస్తున్నవి

పేదరికమే పెద్ద పాటై
గాయిదొళ్ల గాన గొంతుక
గగనసీమకు పయనమయ్యేనని
పోరు పాట పోరుతున్నది

పాట పొద్దు పడమట వాలేనని
ఆకలి అవ్వల ఆర్తనాదాలు
అలసిన అడుగులు ఆగి
అన్నేడని అడుగుతున్నవి

పాటకు పట్టం కట్టి
ప్రజాగొంతుకై ప్రశ్నించిన
ప్రజా యుద్ధనౌక
సమ సమాజ స్వాప్నికుడేడని
జన జాతర అడుగుతున్నది ?

వారితో పోరు బాట అన్నది.
అదిగదిగో! ఆకాశానా
అమర సీమన వేగుసుక్కైన
గగన కుసుమం గద్దరన్న.

– డా.ఎడ్ల కల్లేశ్‌, 9866765126