ఏ విచారణనైనా ధైర్యంగా ఎదుర్కొంటా

– నా వైపు సత్యం, న్యాయం, ధర్మం ఉన్నాయి
– తెలంగాణలో ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర
– ‘వన్‌ నేషన్‌.. వన్‌ ఫ్రెండ్‌’ సర్కార్‌ వద్దని పిలుపు
– 27 ఏండ్లుగా కోల్డ్‌ స్టోరేజ్‌లో మహిళా రిజర్వేషన్‌ బిల్లు : కవిత
న్యూఢిల్లీ :ఏ విచారణనైనా ఎదుర్కొనేందుకు తాను సిద్ధంగా ఉన్నానని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కె కవిత అన్నారు. ఈడీ, సీబీఐ ఏ దర్యాప్తు సంస్థలు పిలిచినా విచారణకు హాజరవుతానని చెప్పారు. ‘ఎన్నికల నేపథ్యంలో మా పార్టీ నేతలను భయభ్రాంతులకు గురిచేయడమే బీజేపీ లక్ష్యం. మా వైపు సత్యం, ధర్మం, న్యాయం ఉన్నాయి. ఏ విచారణనైనా ధైర్యంగా ఎదుర్కొంటాం’ అని కవిత అన్నారు. ‘యతో ధర్మహా… తతో జయహా’ అన్న గాంధారి మాటలకు అనుగుణంగా ధర్మమే గెలుస్తుందని చెప్పారు. జైలులో పుట్టిన కృష్ణుడు, అజ్ఞాత వాసంతో అర్జునుడు, వనవాసం తర్వాత శ్రీరాముడు మరింత శక్తివంతులయ్యారని గుర్తు చేశారు. కేంద్రం తాము భగవంతుడికన్నా బలవంతులమనీ, ఈడీ, దర్యాప్తు సంస్థలతో అన్నింటిని కంట్రోల్‌ చేయగలమని భావిస్తున్నాయని విమర్శించారు. అయితే, ప్రాకృతిక న్యాయం ఒకటి ఉంటుందనీ, అది కచ్చితంగా వస్తుందన్నారు. అప్పుడు న్యాయమే గెలుస్తుందని చెప్పారు. గురువారం ఢిల్లీలోని ఎంపీ కొత్త ప్రభాకర్‌ రెడ్డి నివాసంలో ఆమె మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా తనకు ఈడీ ఇచ్చిన నోటీసులు, మహిళా బిల్లుపై భారత్‌ జాగృతి ఆధ్వర్యంలో చేపట్టనున్న దీక్ష తదితర అంశాలపై స్పందించారు. ‘ఎక్కడైతే ఎన్నికలు ఉంటాయో, అక్కడ మోడీ కంటే ముందు.. ఈడీ ఉంటుంది’ అని విమర్శించారు. తెలంగాణ లోనూ ఇదే జరుగుతుందని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా 500 లకు పైగా బిజినెస్‌ హౌజెస్‌ పై ఐటీ దాడులు, 100 చోట్ల సీబీఐ దాడులు, ఈడీ 200 చోట్ల దాడులు చేసిందన్నారు. ఎన్‌ ఐఏ ఏకంగా 500 నుంచి 600 మందిని పిలిచి వార్నింగ్‌ ఇచ్చిందన్నారు. ‘ఇది నా ఒక్కరిపై జరుగుతున్న దాడి కాదు. బీఆర్‌ఎస్‌లో ఇప్పటి వరకు 15 మందికి పైగా మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలను టార్గెట్‌ చేసి విచారణ పేరుతో ఇబ్బంది పెట్టారు’ అన్నారు. ప్రజల వద్దకు వెళ్లి, తాము చేసిన అభివృద్ధి గురించి చెప్పుకోవాలని బీజేపీ నేతలకు హితవు పలికారు. ‘ముందు ప్రజల హదయాలు గెలవండి, తర్వాత ఎన్నికల్లో గెలవండి’ అంటూ ఫైర్‌ అయ్యారు. దర్యాప్తు సంస్థల బెదిరింపులు, బ్యాక్‌ డోర్‌ నుంచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే కుట్రలు బీజేపి చేస్తుందన్నారు. ఇప్పటి వరకు 9 రాష్ట్రాల్లో ఇదే విధానం అవలంభించారనీ, తెలంగాణలో ఇది సాధ్యం కాలేదన్నారు. అందువల్లే.. ఈడీ, సీబీఐ లను ఊసిగొల్పి భయపెట్టాలని బీజేపి చూస్తుందన్నారు. అయితే, మోడీ, బీజేపీ, ఈడీలకు తాము భయపడమని స్పష్టం చేశారు.
ఈడీకి అంతతొందరెందుకో…
లిక్కర్‌ స్కాంలో తనను విచారించేందుకు ఈడీకి అంతతొందరెందుకని కవిత అన్నారు. విచారణకు రెండు రోజుల సమయం ఇస్తే, ఎలాంటి ఆపత్కాల పరిస్థితులు వస్తాయో తనకు అర్థం కావడం లేదన్నారు. మార్చి 16న విచారణకు హాజరవుతానని ఈడీకి రిప్లై ఇచ్చినట్లు చెప్పారు. కానీ, ఈడీ విచారణకు హాజరుకావాలని పట్టుబట్టిందన్నారు. అందుకే ధర్నా తర్వాత రోజు, మార్చి 11న విచారణకు వస్తానని సమాధానమిచ్చినట్టు వెల్లడించారు. ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌, ఇతర దర్యాప్తు సంస్థలు ఒక మహిళను విచారించాలంటే ప్రాథమిక హక్కులు ఉంటాయని చెప్పారు. ఆ మహిళ ఇంటికి వచ్చి విచారణ చేపట్టాల్సి ఉంటుందన్నారు. చట్టంలో మహిళలకు ఇలాంటి మినహాయింపులు ఉన్నాయని, కోర్టు లు సైతం ఇలాంటి తీర్పులనే ఇచ్చాయని గుర్తు చేశారు. అందువల్ల ‘ఇన్వెస్టిగేషన్‌ కోసం ఈడీ అధికారులే మా ఇంటికి రావాలని కోరాం. ఎవరితో అయితే కలిపి విచారించాలనుకుంటున్నారో, వారిని తీసుకొని రండీ’ అని ఈడీని కోరినట్టు చెప్పారు. అయితే తన విజ్ఞప్తిని తిరస్కరించిన ఈడీ అధికారులు… తమ ముందు హాజరుకావాలని పట్టుబట్టినట్టు వెల్లడించారు.
వీసీ ద్వారా మహిళల ఇంట్రాగేషన్‌ జరపాలి…
పోలీసులు, ఈడీ, ఇతర దర్యాప్తు సంస్థలు మహిళల ఇంట్రాగేషన్‌ వీడియో కాన్ఫరెన్స్‌ (వీసీ) ద్వారా జరపాలని కవిత డిమాండ్‌ చేశారు. కరోనా టైంలో వీసీ ద్వారా మందులు, ట్రీట్మెంట్‌ ఇచ్చినప్పుడు ఇంట్రాగేషన్‌ ఎందుకు సాధ్యం కాదన్నారు. రానున్న రోజుల్లో ఈ అంశంపై పోరాటం చేస్తానన్నారు. అవసరమైతే సుప్రీంకోర్టుకు కూడా వెళ్తామని చెప్పారు. దేశంలో ఈడీ డైరెక్టర్‌, సెబీ డైరెక్టర్‌, ఎస్‌బీఐ డైరెక్టర్‌, ఎల్‌ ఐసీ డైరెక్టర్లకు రిటైర్మెంట్‌ తర్వాత కూడా ఎక్స్‌టెన్షన్‌ దొరుకుతుందన్నారు. కేంద్రం చెబుతున్నట్లు వ్యవహరిస్తున్నందుకే… వీళ్లకు ఎక్స్‌టెన్షన్స్‌ పై ఎక్స్‌టెన్షన్స్‌ వస్తున్నాయని ఆరోపించారు. ప్రస్తుతం ఆర్మీలో మూడున్నర లక్షల వెకెన్సీలు ఉన్నాయన్నారు. అగ్ని వీర్‌ కింద తీసుకున్న జవాన్లకు ముందు ఎక్స్‌టెన్షన్‌ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. నాలుగేండ్లు వాడుకొని వారిని రోడ్డు పై పడేస్తారా? అని ప్రశ్నించారు. బీజేపి ఆఫీసులో చౌకిదార్లుగా పెట్టుకుంటారా? అని మండిపడ్డారు.
తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే..
తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు ఎక్కడైతే ఎన్నికలు ఉన్నాయో… ఆయా రాష్ట్రాల్లో ఈడీ, సీబీఐ దర్యాప్తు సంస్థలతో కేసులు పెడుతుందన్నారు. కేంద్రంతో సఖ్యతగా ఉన్న పార్టీలు, వారి బిజినెస్‌ హౌజ్‌ లపై ఈ దాడులు ఎందుకు జరగడం లేదన్నారు. ఆదానీ, ఇతర నేతలకు ఏమీ కాదన్నారు. అయితే తెలంగాణ సిట్‌ ముందు హాజరుకావాలని బీఎల్‌ సంతోష్‌కు కూడా చెప్పాలని బీజేపి నేతలకు సూచించారు. ‘మాకు ఈడీ అంటే భయం లేదు. రేపు విచారణకు వెళ్తా, అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇస్తాను. అన్ని విధాలుగా సహకరిస్తాం. కానీ కోర్టుల్లో పిటిషన్లు దాఖలు చేస్తూ బీఎల్‌ సంతోష్‌ కు ఎందుకు స్టేలు తెస్తున్నారు?’ అని ప్రశ్నించారు. ‘గాంధీ పుట్టిన ఈ దేశంలో ప్రస్తుతం అబద్దాల పాలన సాగుతోంది. జీడీపీ, అభివృద్ధిపై, పార్లమెంట్‌ లోనూ మోడీ అబద్దాలపై అబద్దాలు చెబుతున్నారన్నారు. ఇలాంటి రాజకీయాలు మనకు అవసరమా?’ అని ఫైర్‌ అయ్యారు. అధికారం కావాలంటే ప్రజల వద్దకు వెళ్లాలని సూచించారు. ‘వన్‌ నేషన్‌.. వన్‌ ఫ్రెండ్‌’ కా సర్కార్‌కు అవకాశం ఇవ్వొద్దని ప్రజలను కోరారు.
27 ఏండ్లుగా కోల్డ్‌ స్టోరేజ్‌లో మహిళా రిజర్వేషన్ల బిల్లు…
దాదాపు 27 ఏండ్లుగా మహిళా రిజర్వేషన్ల బిల్లు కోల్డ్‌ స్టోరేజ్‌ లో ఉందని కవిత అన్నారు. అప్పటి నుంచి దేశంలో మహిళ రిజర్వేషన్ల బిల్లుపై చర్చ చాలా ఏండ్లుగా సాగుతుందని చెప్పారు. 1996 రాజ్య సభలో ఆమోదం పొందిందన్నారు. ఆ తర్వాత ఆ బిల్లు ల్యాప్స్‌ అయిందన్నారు. కానీ ఇంత వరకు లోక్‌ సభలో ఈ బిల్లు పాస్‌ కాలేదని గుర్తు చేశారు. 1998, 1999, 2008లో మళ్లీ మళ్లీ మహిళా బిల్లు తీసుకువచ్చేందుక ప్రభుత్వాలు కృషి చేశాయన్నారు. ‘ఎన్ని ప్రభుత్వాలు మారినా దానికి మాత్రం ఆమోదం లభించలేదు. చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలి. ఈ బిల్లు కోసం మా పోరాటం కొనసాగిస్తాం. 2014, 2019 ఎన్నికల్లోనూ మహిళా రిజర్వేషన్‌ బిల్లుపై బీజేపి హామీ ఇచ్చింది. ప్రజలు 300కి పైగా స్థానాలు ఆ పార్టీకి ఇచ్చినా బిల్లును ఆమోదించలేదు. శుక్రవారం మహిళా బిల్లుపై ఢిల్లీలో దీక్ష చేస్తామని మార్చి 2న ప్రకటన విడుదల చేశాం. మా దీక్షకు మద్దతిస్తూ విపక్షాలు కూడా ముందుకొచ్చాయి.’ అని చెప్పారు. మహిళ బిల్లుకోసం చారిత్రకమైన రోజు వచ్చిందనీ, మహిళలు పార్టీలకు అతీతంగా తాను చేస్తోన్న ఆందోళనకు మద్దతు తెలపాలని పిలుపునిచ్చారు. ఉమెన్‌ రిప్రజెంటేషన్‌ లో గ్లోబల్‌ ఇండికేటర్స్‌ను పరిశీలిస్తే… 193 దేశాల్లో భారత్‌ 148 స్థానంలో నిలిచిందన్నారు.