జీవిత వైరుధ్యాల కలబోత రాజధాని నగరం

న్యూఢిల్లీలో లాల్‌ ఖిలా, కుతుబ్‌ మినార్‌, ముఘల్‌ గార్డెన్‌, జంతర్‌ మంతర్‌, పార్లమెంట్‌, ఇండియా గేట్‌, నిజాముద్దీన్‌ దర్గా తదితర ప్రాంతాలు సందర్శించాల్సిన ప్రదేశాలు. ఒక్కో ప్రదేశానికి ఒక్కో చరిత్ర. రిపబ్లిక్‌ డే, పంద్రాగష్టుకి ఒక ప్రదేశం ప్రత్యేకమైనదైతే, రాజకీయ నాయకుల మొదలు సాధారణ ప్రజలందరి నిరసనలు తెలపడానికి ఉపయోగపడే ప్రదేశం ఒకటి. ఇక్కడ చెప్పడమెందుకు? చదివేద్దాం పదండి…

మన జెండా రెపరెపల లాల్‌ ఖిలా: ఆగ్రా కోట ఎంత పటిష్టంగా నిర్మించారో ఢిల్లీలో లాల్‌ ఖిలా అంతే బందోబస్తుగా నిర్మితమైంది. స్వాతంత్య్ర దినోత్సవమైన ఆగస్టు 15, గణతంత్ర దినోత్సవమైన జనవరి 26న మన దేశ ప్రధానమంత్రి ఇక్కడే మన జాతీయ జెండాను ఆవిష్కరించి, ప్రసంగిస్తారు. అన్ని రాష్ట్రాలకు చెందిన శకటాల విశిష్ట ప్రదర్శన ఇక్కడే జరుగుతుంది. అందుకోసం విశాలమైన మైదానం ఉంది అక్కడ. లాల్‌ ఖిలాను మనం ఎర్రకోటగా పిలుస్తున్నాం. ఆంగ్లంలో =Red Fort అన్నమాట. ఎర్రకోట కూడా విశాలమైన ప్రాంగణాన్ని కలిగి అత్యంత పటిష్టమైన ప్రహరీని కలిగి ఉంది. ఈ కోటను షాజహాన్‌ నిర్మించాడు. పరిపాలనను ఆగ్రా కంటే అనుకూలమైన ప్రాంతం నుంచి సాగించాలనుకున్నప్పుడు ఢిల్లీలోని ఈ ప్రాంతాన్ని ఎంచుకున్నారట. 120 ఎకరాల భూభాగంలో నిర్మితమైన కోటలో అనేక భవనాలు, చక్కటి ఉద్యానవనాలు ఉన్నాయి. షాజహాన్‌ ఎంతో ఇష్టంగా తయారు చేయించుకున్న నెమలి సింహాసనం ఇక్కడే ఉంది. స్వాతంత్య్ర పోరాటం గురించి వివరించే మ్యూజియం ఇక్కడే ఉంది. షాజహాన్‌, ఔరంగజేబు పరిపాలనలో ఏర్పాటు చేసిన గుర్రపు శాలలు, ఒంటెలు, ఏనుగులు… ఇలా మరెన్నో జంతువుల కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక శాలలు, వాటి స్నాన వాటికలు ఇలా ఎన్నో నిక్షిప్తమై ఉన్నాయి. అక్కడే ఆకలి మొదలవడంతో నేరుగా జంతర్‌ మంతర్‌ వైపుకు దారి తీసాం. డ్రైవర్‌ అక్కడే కాస్త మనదైన భోజనం దొరుకుతుందని చెప్పాడు.
జంతర్‌ మంతర్‌: స్వర్గంలోని సామరస్యాన్ని కొలిచే సాధనం అని దీనికి అర్ధమట. ఈ ప్రాంతంలోని కొన్ని కట్టడాల వల్ల దీనికి ఆ పేరు వచ్చినప్పటికీ రాజకీయ నాయకుల నుంచి సాధారణ ప్రజానీకం వరకు ఎవరు నిరసన తెలిపినా ఇక్కడే తెలుపుతారు. ఒక విధంగా ధర్నా చౌక్‌ లాంటిది. బాల్యం నుంచి వార్తల్లో ఈ పేరు వింటూ ఉండటం వలన నాకు జంతర్‌ మంతర్‌ చూడాలనే కోరిక చాన్నాళ్ళుగా ఉంది. అది ఈ రూపంలో నెరవేరింది. ఇక్కడ అన్ని ప్రాంతాలకు చెందిన ఆహారం లభిస్తుందట. అందుకే ఆ ప్రాంతం చూడటంతో పాటు లంచ్‌ కూడా అయిపోయింది. అలాగే తింటున్న సమయంలో వరంగల్‌ కు చెందిన దళిత యువజన నేతలు అక్కడ పరిచయం అవడం సంతోషం కలిగించింది. వారు దళిత హక్కుల పోరాటానికై ఢిల్లీ చేరారట. అక్కడి నుంచి దగ్గరలోనే ఉన్న పార్లమెంటు భవనం, ఆ ప్రాంగణానికి మరింత దగ్గరలో ఉన్న ఎంపీల గహాలు, బిఆర్‌ఎస్‌ కోసం నిర్మితమవుతున్న నూతన భవనం అన్నీ వరుసగా చూసుకుంటూ రాష్ట్రపతి భవనం చేరుకున్నాం. అక్కడ అందమైన ముఘల్‌ గార్డెన్‌ చూడాలని మా కోరిక. కానీ అదే సమయంలో సైనిక పటాలం దిగడంతో గార్డెన్‌ లోకి ప్రవేశం లభించలేదు. ఉసూరుమంటూ కుతుబ్‌ మినార్‌ వైపు వెళ్ళిపోయాం.
కుతుబ్‌ మినార్‌: ప్రపంచంలోనే ఎత్తైన ఇటుకల నిర్మాణం. ప్రపంచ వారసత్వ ప్రదేశాల జాబితాలో యునెస్కో వారు ఈ మినార్‌ ను కూడా గుర్తించారు. దీని ఎత్తు 72.5 మీటర్లు. కుతుబుద్దీన్‌ ఐబక్‌ నిర్మించాడు గనుక దీనికి ఆ పేరు వచ్చింది. ఈ మినార్‌ కు ఇంజనీరింగ్‌ విశిష్టత ఉంది. అదేమిటంటే ఏటా జూన్‌ మాసంలో 22వ తేదీన ఈ మినార్‌ నీడ భూమిపై పడదు. ఇది భౌగోళిక శాస్త్ర రహస్యం అట. ఈ పొడవాటి కట్టడాన్ని చూస్తూ, అందులోని రహస్యానికి ఆశ్చర్యపడి పోయాం. ఉత్తర అక్షాంశం మీద అయిదు డిగ్రీల ఒంపుతో దీనిని నిర్మించడం వల్ల ఈ అద్భుతం సాధ్యైందట. ఇక్కడే గంటన్నరపాటు కూర్చుని సేదతీరాం. ఇక సాయం సంధ్య కావడంతో ఇండియా గేట్‌ వైపుకు దారి తీసాం.
ప్రైడ్‌ ఆఫ్‌ ఇండియా: యమునా నది తీరాన ఉన్న భారతదేశపు రాజధాని నగరంలో ఉన్న చూడచక్కని ప్రదేశాలలో ఒకటైన ఇండియా గేట్‌ (×అసఱa +a్‌వ) 9 దశాబ్దాల క్రితం మొదటి ప్రపంచ యుద్ధంలో, అఫ్ఘన్‌ యుద్ధంలో అమరులైన 90 వేల యుద్ధజవానుల స్మత్యర్థం నిర్మించిన అపురూప కట్టడం. 42 మీటర్ల ఎత్తు ఉన్న ఈ కట్టడం భరత్‌పూర్‌ ఎర్రరాయితో నిర్మించబడింది. 1971 నుంచి ఇక్కడ అమర్‌ జవాన్‌ జ్యోతి కూడా వెలుగుతోంది. ఇండియా గేట్‌ పరిసరాలలో చూడముచ్చటగా ఉన్న పచ్చిక బయళ్ళు, చిన్నారులు ఆడుకోవడానికి సుందరమైన పార్కు, బోట్‌ క్లబ్‌ ఉండటమే కాకుండా ఇక్కడి నుంచి నేరుగా రాష్ట్రపతి భవన్‌ చూడడం మరుపురాని అనుభూతినిస్తుంది. ఉదయం వేళలో మరోసారి చూడాలని అనుకున్నాం. ఇక్కడ సైనిక కవాతు ఎంతో అద్భుతంగా ఉంటుందని చాలాసార్లు విని ఉన్నాను. అయితే మరుసటిరోజు నిజాముద్దీన్‌ దర్గా వైపు వెళ్ళాల్సి ఉండడంతో చూడలేకపోయాం. అక్కడే 9 గంటలవరకూ గడిపి తట్టుకోలేని చలితో హోటల్‌ కు పయనమయ్యాం.
నిజాముద్దీన్‌ దర్గా: సూఫీలలో అత్యంత ప్రముఖ సూఫీ హజరత్‌ నిజాముద్దీన్‌ ఔలియా. ఎంతో చారిత్రక ప్రాధాన్యత కలిగిన దర్గా. ఈ దర్గాకు చుట్టూతా పూవులు, ఆహారం, ధట్టీలతో కూడిన షాపులు నిండుకుని ఉన్నాయి. ఇరుకు దారుల గుండా దర్గాలోపలికి ప్రవేశించాం. లోపలకు అడుగుపెట్టిన తరువాత అంతా ఆధ్యాత్మిక వాతావరణమే. మొక్కులు తీర్చుకునే వారు, దర్గా సందర్శనార్థం వచ్చిన వారితో కిక్కిరిసిపోయింది. హిందీ సినిమా రాక్‌ స్టార్‌ లో హీరో ఈ దర్గాలో కూర్చుని ‘కున్‌ ఫాయ కున్‌’ గీతాన్ని ఆలపిస్తాడు. అలా ఖవ్వాలీ జరిగే ప్రదేశాన్ని చూసేసరికి మనసు ఎంతో ఉద్వేగంతో కొట్టుకుంది. కాసేపు దువా చేసుకున్న అనంతరం బయటకు వచ్చేసాం. ఆ షాపుల వద్ద లభించే స్వీట్‌ ఎంతో ప్రసిద్ధి చెందినది. పూరీ హల్వా ఎందరో పర్యాటకులు ఇష్టంగా తింటుంటారు. అప్పటికే మాకు ఆకలిగా ఉండటంతో హైదరాబాదీ బిర్యానీ పేరుతో బోర్డు కనిపించడంతో కాస్త హుషారు వచ్చేసింది మా అందరిలోనూ. పంజాబీ ధాబాలో బాయిల్డ్‌ రైస్‌ తిన్న అనుమానంతో వెంటనే ఆర్డర్‌ చేయకుండా ఆచితూచి ఒక్క ప్లేట్‌ మటుకే ముందుగా తెప్పించుకున్నాం. అదీ బాయిల్డ్‌ రైస్‌ తో చేసిన బిర్యానీయే. దాంతో చికెన్‌ తందూరితో నాన్‌ రోటీ ఆర్డర్‌ చేసుకున్నాం. అది కాస్త హాయిగా తినేసి ఆ పక్కనే ఉన్న హుమాయూన్‌ టూంబ్స్‌ కు కాలి నడకన బయలు దేరాం.
హుమాయూన్‌ సమాధి: ముఘల్‌ సామ్రాజ్య వ్యవస్థాపకుడు బాబర్‌ కొడుకు హుమాయున్‌. హుమాయూన్‌ తనయుడు అక్బర్‌. హుమాయూన్‌ చక్రవర్తి పండితుడు. అతడు చిన్న వయసులోనే మరణించడంతో అత్యంత పిన్న వయసులోనే (14ఏళ్ళు) అక్బర్‌ రాజ్యపాలనను చేపట్టవలసి వచ్చింది. ఆ సమయంలోనే అక్బర్‌ తల్లి, హుమాయూన్‌ భార్య హమీదా బేగం హుమాయూన్‌ సమాధిని నిర్మింపచేసింది. దీనికి కూడా ప్రపంచ వారసత్వ ప్రదేశాల జాబితాలో యునెస్కో గుర్తింపు లభించడం విశేషం. ఎనిమిది సంవత్సరాల పాటు నిర్మించారు. తాజ్‌ మహల్‌ కు పూర్వం ఈ కట్టడం దేశంలోనే అత్యంత సుందర కట్టడంగా పేరొందింది. ఎంతో అద్భుతంగా నిర్మించిన ఈ కట్టడానికి చుట్టూ ఎన్నో తోటలు ఉన్నాయి. ఈ కట్టడాన్ని ఎంత చూసినా తనివి తీరలేదు.
ఈ సుందర కట్టడాల షాన్‌ దార్‌ ఢిల్లీని చూసి రాత్రి 8గంటల ఫ్లైట్‌ కోసం విమానాశ్రయం చేరుకున్నాం. కుటుంబం అంతా కలిసి చేసిన ఈ పర్యటన ఎన్నెన్నో మధురానుభూతులను మిగిల్చింది. ఇంకా లోటస్‌ టెంపుల్‌, అక్షరధామ్‌, లోడీ గార్డెన్‌, బిర్లా మందిర్‌, సఫ్దర్‌ జంగ్‌ టూంబ్‌, రాజ్‌ ఘాట్‌ వంటి మరెన్నో నిర్మాణాలు ఇంకా మిగిలే ఉన్నాయి. కానీ సమయాభావం వల్ల మా పర్యటనను ముగించాల్సి వచ్చింది. ఎంతో ఆసక్తికరమైన టూర్‌. కొత్త ఢిల్లీ, పాత ఢిల్లీలను కలిపి పర్యటించాలంటే నా మటుకు వారం రోజులు కేటాయించాలనిపించింది. అప్పుడైతేనే చారిత్రక ప్రాధాన్యతను సమగ్రంగా గ్రహించవచ్చుననిపించింది. ఈ పర్యటన ఎంతో హాయిగా సాగిపోయినా పాతఢిల్లీలో అపరిశుభ్రమైన వాతావరణం ఉంది. అలాగే రాజధాని కావడంతో అన్ని రాష్ట్రాల ప్రజలు అక్కడ కనిపిస్తారు. అందులో పేదవారు కూడా ఎక్కువ సంఖ్యలో కనిపించారు. అక్కడ మనుషులను కూర్చోబెట్టుకుని కార్మికులు కాళ్ళతో తొక్కే రిక్షాలు ఇంకా కనిపిస్తున్నాయి. గుట్కాలు నములుతూ ఎక్కడపడితే అక్కడ ఉమ్మి వేయడం చాలా చోట్ల కనిపిస్తుంది. చాలా మంది టాక్సీ డ్రైవర్లు పరిశుభ్రమైన రోడ్లపై కూడా నిరభ్యంతరంగా ఉమ్మి వేస్తున్నారు. ఇక మనం ఏ ప్రదేశాన్ని చూడాలనుకున్నా కనీసం ఒకట్రెండు కిలో మీటర్లు నడవాల్సిందే అనే విషయాన్ని జీర్ణించుకుని మరీ రావాలి ఎవరైనా.
నచ్చినవి: కాలుష్య నియంత్రణ కోసం ప్రభుత్వం ఈ-ఆటోలను ప్రోత్సహిస్తోంది. ఎక్కడ పడితే అక్కడ ఈ ఆటోలు కనిపించాయి. చడీచప్పుడు కాకుండా నడుస్తున్నాయి. పాత ఢిల్లీకి పూర్తి విరుద్ధంగా ఎంతో అందంగా ఉంది న్యూఢిల్లీ. జీవిత వైరుధ్యాలు కచ్చితంగా ఇక్కడ చూడొచ్చు.
– నస్రీన్‌ ఖాన్‌
writernasreen@gmail.com