‘మే’ నెలలో ఒక రోజు

నీరసంతో నిద్ర లేచిన ఉదయం
బలిసిన సూర్య కిరణాలతో
పళ్ళు తోముకుంటోంది…

వాడిన విప్పపూలు నేలకు రాలి
మట్టితో స్నానిస్తున్నాయి !
దారి తప్పిన కోతి పిల్ల విప్పపూల మత్తులో
తల్లిని కాసేపు మరిచిపోయి
కాలం నీడలో తూగుతోంది !

కిన్నెరసాని ఒడ్డున
తుమ్మెద, ప్రతి పూల పొద మీదకు వాలుతోంది
తెగిన రెక్కల్ని తుంటరి కుర్రాడు కప్పుకుంటూ –
గాలి మాత్రం
రికామీలా, నీటి పైకి జారిన ఎండు పుల్లలతో
సరాగాలాడుతోంది

కొలను అడుగు భాగంలోంచి
ఆత్మలు నిద్ర లేచినట్లు
నీటిని కోస్తూ – చేపలు ఒడ్డు దాటి వెళ్లే ప్రయత్నం..
పాత పుస్తకంలోని పేజీల మీది అక్షరాల్లా
చేపలు, అక్షరాలూ ఆచ్చాదన లేని కన్నీళ్లే

చెట్లన్నీ ఎండని తాగుతూ
నీడల్ని వర్షిస్తున్నాయి
అడవి ఆకుపచ్చని దుస్తుల్ని కప్పుకొంది
పాండవుల గుట్టపై బౌధ్ధ భిక్షువులు
తమ మలిన వస్త్రాలను విసర్జించి దిగంబరులయ్యారు

పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి మండలం, గుంటుపల్లి గ్రామం వద్ద అడవుల్లోనున్న ఈ పాండవుల గుట్టపై క్రీ. పూ. 3వ శతాబ్దానికి చెందిన బౌద్ధ ఆరామాలు (కొండ గుహలు) ఉన్నాయి.

– డా. రూప్‌కుమార్‌ డబ్బీకార్‌
99088 40186