కవితో అక్షర ప్రయాణం

‘దుర్గాపురం రోడ్‌’ మనిషి నిరంతర పధికుడు. కారణాలేవైతేనేమి పుట్టిన ఊరు, ప్రాంతం వదిలి, చదువు, ఉద్యోగరీత్యా ప్రయాణం జీవితంలో భాగమైంది. మరికొందరైతే దేశాన్ని వదిలి మరో సంస్కృతిలోకి ప్రవేశించి మరీ వెళ్లి పోతున్నారు. ఈ ‘ఫ్లక్స్‌’ మనల్ని నీడలా వెంటాడుతుంది. ఆధునిక సమాజంలో ప్రయాణం తప్పనిసరి పరిస్థితి. అది కూడా ఒక ‘ఎగ్జిస్టెన్స్‌’. దేశరాజు ‘దుర్గాపురం రోడ్‌’ ఒక కవిత్వ ప్రయాణం. ఆయన వేళ్ళు ఉత్తరాంధ్ర మట్టిలో, అడవిలో, జనజీవన స్రవంతిలో, ఊపిరి పోసుకున్నాయి. అక్కడ ప్రోది చేసుకున్న సామాజిక స్పృహ, రాజకీయ చైతన్యం ఆయనకు స్థిరమైన పునాది. ఆపైన ఆయన ప్రయాణం ఒక పక్క బుద్ధి జీవునిగా మరొక పక్క ఎరుక (అవేర్నెస్‌) ఉన్న వ్యక్తిగా సాగింది.

స్వాతంత్రం వచ్చాక ఎవరినీ నిందించలేని ‘స్వయం పరాయి దౌష్ట్యం’ దేశాన్ని అతలాకుతలం చేయడం కళ్ళారా చూస్తూ, అదే వ్యవస్థలో బతుకుతున్న ఒక సంక్లిష్ట తరానికి దేశరాజు కూడా చెందు తారు. అంతలోనే సాంకేతికత లోహపు చక్రాల కింద, ప్రతి నాలుగేళ్లకు పదేళ్ల మార్పుల్ని చూస్తున్నాం. అందుకే రైలు పట్టాల మీద పెట్టిన రూపాయి బిళ్ళలాగా ఆ ఘర్షణ వేడికి రూపం మారిపోయినా, ఎలాగో కరిగిపోకుండా అస్తిత్వాన్ని కాపాడుకునే తరం మాది. ఈ హృదయాలకు గొంతుకనిచ్చే కవిత్వమే ‘దుర్గాపురం రోడ్‌’.
”భూగోళం పై మనిషి ఉనికిని
చాటిన వారిని అభినందిద్దాం” అంటూ తన ఆంతర్యాన్ని వివరిస్తాడు ఈ కవి. దేశరాజు అక్షర ప్రేమికుడు. కవి అంటే అతడే కదా!
”మనం చేసిన నినాదమే
జైలు గోడల మధ్య
పలకరింపు అవుతుంది
మనం నమ్ముకున్న అక్షరమే
మన ఆశలకు కొమ్ము కాసి కటకటాలను ఛేదిస్తుంది” అని నమ్ముతారు. ఈయనకు ‘ప్రాగ్మెంటేషన్‌’ అవలీలగా వచ్చిన విద్య. మన కన్ను చూసే రూపమే సెకండ్‌కి 10 మిలియన్‌ బిట్స్‌. ఇక కవిగా ఈయన అంతర్నేత్రం ప్రతి చోటా దాగి ఉన్న దోపిడీ, అవినీతి అసమానత, అసంబద్ధతలను తన అక్షరాలలో దర్శింపచేయగల శక్తి కలవారు. అందుకే ఆ వాక్యాలు ప్రత్యేకంగా అనిపిస్తాయి.
”న్యాయవ్యవస్థ హిపోక్రసీకి
ఆసేతు హిమాచలం నిదర్శనం”
”తప్పుని కప్పిపుచ్చుకోవడం కాదు
సాహసవంతంగా చేయడమే
హీరో ఇజం అవుతున్న వేళ
ప్రభుత్వాధినేతలను అనాల్సిన పనిలేదు” అంటూ నిర్భయంగా ప్రకటిస్తాడు.
ఈనాడు మార్కెట్‌ వస్తు వినిమయం నుంచి మేధో వినిమయం దాకా విస్తరించింది. ఇప్పుడు అంతా అమ్మకాలు, కొనుగోళ్లు. అప్పుడెప్పుడో యంత్రాలను నడిపేందుకు కార్మికులను ఫ్యాక్టరీ సైరన్‌ పిలిచేదనీ, మనుషుల్ని ముఖాలుగా కాదు పనిచేసే చేతులుగా లెక్క వేసేదనీ మనం అనుకోక్కర్లేదు. ఇప్పుడు ‘లాగిన్‌’ సమయం ఇచ్చి, మేధను పెట్టుబడిగా చేసి, ఇంకోటి… మరోటి… అంటూ ఆలోచనలని, సత్తువని, సంపదని ‘స్ట్రా’ వేసి పీల్చేస్తోంది పోటీ ప్రపంచం.
అందుకు తోడు కుటుంబాన్ని, సమాజాన్ని, విజయవంతంగా ముక్కలు చేయడం ఈనాటి సాంకేతికత ‘హాల్‌ మార్క్‌’. కానీ ఇది మనిషిని ఒంటరిని చేసి, బహు కొద్దిమంది ప్రయోజనాలకు మాత్రమే కారణమౌతోంది. అందువల్లే ఈనాడు ఎటు చూసినా ‘ఖెయాస్‌’ కనబడుతుంది.
”పోరాటమైనా, ప్రేమైనా అలవాటు పడిపోవడం లోని హింస ఇదంతా” అంటూ ఈ కవి దుఃఖ స్వరూప స్వభావాలను పాఠకుడికి ప్రజెంట్‌ చేస్తారు. అనేక సందిగ్ధ సందర్భాలను ఒక్కోసారి వైయక్తిక మైన వాటిని సైతం, ఓర్పుగా పునః పరిశీలించడమే కవి చేసే మహోపకారం. కవిత్వ రూపం, ఎక్స్ప్రెషన్‌ ఎలా ఉన్నా చదివినప్పుడు వచ్చే సహానుభూతి పాఠకుడిని తన చుట్టూ ఉన్న గందరగోళ స్థితిని తడిమి చూసుకుని, అన్నింటినీ పక్కకు తోసి, మళ్లీ లేచి నిలబడేందుకు లోదష్టిని ఇస్తుంది.
”ఇక్కడ ఎవరూ తప్పిపోలేదు.. ఎవ్వరూ,
కేవలం కొన్ని వాన చినుకులు
తమ నల్లదనాన్ని అద్దుతున్నాయి నేలపై
స్పోటకం మచ్చల గచ్చు పై తెలుపు నలుపుల ఊగిసలాట”
చాలా రోజులు వెంటాడే వాక్యాలు ఇవి. అందుకే
”మనిషికి మనిషి ఎదురు పడటం కంటే
మనిషికి మనసు ఎదురైతే
పెద్ద ప్రళయమే ఎప్పుడైనా” అనే వివరణ కూడా ఇచ్చారు. దేశరాజు అటూ ఇటూ వీగిపోని సుస్పష్ట రాజకీయ స్పృహ కలిగిన వారు.
”చేష్టలు ఉడిగిన నిస్సత్తువ లోంచి
నువ్వు ఒక ఆయుధాన్ని కలగంటావు
వాడు ఎదురుగా వచ్చి కాల్చేసి నిశ్శబ్దంగా వెళ్ళిపోతాడు.
ఎందుకంటే నిన్ను నక్సలైట్‌ అనో,
తీవ్రవాది అనో అనాల్సిన అవసరం వాడికి ఇప్పుడిక లేదు”
ఫిబ్రవరి 2002 లో వ్రాసిన వాక్యాలు ఇవి. కవి దార్శనికతకు ఇంతకన్నా గొప్ప రుజువు ఏమి ఉంటుంది?
వ్యక్తి చుట్టూ తిరిగే అభివృద్ధిలో పొంచి ఉన్న స్వార్థం, స్వాతిశయం విశ్వమంతా వ్యాపిస్తే తప్ప అర్థం కాదు. నేడు దీన్నే సర్వస్వం అంటూ ప్రచారంలోకి తీసుకొచ్చారు. నిజానికి మానవ సమూహం మొత్తంగా ప్రగతి పథంలో నడవాలి అనే మేలుకొలుపు వాక్యం కదా కావాలి-అందుకే,
”ఓటమి విజయానికి తొలి మెట్టు” అనే వాక్యాన్ని సవరించి
”పోరాటమే విజయానికి తొలిమెట్టు” అని రచించారు కవి.
ఈయన కవితల్లో ”అమ్మానాన్న ఒక సంప్రదాయ నాటకం”- 76వ పేజీ, ”అచ్చు తప్పు”- 105 పేజీ – ఈ రెండు కాన్సెప్టును కవిత్వీకరించడంలో కొత్త పొంత తొక్కుతూ నవీనత కలిగి ఉన్నాయనిపించింది.
సిపాయి శ్రమను ‘నిశ్శబ్దం’గా, కవి అస్తిత్వాన్ని ”తురాయి చెట్టు మీద కాకి”గా కవితలుగా మలిచారు. ప్రతీకల్లో కొత్తదనం ఉన్నప్పటికీ కొరుకుడుపడనంత క్లిష్టంగా మటుకు లేవు.
కవిత్వానికి ప్రయోజనం ఉండాలా వద్దా అన్న మీమాంసను పక్కనపెడితే, ఎవరికి వారు ద్వీపాలుగా మారిన నేపథ్యంలో, సమాచార విస్ఫోటనంలో ఏది నిజమో, ఏది అబద్ధమో, తెలియని పరిస్థితుల్లో ప్రతి మనిషిని ఒక ఓటుగానో, ఒక పొటెన్షియల్‌ కస్టమర్‌ గానో, చూస్తున్న వేళ, దాగి ఉన్న నిజాలను వెలికి తీసి భ్రమలను పోగొట్టే శక్తి కవిత్వానికి మాత్రమే ఉంటుందని చెప్పొచ్చు.
అలా చూస్తే, ”ఆదివాసి” 96 పేజీ, ” మూగ పాట” 107 పేజీ కవితలు ఈ సంకలనానికి తలమానికం వంటివి. తమ ఐడెంటిటీని కోల్పోతున్న అడవి బిడ్డను, అవని బిడ్డను, ఈ కవితల్లో సాక్షాత్కరింప చేశారు. ఇందుకు దేశరాజు అభినందనీయులు.
– కాళ్ళకూరి శైలజ