భారీ అగ్ని ప్రమాదం

– టింబర్‌ డిపో నుంచి భవనంలోకి మంటలు
– దంపతులతో సహా చిన్నారి సజీవ దహనం
– ప్రభుత్వం తరపున రూ.6 లక్షలు, టింబర్‌ యాజమాన్యం రూ.25లక్షల సాయం
– హైదరాబాద్‌ కుషాయిగూడలో ఘటన
నవతెలంగాణ-కాప్రా/ సిటీబ్యూరో
హైదరాబాద్‌లో మరో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. కుషాయిగూడ లోని ఓ టింబర్‌ డిపోలో ఆదివారం తెల్లవారుజామున మంటలు చెలరేగి.. పక్కనే ఉన్న భవనంలోకి వ్యాపించడంతో అందులో ఉన్న దంపతులతో సహా ఓ చిన్నారి సజీవ దహనమయ్యారు. వివరాల్లోకెళ్తే.. యాదాద్రి భువనగిరి జిల్లా తుంగతుర్తికి చెందిన నరేశ్‌, సుమ దంపతులు రెండేండ్ల క్రితం హైదరాబాద్‌కు వచ్చి కుషాయిగూడలోని సాయినగర్‌ కాలనీలో వారి ఇద్దరి కొడుకులతో కలిసి నివసిస్తున్నారు. నరేశ్‌ ఓ గ్యాస్‌ ఏజెన్సీలో డెలివరీ బాయ్‌గా పని చేస్తున్నాడు. ఇదిలా ఉండగా ఆదివారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో వీరు నివసిస్తున్న భవనం పక్కనే ఉన్న టింబర్‌ డిపోలో మంటలు చెలరేగాయి. అవి అలాగే వ్యాపించి భవనానికి అంటుకోగా నరేశ్‌(35), సుమ(28), వారి చిన్న కొడుకు జోషిత్‌(5) సజీవ దహనమయ్యారు. పెద్ద కుమారుడు సమీప బంధువుల ఇంట్లో పడుకోవడంతో ప్రమాదం బారి నుంచి తప్పించుకున్నాడు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న అగ్ని మాపక సిబ్బంది, పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ముగ్గురు మృతదేహాలను వెలికి తీసి పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. తల్లిదండ్రులు, తమ్ముడి మృతదేహాలను చూసిన చిన్నారి బాధను చూసి స్థానికులు కన్నీటి పర్యంతమయ్యారు. షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా మంటలు చెలరేగినట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అలాగే ఈ ప్రమాదంలో పలువురు గాయపడినట్టు తెలిసింది. కాగా, విషయం తెలుసుకున్న రాష్ట్ర మంత్రులు మహమూద్‌ అలీ, మల్లారెడ్డి, మేయర్‌ గద్వాల విజయలక్ష్మి ఉప్పల్‌ ఎమ్మెల్యే బేతి సుభాష్‌ రెడ్డి, మాజీ మేయర్‌ బొంతు రామ్మోహన్‌, స్థానిక కార్పొరేటర్‌ బొంతు శ్రీదేవి ఘటనా స్థలానికి చేరుకొని ప్రమాదం గురించి ఆరా తీశారు.
ఆర్థిక సాయాన్ని ప్రకటించిన మేయర్‌
అగ్ని ప్రమాదంలో మరణించిన కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని, బాధిత కుటుంబానికి ఒక్కొక్కరికి రూ.2 లక్షల చొప్పున మొత్తం రూ.6 లక్షల సాయాన్ని అందిస్తామని మేయర్‌ గద్వాల్‌ విజయలక్ష్మి ప్రకటించారు. ప్రమాదస్థలం వద్ద సహాయక చర్యలు చేపట్టాలని జోనల్‌ కమిషనర్‌, స్థానిక కార్పొరేటర్‌ను ఆదేశించారు. ప్రమాదంలో మరణించిన కుటుంబానికి ప్రభుత్వం తరుపున సాయం అందించాలని మేడ్చల్‌ కలెక్టర్‌ను మేయర్‌ కోరారు. అలాగే ప్రమాదంలో గాయపడిన వారిని ఆస్పత్రిలో మేయర్‌, కార్పొరేటర్‌ పరామర్శించారు.
టింబర్‌ డిపో తరపున రూ. 25 లక్షలు సాయం
ప్రమాదంలో మృతి చెందిన కుటుంబానికి టింబర్‌ డిపో యాజమాన్యం నుంచి రూ. 25 లక్షలు పరిహారం అందేలా ఎమ్మెల్యే సుభాష్‌ రెడ్డి చొరవ తీసుకున్నారు. ముందుగా రూ. 2 లక్షలు అందించిన టింబర్‌ డిపో యాజమాన్యంతో ఎమ్మెల్యే మాట్లాడి మిగతా రూ. 23 లక్షలకు సంబంధించిన చెక్కులను బాధిత కుటుంబానికి అందజేసేలా చర్యలు తీసుకున్నారు.

Spread the love