యూనిక్‌ కథతో నయా సినిమా

హీరో అల్లరి నరేష్‌ తన 62వ ప్రాజెక్ట్‌ను శుక్రవారం అధికారికంగా అనౌన్స్‌ చేశారు. ఈ చిత్రానికి ‘సోలో బ్రతుకే సో బెటరు’ ఫేమ్‌ సుబ్బు మంగదేవి దర్శకత్వం వహిస్తుండగా, తాజాగా ‘సామజవరగమన’తో బ్లాక్‌బస్టర్‌ అందించిన హాస్య మూవీస్‌ బ్యానర్‌ పై రాజేష్‌ దండా, బాలాజీ గుత్తా నిర్మించనున్నారు. నరేష్‌ పుట్టినరోజు సందర్భంగా యూనిక్‌ స్టైల్‌ కాన్సెప్ట్‌ వీడియో ద్వారా చేసిన అనౌన్స్‌ మెంట్‌ ఆసక్తికరంగా ఉంటూ అందరినీ అలరించింది.
దర్శకుడు, అల్లరి నరేష్‌కి ఫోన్‌ చేసి కథ చెప్పడానికి మాస్‌ బార్‌ను సెలెక్ట్‌ చేసుకుంటాడు. లవ్‌, ఎమోషన్‌, యాక్షన్‌, డ్రామా అంశాలతో కూడిన కథ నరేష్‌ని మెప్పించిన తర్వాత.. సినిమాకు పని చేసే సాంకేతిక నిపుణులను పరిచయం చేశారు. ఈ కథ చాలా యూనిక్‌గా ఉంటుంది.
నరేష్‌ డిఫరెంట్‌ పాత్రలో కనిపించనున్న ఈ చిత్రానికి ‘సీతారామం’ ఫేమ్‌ విశాల్‌ చంద్రశేఖర్‌ సంగీతం అందిస్తుండగా, ‘మానాడు, రంగం, మట్టి కుస్తి’ చిత్రాలకు పనిచేసిన రిచర్డ్‌ ఎం నాథన్‌ కెమెరామెన్‌గా పని చేస్తున్నారు. ఛోటా కె ప్రసాద్‌ ఎడిటర్‌, బ్రహ్మ కడలి ప్రొడక్షన్‌ డిజైనర్‌గా వ్యవహరి స్తున్నారు. దర్శకుడు సుబ్బు స్వయంగా కథ, స్క్రీన్‌ ప్లే అందిస్తుండగా, విప్పర్తి మధు స్క్రీన్‌ ప్లే రైటర్‌ గా పని చేస్తున్నారు. హీరో భావోద్వేగ ప్రయాణంలో సాగే ఈ కథ 1990 నేపథ్యంలో ఉంటుంది. సెప్టెంబర్‌ చివరి నుంచి షూటింగ్‌ని ప్రారంభిస్తారు. మూర్ఖత్వం బోర్డర్‌ దాటిన ఓ యువకుడి కథగా మేకర్స్‌ దీన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్టు అనౌన్స్‌మెంట్‌ సందర్భంగా రిలీజ్‌ చేసిన గ్లింప్స్‌ చెప్పకనే చెప్పింది.

Spread the love