మహోన్నత సమాజాన్ని కలగంటున్న కవి

A poet who meets high societyతాను నమ్మిందే గొప్ప అని అదే తాత్విక చింతనతో సమాజాన్ని వెనక్కి తీసుకెళ్లే కవులు, రచయితలూ వుంటారు. సమాజాన్ని నిత్యచైతన్యవంతంగా మార్చడానికి ముందుకెళ్లే కవులూ వుంటారు. ఆనందాచారి ప్రపంచాన్ని, సమాజాన్ని ఆలోచిస్తున్న దశ నుంచి సాంస్కతిక, సామాజిక ఉద్యమాలలో క్రియాశీలకంగా పని చేశాడు. ఎగుడూ దిగుడూ సమాజంలో అడుగున వున్న భావాలను అగ్రస్థానంలో వున్న జనాలను శాస్త్రీయ ఆలోచనా విధానంతో అర్థం చేసుకున్నాడు. అందుకే ఇతని కవిత్వం బలమైన సామాజిక తాత్వికతలోంచి పుట్టింది ‘ఇక ఇప్పుడు’. ఆయన కవితా సంపుటే దీనికి తార్కాణం. ఇందులోని కవితలన్నీ ఆయన నిబద్దతను తెలియజేస్తాయి.
”సహనం కోల్పోతున్నాం / స్నేహం కోల్పోతున్నాం /విలువలు కోల్పోతున్నాం” ఆధునిక మానవుని జీవితం సంక్లిష్టమైనకొద్దీ మనిషి సహజ త్వాన్నే కోల్పోతున్నాడని అంటాడు. ఈ రోజు మనిషిని మార్కెట్‌ మాయాజాలం శాసిస్తున్నది. అతని జీవితాన్ని మార్కెటే నిర్ణయిస్తున్నది.
అందుకే ”సుఖమంటే సౌకర్యాల సాలె గూట్లో /విలాసాల విన్యాసాలు చేస్తూ / సరకుల్ని ఆలింగనం చేసుకోవడమే/ ఎదురుగా పుట్టెడు దుఃఖం పొంగి పొర్లుతుంటే /చూసి ఆనందించడమే” అని ప్రస్తుత పరిస్థితుల వాస్తవ రూపాన్ని మన కండ్ల ముందుంచాడు.
అదే కవితలో చివరికి ”ఎదుటివారి సుఖాల్ని ఒక్కడే కొనుక్కోవడం /దొరక్కపోతే దోచుకోవడం” అని మార్కెట్‌ అసలు రూపం గుట్టు విప్పుతాడు. సామ్రాజ్యవాద విష సంస్కతిలో వస్తు మార్కెట్‌ అన్ని రంగాలను లొంగదీసుకుంది. చివరికి మనిషినే వస్తువుగా మార్చేసింది. ఆధునిక సాహిత్య దక్పథం వున్న కవి, రచయిత నిరంతరం వర్తమానాన్ని శోధిస్తూ సమకాలీన అంశాలపై స్పందిస్తుంటాడు. ఆనందాచారి ఏ ఒక్కరి కోసమో కలం పట్టిన కవి కాడు. సమాజంలో ఎవరూ దుఃఖ పడ కూడదు. ముఖ్యంగా శ్రమ లోనూ, ప్రతిభలోనూ, ప్రేమలోనూ ఉదాత్త స్థానంలో వున్న మహిళ నేటికీ భారతీయ సమాజంలో ఆర్థిక, సామాజిక వివక్షకు గురైతున్నది. ఈ విషయాన్నే కవి ఈ సంపుటిలో అర్థమైన కవితలుగా పొందుపరిచాడు. వీటిలో ప్రధానంగా మానవ మగాలకు బలైన ఆసిఫా, బూబమ్మ, దళిత స్త్రీల గురించి కవితలు రాశాడు. అంతేగాకుండా ప్రపంచ మహిళా లోకానికే ధీర వీర వనితయిన మాలాలా వ్యక్తిత్వంను ఉదాత్తంగా ఆవిష్కరించాడు. ప్రతిరోజూ తాను చూసిన సాధారణ దశ్యాలను అందమైన కవితా చిత్రాలుగా మలిచాడు. అంతే గాకుండా మహిళల్ని ”ఎగరడం కోసమే ఎగరొద్దు/ ఎదగడం కోసం ఎగరాలి” అని ప్రేమతో కూడిన బాధ్యతను గుర్తు చేస్తాడు. ఇంకా అదే కవితలో ”ఎగరడానికి బలమొక్కటే కాదు / ఎదలో ఆశయం ప్రజ్వలిస్తూ” ఉండాలంటాడు. స్త్రీలు పురుషులనే కాకుండా అనాది నుంచి భారతీయ సమాజంలో మనువాదం సమాజ ప్రగతికి ప్రతిబంధకంగా మారింది. అగ్రవర్ణ ఆధిపత్యం, వర్ణ వివక్ష కనబడని సంకెళ్లుగా మారి వ్యక్తి స్వేచ్ఛకు, చైతన్యానికి అడ్డుగా నిలిచింది. మరీ ఈ మధ్య మరింత విజృంభిస్తూ మనుషులనే బలి తీసుకుంటున్నది. ఇతను కులానికీ, మతానికిప్రాంతనికి అతీతంగా మనిషిని మహోన్నతంగా నిలబెట్టే కవిత్వం రాశాడు. మరో కవితలో ”వాడంతే / కుళ్ళిన కుళ్ళంతా కనబడకుండా/ కాషాయాన్ని ముసుగెసుకున్నాడు/ అనాగరికి బానిస యుగానికి నిత్య ప్రేమికుడు / నియంతత్వ వున్మాదానికి తోబుట్టినోడు / ప్రజాస్వామ్యమంటే రక్తం కక్కుకుంటాడని” అసలు స్వభావాన్ని బయట పెట్టాడు. అలాగే రోహిత్‌ వేముల గురించి ”నేడు రోహిత్‌ ఒక నామవాచకం కాదు /వేళ ఏండ్లుగా /మనువుల దాష్టీకాలపై/ఎగిరిపడ్డ క్రియాపదం” అని ఆధునిక యుగంలోనూ కులతత్వం దళితుల ప్రతిభను ఓర్వలేక మధ్య లోనే చిదిమేస్తున్నారని, ఒక్క రోహిత్‌నే కాదు అనేక బహువచనాలు నేలరాలు తున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తూనే ”గతం కాదు అతని మరణం / వర్తమానం” అని ఎదిరించాలంటాడు.
సమానత్వం, సహజీవన భావం గల కవి ఎప్పుడూ మనిషిని మనిషిని కలిపే ప్రయత్నం చేస్తాడు. కలిసి జీవించడంలోని మధుర్యాన్ని తెలియ జెప్తాడు. చీలిపోయిన మనుషుల్ని కలిసి జీవించాలని విశాల హదయంతో ఈ కవితలో ఆహ్వానిస్తాడు. ”కలుద్దాం మిత్రమా” కవితలో ”రేపు కలవకపోతే /ఇక కలవలేం /కలుద్దాం మిత్రమా /రాత్రినీ చుక్కలను కలపటానికి, వెలుగును దారిలో పరవటానికి” కలుసుకో వాలంటాడు కలుసుకోవడంలో అనుకున్నా ఆశయాలు ఫలిస్తాయని అభ్యుదయం నెలకొంటుందాంటాడు. మానవీయ విలువల్ని ప్రేమించలేని కవి ఆధునికుడు ఎట్లా అవుతాడు.
ఆధునిక కవి… ముఖ్యంగా ప్రజల కవి అంటే ఎల్లప్పుడూ ప్రజా నాడిని పరీక్షించడం, ప్రజలకు జవాబుదారీగా ఉండడం సమాజానికి విధేయుడుగా ఉండడం. ఆనందాచారి కవిత్వంలో శిల్ప సౌందర్యం ఉంటుంది. ఇక్కడ ”మనకు బతుకునిచ్చేది /మనల బ్రతక నిచ్చేది /మాటనిచ్చేది /మనసు చెలిమలో /భావాల వూటనిచ్చేది /ఈ మట్టే” నంటూ మట్టి గొప్పతనాన్ని చెట్టు త్యాగాన్ని అద్భుత కవితగా చిత్రించాడు.
సమాజాన్ని అర్థం చేసుకునే విధానాన్ని బట్టి కవిని ఎటువంటి కవో తెలుసుకోవచ్చు. ప్రపంచాన్ని వణికించిన కరోనా సమయంలో ఈ కవి కంపెనీలు, ఫ్యాక్టరీలు మూత బడి వలస కార్మికులు తమ ఇళ్లకు పయనమవ్వడం చూసి పెట్టుబడిదారీ రంగం నిర్దయ గురించి ”ఇక్కడ తనవారెవరూ లేరు /గొంతులో ఇన్ని ఇంకిన నీళ్లయినా తోడులేవు /నీడ కూడా లేని ఎడారి తనాన/ తమ వాడలు గల ఊళ్ళకు వాళ్లు చేరాలి / చావు చేరుతుందని గావుకేక వేస్తున్నారు /వేలాది చావులకు నీడలు పడుతున్నారు / ఆకలి అంటుకుందంటే / వెంటబడి వేటడుతున్నార”ంటూ కష్ట కాలంలోనూ కనికరం లేని శవం మీది డబ్బులేరుకునే నీచత్వాన్ని కవి హదయ విధారకంగా చిత్రించాడు. కవిత్వంలో ప్రయోగాలు కవిత్వానికి సజీవత్వాన్ని కలిగిస్తాయి.
కవిత్వంను బతికించడమంటే టన్నుల కొద్దీ సంపుటాలు రావాలని కాదు. కవికీ కవికీ కాలానికి కాలానికీ వస్తువులో రూపంలో కొత్తదనముండి తీరాలి. ఈ సంపుటిలోనూ నూతన అభివ్యక్తి శిల్ప నైపుణ్యంతో చాలా కవితలు కావ్యానికి నూతనత్వాన్నిచ్చాయి.
గత నాలుగు పదుల జీవితానుభవంతో సుధీర్ఘ సాహిత్యానుబంధంతో కాలాన్ని చదువుతూ, సమాజాన్ని పరిశీలిస్తూ వస్తున్న కవి ఆనందచారి. ప్రధానంగా ఈ దాశబ్ది కాలంలో అంతర్జాతీయ, జాతీయంగా వచ్చిన పెను మార్పుల్ని ముఖ్యంగా ధ్వంసమవుతున్న మానవ విలువల్ని ఈ సంపుటిలో కవితలుగా మలిచాడు. సాంస్కతికంగా మనిషి నుంచి మనిషిని వేరు చేసే మతోన్మాద చర్యలను నిరసిస్తూ కవిత్వీకరించాడు. దళితులు, స్త్రీలు, గిరిజనులు పేదలు అందరూ సామజికంగా, ఆర్థికంగా సంపూర్ణ వికాసం పొందాలనే ఈ కవి ప్రగాఢ కోరిక ఈ పుస్తకంలో కనబడుతుంది. కవిత్వాన్ని కవిత్వంగానే చూడాలనుకునే వారికి దీనిలో ఏమీ దొరకదు. వస్తువును వస్తువుగానే గ్రహించాలనుకునే వారికీ, అదీ అసాధ్యమే. ఇటు రూపంలోనూ అటు వస్తువులోనూ సారూప్యతను సాధించి తెలుగు కవిత్వనికి గొప్ప భరోసానిచ్చాడు ఈ కవి.
– డా. ఉదారి నారాయణ, 00000