ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య

నవతెలంగాణ – హైదరాబాద్: వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని ఓ మహిళ తన భర్తను ప్రియుడితో కలిసి హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించిన ఘటనలో పోలీసులు నిందితులను అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. కృష్ణాజిల్లా, మట్టం గ్రామానికి చెందిన జయకృష్ణ(36), దుర్గా భవానీ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరు నగరానికి వలసవచ్చి జగద్గిరిగుట్ట పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని ఆల్విన్‌కాలనీ కమలాప్రసన్న నగర్‌లో నివాసం ఉంటున్నారు. జయకృష్ణ జిమ్‌ ట్రైనర్‌గా పని చేస్తున్నాడు. అయితే దుర్గా భవానీ గత కొన్నేళ్లుగా జయకృష్ణ స్నేహితుడు చందానగర్‌కు చెందిన చిన్నాతో వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. ఈ క్రమంలో 25 రోజుల క్రితం సొంత ఊరుకు వెళ్లిన జయకృష్ణ అక్కడే స్థిర పడాలని నిర్ణయించుకుని ఈ నెల 10న ఇంటిని ఖాళీ చేసి కుటుంబాన్ని తీసుకువెళ్లేందుకు నగరానికి వచ్చాడు. అయితే ఇది ఇష్టం లేని దుర్గాభవానీ ఎలాగైనా భర్త అడ్డు తొలగించుకోవాలని భావించి ప్రియుడు చిన్నాతో పథకం పన్నింది. ఇందులో భాగంగా జయకృష్ణకు ఫుల్లుగా మద్యం తాగించిన అనంతరం అతడిపై పెట్రోల్‌ పోసి నిప్పంటించి హత్య చేశారు. ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్యకు పాల్పడినట్లు చుట్టు పక్కల వాళ్లను నమ్మించారు. మృతుడి తండ్రి తిరుమణి వడ్డికాసులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దుర్గాభవానీ, చిన్నాలను అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా నేరం అంగీకరించారు. నిందితులపై కేసు నమోదు చేసిన జగద్గిరిగుట్ట పోలీసులు వారిని రిమాండ్‌కు తరలించారు.

Spread the love