నవతెలంగాణ-హైదరాబాద్ : వెనుకబడిన వర్గాల కుల, చేతివృత్తిదారులకు ప్రభుత్వం రూ.లక్ష ఆర్థికసాయం అందించాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. అందుకు సంబంధించి అర్హుల నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ మంగళవారం (6వ తేదీ) నుంచి ప్రారంభమైంది. ఈ నెల 20వ తేదీ వరకు ఈ ప్రక్రియ కొనసాగనున్నది. ఈ నెల 9న మంచిర్యాల జిల్లాలో సీఎం కేసీఆర్ చేతుల మీదుగా లాంఛనంగా లబ్ధిదారులకు సాయం అందించడంతోపాటు అదేరోజు అన్ని నియోజకవర్గాల్లో గౌరవ మంత్రులు, ఎమ్మెల్యేలతో పథకాన్ని ప్రారంభించనున్నారు.
రూ.లక్ష ఆర్థిక సాయం అందించేందుకు అర్హుల నుంచి దరఖాస్తుల స్వీకరణ కోసం రూపొందించిన https://tsobmmsbc.cgg.gov.in వెబ్సైట్ను డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్ మంగళవారం ప్రారంభించారు. దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియను కూడా ఆరంభించారు. ఈ సందర్భంగా మంత్రి గంగుల మాట్లాడుతూ, బీసీ కులవృత్తులు నిర్వహించుకొనే చేతివృత్తిదారులకు రూ. లక్ష ఆర్థిక సహాయం అందించి, ప్రభుత్వం అండగా నిలువనున్నదని చెప్పారు. ఈ నెల 20వ తేదీ వరకు దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతుందని స్పష్టం చేశారు.
* వెనుకబడిన కులాలు, చేతివృత్తులకు చెందిన వారంతా ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు.
* ఎంచుకున్న వృత్తిలో రాణించడానికి వీలుగా ఒక్కో లబ్ధిదారుడికి రూ.లక్ష ఆర్థిక సాయాన్ని అందిస్తారు.
* ఒక కుటుంబంలో ఒక్కరికి మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది.
* 2023 జూన్ 2 నాటికి 18-55 ఏళ్ల మధ్య వయస్కులు మాత్రమే అర్హులు.
* లబ్ధిదారుడి వార్షిక ఆదాయం గరిష్ఠంగా గ్రామాల్లో రూ.1.50 లక్షలు, పట్టణాల్లో రూ.2 లక్షలు మించకూడదు.
* గత అయిదేళ్లలో ఇతర ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వారా రూ.50 వేలు అంతకంటే ఎక్కువ మొత్తాన్ని ఇప్పటికే పొందిన లబ్ధిదారులు ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి అనర్హులు.
* ఈనెల 6 నుంచి 20 తేదీ వరకు https://tsobmmsbc.cgg.gov.in వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలి.
* మండల స్థాయిల్లో ఎంపీడీఓలు, పురపాలికల్లో మున్సిపల్ కమిషనర్లు ఈనెల 20 నుంచి 26 వరకు దరఖాస్తులను పరిశీలించాలి.
* జిల్లా కలెక్టర్ నేతృత్వంలోని కమిటీ జిల్లాస్థాయిలో ఎంపిక పూర్తి చేయాలి. దీనికి సంబంధించిన అనుమతులను ఈనెల 27 నుంచి జులై 4 వరకు సంబంధిత జిల్లా ఇన్ఛార్జి మంత్రుల ద్వారా పొందాలి.
* లబ్ధిదారులను దశల వారీగా ఎంపిక చేసి, ఆ సమాచారాన్ని గ్రామాలు, మండలాల వారీగా వెబ్సైట్లో పొందుపరుస్తారు.
* ఎంపికైన లబ్ధిదారులకు ప్రతినెలా 15న ఏక మొత్తంలో రూ.లక్ష ఆర్థిక సాయాన్ని విడుదల చేస్తారు.
* ఏ వస్తువులు, పరికరాలు కొనాలనేది లబ్ధిదారుల ఇష్టమే.
* ఆర్థిక సాయం పొందిన లబ్ధిదారులు నెల రోజుల్లోపు తమ వృత్తిని ప్రారంభించాలి. అవసరమైన సహాయ సహకారాలను అందించేందుకు జిల్లా కలెక్టర్ ఒక ప్రత్యేకాధికారిని నియమించాలి. లబ్ధిదారుడు ప్రారంభించిన వృత్తికి సంబంధించిన ఫొటోలను వెబ్సైట్లో అప్లోడ్ చేయాలి.