రైతులకు సంకేళ్లు వేసిన అధికారులపై చర్యలు తీసుకోవాలి

– ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
రిజనల్‌ రింగ్‌ రోడ్‌ (ఆర్‌ఆర్‌ఆర్‌) భూ నిర్వాసితులపై అక్రమ కేసులు బనాయించారని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి విమర్శించారు. కోర్టు బెయిల్‌ ఇచ్చినా వారికి చేతులకు బేడీలు వేశారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులకు సంకేళ్లు వేసిన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఒక ప్రకటనలో డిమాండ్‌ చేశారు. భూసేకరణ పేరుతో బలహీన వర్గాలు, దళితుల భూములను బలవంతంగా తీసుకుంటున్నదని తెలిపారు. గవర్నమెంట్‌ భూములు తీసుకోకుండా రైతుల దగ్గర ఉన్న ఎకరం, రెండెకరాల భూమిని గుంజుకుంటున్నారని తెలిపారు. వారసత్వంగా వస్తున్న కొద్దిపాటి భూమి పోతోందన్న బాధతో భువనగిరి, రాయగిరితోపాటు మిగిలిన గ్రామాల రైతులు పోరాటం చేస్తున్నారని వివరించారు. రైతులపై నమోదు చేసిన కేసును బేషరతుగా ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు.