ఎన్నికల కోసమే బీజేపీ యూసీసీ నాటకం ఎఐయూడీఎఫ్‌ విమర్శ

న్యూఢిల్లీ : ఎన్నికల్లో లబ్ది పొందే దురుద్దేశంతోనే బీజేపీ ఉమ్మడి పౌర స్మృతి (యూసీసీ) నాటకానికి తెర లేపిందని ఆల్‌ ఇండియా యునైటెడ్‌ డెమొక్రటిక్‌ ఫ్రంట్‌ (ఎఐయూడీఎఫ్‌) విమర్శించింది. ఏ అంశం లేకపోవడంతోనే త్వరలో జరిగే అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు, వచ్చే ఏడాది జరిగే సార్వత్రిక ఎన్నికలకు ముందు కాషాయ పార్టీ యుసిసిని ముందుకు తెస్తోందని ఎఐయుడిఎఫ్‌ ప్రధాన కార్యదర్శి అమినుల్‌ ఇస్లాం అన్నారు. బీజేపీ ముస్లింలను టార్గెట్‌ చేస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. తమ పార్టీ యూసీసీకి వ్యతిరేకమని స్పష్టం చేశారు.కూరగాయల ధరల పెరుగుదలపై అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు. రాజకీయ ప్రయోజనాల కోసం కులం, మతం ఆధారంగా బిజెపి ప్రజలను విభజిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈశాన్య ప్రాంతంలో అనుకూల పరిస్థితి లేకపోవడంతో ప్రజల మధ్య అంతరం సష్టించేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని విమర్శించారు. కూరగాయల ధరల పెరుగుదలకు మియా ముస్లింలే కారణమని హిమంత బిశ్వ శర్మ అనడం బాధ్యతారాహిత్యమని విమర్శించారు.