భావాలన్నీ ఒక దగ్గర పలికించిన కవిత్వం

అద్దం… అనేక భావాలను తళుక్కుమని పిస్తుంది. మురిసిపోతుంది, నవ్వుతుంది, ఏడుస్తుంది, మైమరచి పోతుంది, అప్పుడప్పుడు మనసున ఒకటి పైకి ఒకటిగా అబద్దాలాడుతుంది, అసూయ పడుతుంది, రాజీ పడుతుంది… అద్దం లాంటిదే జీవితం.. ఇన్ని భావాలు ఒకే దగ్గర పలి కించిన కవిత్వం.. ఝాన్సీ కొప్పిశెట్టి ‘ఎడారి చినుకు’

సెలయేరు.. పక్కనే కురిసే వెన్నెల… ఒక అందమైన స్వప్నంలా సాగిపోయే జీవితం. హఠాత్తుగా స్వప్నం మాయమై, ఏరు ఎండినట్లు అయితే… అగ్ని కురుస్తున్న ఎడారి మధ్యలో చిక్కబడిన మనసు. విలవిలలాడే మనస్సు నుండి వెలువడిన అక్షరాలే ఈ ”ఎడారి చినుకు”.
అప్పటివరకూ వింటున్న గుండె లయ, ఒక్కసారిగా కుప్పకూలిన ప్రేమ, అనుకోని విధంగా ఆమె భర్త లోకాన్ని విడిచినప్పుడు, గుండె పగుళ్లుబారినప్పుడు, ఆమెకు కలిగిన వేదన కవితాత్మ అయ్యింది. అప్పటివరకూ తనతోనే ఉండి, ఒక్కసారిగా జీవంలేని శరీరంగా మారిన అతని గురించిన ఆవేదన ఇది.
”రశ్మికి దారీయని చీకటి తెరల మధ్య..
నీలి ఛాయల నిశి రాతిరి హోరై కురిసింది..”
అతను దూరమైన స్థితిని దశ్యం చేసిన తీరు ఇది.
”నా ఎడారి కళ్ళల్లో కన్నీరు పొడిబారి
చమరింత అంతర్ముఖమై గుండె ఊబిలోకి జారింది.”
”ఒకరికొకరమై అల్లుకున్న ప్రేమ పందిరి
ఒంటరైన నా వంక దిగులుగా చూసింది”
అతని జ్ఞాపకాలు దొంతర్లుగా కళ్ళ ముందు కదలాడుతున్న క్షణాలు మళ్లీ మళ్లీ కదలి గుండెల్ని మెలి పెడుతుంటే… నిశ్శబ్దంగా ఆమె, నిలువుగా స్థాణువైన ఆమె. జ్ఞాపకాలని ఒడిసిపడుతున్న హదయంతో ఉన్న ఆమె, ఆమె మనసు.
సరిగ్గా అప్పుడే లోకంతీరు, పగిలిన గుండెతో సంబంధం లేని లోకం కళ్ళ ముందు ఆవిష్కరించబడింది.
”ఇప్పుడు నా చెంపలు తడవలేదని గుసగుసలు
కళ్లలో మెరుపులు తగ్గలేదని విరుపులు…”
ఎక్కడ ఎలాంటి పాయింట్‌ దొరికితే ఆమెను తూట్లు పొడిచే భావాలను వెల్లగక్కే లోకం ఇది. భర్త శరీరాన్ని దహనం కేవలం కొడుకులు మాత్రమే చేయాలనే ఎప్పటి నుండో నాటుకు పోయిన, వేళ్లూనుకుని ఉన్న నమ్మకం. పురుషులు మాత్రమే ఆ కార్యక్రమం చేయాలనే రివాజు… సరిగ్గా ఇక్కడే ఒక ధిక్కారస్వరం వినపడుతుంది. పిల్లలు ఇద్దరూ విదేశాల్లో ఉండడంతో కొడుకు వరసవాళ్లు చెయ్యొచ్చు అనే తర్జనభర్జనల జాలి మాటల వల్ల కలిగిన అసహనం నుండి వచ్చిన ధిక్కారం అది.
”చెల్లని నాణెం చేసిన శ్రేయోభిలాషులు..
కుమార్తెల కులగోత్రాలు మారితే
కర్మకాండలకు అనర్హులట
మరి వంశపారంపర్య, జన్యుపర సంబంధాలు లేని
ఇతర వంశీయులు పురుషులైతే అర్హులేనట”
సానుభూతి చూపిస్తూ, ప్రేమ పేరుతో, బంధుత్వంతో చేసే కుట్ర అర్థం అయిన ఆవేదన ఆమెది. ఆడవాళ్లకు కొన్ని పరిమితులున్నాయి అనే కుతంత్రం అది. ఎవరు కర్మకాండలు చేయాలనే ప్రశ్నలు, చర్చలు గుండెను తూట్లు పొడుస్తుంటే ఆ వేదనలో ఆవేదనతో తనే కర్మకాండలు చేస్తానని ఎదురు నిలిచింది ఆమె.
ఎన్ని అవరోధాలు, ఎన్ని వ్యతిరేకతలు అన్నిటినీ అధిగమించి నిలిచి భర్తకు తలకొరివి పెట్టడానికి నిలబడింది.
”ఎవరైనా నా అడుగులజాడల్లో నడిస్తే
నాదే ముందడుగు…” అంటుంది.
అంతా అగాధం, ఎటు చూసినా చీకటి, ఎక్కడో ఆశ తను తిరిగి లేస్తారనే ఆశ అనడంలో ఆమె హదయ వేదన కనిపిస్తుంది.
”డప్పుల చప్పుళ్లకి ఉలిక్కిపడి
లేవొచ్చన్న చిరు ఆశ
దింపుడు కళ్లెంలో నా పిలుపుకి
పలకొచ్చన్న పేరాశ”…
ముగిసిపోయిందనుకున్న జీవితంలోకి కూతురు కూతురు ప్రవేశానికి పరవశించి
”కొత్తగా అమ్మయిన మనసు చిందులేసింది…
జీవనది ప్రవహించింది నాలో…”
ఇక్కడే ఆమె తిరిగి తనను తాను దొరికించుకుంది. తిరిగి చిగుర్లు వేసింది. ఎడారిలో చినుకులా ప్రవేశించింది ”ఆనిక”. పూర్తిగా తనను తాను కోల్పోయి, లోయలోకి జారిన సమయంలో లేత మునివేళ్లను అందించింది ఆనిక.
తనలో మాతత్వాన్ని తట్టిలేపిన ఆ చిన్నారి రాకకు అందమైన అక్షరాల పూలఏరు ఈ ”ఎడారి చినుకు”
– సీహెచ్‌. ఉషారాణి, 9441228142