ఉన్నత స్ధానానికి ఎన్నికైన తొలి ముస్లిం మహిళగా అరుదైన ఘనత సాధించారు. సుప్రీంకోర్టులో తొలి మహిళా జడ్జిగా చరిత్ర సృష్టించారు. రిటైరైన తర్వాత జాతీయ మానవ హక్కుల కమిషన్ సభ్యురాలిగా పనిచేశారు. అంతేకాదు తమిళనాడు గవర్నర్‌గానూ సేవలందించారు. బార్ కౌన్సిల్ పరీక్షల్లోనూ అగ్రస్దానంలో నిలిచి బార్ కౌన్సిల్ గోల్డ్ మెడల్ గెలుచుకున్న తొలి మహిళగా నిలిచారు. ఆమే జస్టిస్ ఫాతిమా బీవీ. ఆడపిల్లలు అడుగుబయట పెట్టని కాలంలోనే ఓ ముస్లిం కుటుంబంలో పుట్టి అంచెలంచలుగా ఎదుగుతూ ఎంతో మంది మహిళలకు స్ఫూర్తిగా నిలిచిన ఆమె తన 96 ఏండ్ల వయసులో ఈ నెల 23న తుదిశ్వాస విడిచారు..1927 ఏప్రిల్ 30న కేరళలోని పతనంతిట్టలో జన్మించారు. తల్లి ఖదీజా బీబీ, తండ్రి మీరాన్ సాహిబ్. తన పాఠశాల విద్యను పాతనంతిట్టలోని కాథోలికెట్ హైస్కూల్లో పూర్తి చేశారు. త్రివేండ్రంలో బీఎస్సీ చదివారు. తండ్రి ప్రోత్సాహంతో త్రివేండ్రం లా కాలేజీ నుండి బ్యాచిలర్ ఆఫ్ లా పట్టా అందుకున్నారు. తన తరగతిలో న్యాయ విద్యను అభ్యసించిన ఐదుగురు విద్యార్థుల్లో అమ్మాయి ఫాతిమా ఒక్కరే. ఆనాటి కాలంలో పురుషాధిక్య వత్తిని ఎంచుకున్న ఆమె అనేక సవాళ్లను ఎదుర్కోవలసి వచ్చింది. అలాగే తన ఏడుగురు తోబుట్టువల కోసం పెండ్లి చేసుకోకూడదని నిర్ణయించుకుని ఒంటరి జీవితాన్నే గడిపారు.
కొత్త తరాన్ని ప్రేరేపించాయి
సవాళ్లను ఎదుర్కొంటూ న్యాయవాద వృత్తిలో కొనసాగుతూ ఫాతిమా ఎన్నో విజయాలు సాధించారు. ఈ రంగంలో ఆమె ఎక్కిన మెట్లు ఔత్సాహిక మహిళలకు చట్టంలో ప్రవేశం సుగమం చేశాయి. న్యాయ రంగంలో వత్తిని కొనసాగించడానికి కొత్త తరాన్ని ప్రేరేపించాయి. 1950న న్యాయవాదిగా పేరు నమోదు చేసుకున్న న్యాయమూర్తి ఫాతిమా న్యాయవ్యవస్థలో తనకంటూ చెదరని ముద్ర వేసుకున్నారు. 1950లో బార్ కౌన్సిల్ పరీక్షల్లో అగ్రస్థానంలో నిలిచారు. మే 1958లో ఆమె కేరళ సబ్-ఆర్డినేట్ జ్యుడీషియల్ సర్వీసెస్‌లో మున్సిఫ్‌గా నియమితులయ్యారు. బెంచ్‌పై ఆమె విశిష్ట సేవకు నాంది పలికారు. నిజాయితీతో కూడిన ఆమె పనితీరు వరుస పదోన్నతులకు దారితీసింది. 1968లో సబ్-ఆర్డినేట్ న్యాయమూర్తిగా, 1972లో చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్‌గా, 1974లో జిల్లా అండ్ సెషన్స్ జడ్జిగా నియమితులయ్యారు.
పదవీ విరమణ తర్వాత
1992న పదవీ విరమణ చేసిన తర్వాత జస్టిస్ ఫాతిమా 1997లో తమిళనాడు గవర్నర్‌గా నియమితులయ్యారు. రాజీవ్ గాంధీ హత్య కేసులో శిక్ష అనుభవిస్తున్న నలుగురు ఖైదీలు దాఖలు చేసిన క్షమాభిక్ష పిటిషన్లను రాష్ట్ర గవర్నర్‌గా ఆమె తిరస్కరించారు. అయితే విధిలేని సంఘటనతో ఫాతిమా బీవీ తన గవర్నర్ పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. ఆమె జాతీయ మానవ హక్కుల కమిషన్(1993) సభ్యురాలిగా, కేరళ వెనుకబడిన తరగతుల కమిషన్ (1993) ఛైర్మన్‌గా కూడా పనిచేశారు. 1990లో డి లిట్, మహిళా శిరోమణి అవార్డు, భారత్ జ్యోతి అవార్డు, యుఎస్-ఇండియా బిజినెస్ కౌన్సిల్ (ఖూ×దీజ) లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డును అందుకున్నారు.
రాబోయే తరాలకు స్ఫూర్తి
అడ్డంకులను బద్దలు కొట్టడం, సమానత్వాన్ని సాధించడం కోసం అంకితమైన జీవితానికి ఆమె నిదర్శనం. న్యాయం, సమానత్వం కోసం ఆమె పడిన తపన ఎంతో స్ఫూర్తిదాయకం. మరో ముఖ్య విషయం ఏమిటంటే సుప్రీం కోర్టు 71 ఏండ్ల ప్రస్ధానంలో 1989లో ఫాతిమా మొదలుకుని కేవలం ఎనిమిది మంది మహిళలే న్యాయమూర్తులుగా నియమితులయ్యారు. ఇటువంటి గొప్ప వ్యక్తి న్యాయ రంగానికి, మహిళల హక్కుల కోసం ఆమె చేసిన కషి రాబోయే తరాలకు స్ఫూర్తినిస్తుంది.
మరో శిఖరాగ్రానికి…
న్యాయమూర్తిగా ఫాతిమా నైపుణ్యం, అంకితభావానికి మంచి గుర్తింపు వచ్చింది. జనవరి 1980లో ఆమె ఆదాయపు పన్ను అప్పిలేట్ ట్రిబ్యునల్‌లో న్యాయ సభ్యురాలుగా నియమితులయ్యారు. 1983లో హైకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందడంతో తన కెరీర్‌లో మరో శిఖరాగ్రానికి చేరుకున్నారు. 1984న హైకోర్టు శాశ్వత న్యాయమూర్తిగా ఆమె నియామకం తన న్యాయ జీవితంలో ఒక ముఖ్యమైన అధ్యాయంగా నిలిచింది. సుప్రీంకోర్టు న్యాయమూర్తి అయిన మొట్టమొదటి మహిళగా మాత్రమే కాకుండా ఉన్నత న్యాయవ్యవస్థలో మొదటి ముస్లిం మహిళగా, ఆసియా దేశంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి అయిన మొదటి మహిళగా కూడా ఆమె నిలిచారు.