అంతర్ముఖుడు

an introvertచివరిసారి వాడినెప్పుడు చూసానో గుర్తులేదు కానీ,
కలిసినప్పుడల్లా కలలు కాలిన కళ్ళలో నుండి నుసి రాలడం గమనించేవాడిని…
వాడొక అంతర్ముఖుడు, తడబడే కాళ్లతో నేలను స్పర్శిస్తూ పాకే దిగులు నీడ…!
సమూహాలకు వాడితో పనిలేదో…? లేక వాడికే సమూహాలంటే పడదో…?!
పొద్దస్తమానం… లంగరేసిన పడవలా కెరటాలకు అతుక్కుని,
ఒంటరి తీరపు నిశ్శబ్దాన్ని ఆవహించుకునేవాడు…
కళ్ళకూ, నింగికీ నడుమ చూపుల తివాచీ పరిచి, మనసును దానిపై దొర్లిస్తుండేవాడు…
చుట్టూ స్మశాన కంచెల్ని పాతుకుని, సమాధి మౌనాన్ని మోస్తుండేవాడు….
అలా వాడి నుండి వాడెప్పుడు తప్పిపోయాడో కానీ,
లోకానికొక వెకిలి నవ్వుగా దొరికాడు, నలుగురి నాల్కల్లో వ్యంగ్యమై దొర్లాడు…
అర నిమిషపు స్టేటస్‌లో విషాదాన్ని కుదించి, మరు నిిషం కన్నీళ్లను మరుస్తున్న కాలమిది,
అందుకేనేమో, వాడి సుదీర్ఘ దుఃఖమంటే, పరులకెపుడూ మహా వింతే….!!
పాడైన కుళాయిలోంచి ఒక్కో బొట్టూ కారినట్టు,
కనుకొనల్లోంచి జీవితం ముక్కలుగా రాలుతున్నప్పుడు,
వాడి దిగులును తుడిచే ఒక్క కరస్పర్శ కోసం ఎంతగా తపించిపోయాడో….?!
కాలం కత్తిపోట్లతో విరుచుకుపడ్డప్పుడు, ఉపశమనపు విరామ సమయంలో,
గుండెకు ఓదార్పునద్దే వెచ్చని ఆలింగనం కోసం ఎంతగా తల్లడిల్లాడో….?!
పూడుకుపోయిన గొంతులోంచి స్వరమై బయటపడలేక ఎన్ని మార్లు విలవిల్లాడాడో…?!
పడ్డప్పుడు పైకి లేపే చేతులు కానరాకనో,
తిరిగి పడకుండా కాపు గాసే కళ్ళ జాడ లేకనో, నిశ్శబ్దంగా నిష్క్రమించాడు…
చెప్పా పెట్టకుండానే వెళ్లిపోయాడు, చెప్పినా ఆపరనే నమ్మకమో…?!
ఆపినా ఆగకూడదనే నిశ్చయమో…?!
తల వాల్చడానికొక్క భుజమైనా లేనితనం నుండి,
తన కాయాన్ని మోసేందుకు భుజాలు పోటీ పడే పథకాన్ని రచించి మరీ వెళ్ళిపోయాడు….
నిజానికి వాడిప్పుడే ప్రశాంతంగున్నాడు, దిగులు దేహం మట్టిలో విలీనమయ్యాక,
పైన మొలిచిన గడ్డి పూలతో, దాగుడుమూతలాడుతున్నాడు…
– జాబేర్‌.పాషా, 0096878531638