కొబ్బరి నూనెతో ప్రయోజనాలెన్నో…

ఆరోగ్యానికి, అందానికి కొబ్బరి నూనె చాలా మేలు చేస్తుంది. కొబ్బరినూనెలో ఉండే ఔషధ గుణాలు మరే నూనెలోనూ లేవని పరిశోధనలు నిరూపిస్తున్నాయి. దీనిలో లారిక్‌ ఆమ్లం ఉంటుంది… ఇది యాంటీ ఫంగల్‌, యాంటీ బ్యాక్టిరియల్‌, యాంటీ వైరల్‌గా పని చేస్తుందని పరిశోధకులు పేర్కొంటున్నారు. కొబ్బరి నూనెతో మనం వంటలు చేసుకోం కానీ… కేరళీయులు ఆ నూనెతో వండుకుని తింటారు. తక్కువ కాలంలో ఎక్కువ శక్తిని శరీరానికి అందిస్తుంది. ఈ నూనె శరీరంలోకి వెళ్లాక కొవ్వుగా పేరుకోకుండా నేరుగా కాలేయానికి చేరుకుని శక్తి ఉత్పత్తి మొదలు పెడుతుంది. తల్లి పాలలో ఉండే సద్గుణాలు కొబ్బరినూనెలో ఉంటాయి. చాలా మంది క్రీడాకారులు వర్కవుట్స్‌ చేశాక కోకోనట్‌ ఆయిల్‌ కలిపిన పానీయాలు తాగుతారు. దీని వల్ల శరీరం వైరస్‌ బారిన పడే ప్రమాదం తక్కువట.. వీటితో పాటు అనేక రకాల ప్రయోజనాలు ఉన్నాయి. అవేంటో చూద్దాం…
కొబ్బరి నూనె మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది. శరీరంలోకి చేరిన వెంటనే శక్తిని పుట్టించే కీటోన్స్‌ను ఉత్పత్తి చేస్తుంది. కీటోన్స్‌ నిత్యం శక్తిని సష్టించే పనిలోనే ఉంటాయి. మెదడుకు సంబంధించిన ఎపిలెప్సీ, అల్జీమర్స్‌, సీజర్స్‌ వంటి వ్యాధులను తగ్గిస్తుంది కూడా.
కొబ్బరి నూనె శరీరంలో హెచ్‌డిఎల్‌ (మంచి కొవ్వు) ఉత్పత్తి పెంచుతుంది. దీని వల్ల గుండె కండరాలు బాగా పనిచేస్తాయి. తద్వారా గుండెకి బలం చేకూరుతుంది.
కొబ్బరినూనెతో చేసిన ఆహారపదార్థాలు త్వరగా జీర్ణమవుతాయి. ఫలితంగా కొవ్వు కరగడం, బరువు తగ్గడం జరుగుతుంది. రక్తంలో చక్కెరస్థాయిని స్థిరపరుస్తుంది. కొలెస్ట్రాల్‌ పెరగకుండా చేస్తుంది. రక్తపోటును నియంత్రణలో ఉంచుతుంది.
బ్యాక్టీరియా కారణంగా సోకిన ఇన్ఫెక్షన్స్‌ను నివారించడంలో, వ్యాధి నిరోధకశక్తిని పెంచడంలో కొబ్బరినూనె సహాయపడుతుంది.
కొబ్బరినూనెలో సహజసిద్ధమైన యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి. ఇవి ఓరల్‌ హెల్త్‌ను కాపాడుతాయి.
చర్మం, జుట్టు అందాన్ని కూడా కాపాడుతుంది.
మేనిఛాయ ఇనుమడింపచేయడానికి స్నానానికి ముందు శరీరానికి కొబ్బరినూనె బాగా పట్టిస్తే సరి.
పురుషుల్లో టెస్టోస్టిరాన్‌ పెంపుదలకు కొబ్బరినూనె సహాయం చేస్తుంది. ఆడవాళ్లలో ప్రొజెస్టిరాన్‌ హార్మోన్‌ను పెంచుతుంది.
ఇంట్లో ఫర్నిచర్‌పై చేరిన మురికి, మరకలపై కొద్దిగా కొబ్బరినూనె రాసి మెత్తని గుడ్డతో తుడిచేస్తే శుభ్రంగా ఉంటాయి.
కొబ్బరినూనెలో కొద్దిగా నిమ్మరసం కలిపి ఫర్నిచర్‌కి పూస్తే పాలిష్‌ అవసరమే ఉండదు.
లెదర్‌ వస్తువులు కొత్తవాటిలా మెరవడానికి కాస్త కొబ్బరినూనెను మెత్తని గుడ్డతో తీసుకుని అప్లై చేయాలి.