జాబిల్లికి ఆవలవైపు

Beyond Jabilli– చిత్రాలు విడుదల చేసిన ఇస్రో
– చంద్రయాన్‌-2 ఆర్బిటర్‌తో చంద్రయాన్‌-3 ల్యాండర్‌కు కమ్యూనికేషన్‌
బెంగళూరు : చంద్రుని ఉపరితలానికి ఆవలవైపు తీసిన చిత్రాలను ఇస్రో సోమవారం విడుదల చేసింది. చంద్రుడికి ఆవల వైపు భాగం ఎప్పుడూ భూమికి కనిపించదు, అందువల్ల దీన్ని చీకటి ప్రాంతంగా పేర్కొంటారు. ఇప్పుడు ఈ చీకటి ప్రాంతం వివరాలు తెలుసుకునేందుకే ఈ చంద్రయాన్‌-3ని పంపించారు. ల్యాండర్‌లోని ఎల్‌హెచ్‌డీఏసీ (ల్యాండర్‌ హజార్డ్‌ డిటెక్షన్‌ అండ్‌ అవాయిడెన్స్‌ కెమెరా) ఈ నెల 19న ఈ చిత్రాలను తీసింది. ”పెద్ద పెద్ద బండరాళ్లు లేదా లోతైన గోతులు లేకుండా చంద్రయాన్‌ సురక్షితంగా ల్యాండ్‌ అయ్యే ప్రాంతాన్ని గుర్తించడంలో ఈ కెమెరా సాయపడుతుంది.” అని ఇస్రో సామాజిక వేదిక ఎక్స్‌లో పోస్ట్‌ చేసింది. ఆదివారం చంద్రుని ఉపరితలంపై కుప్పకూలిన రష్యా లూనార్‌ మిషన్‌ లూనా-25 కూడా చంద్రుని ఆవల వైపు భాగానికి సంబంధించిన చిత్రాలను పంపింది. ఈ నెల 5, 15, 17 తేదీల్లో చంద్రయాన్‌-3 పంపిన మూడు వీడియోలను ఇస్రో ఇప్పటికే విడుదల చేసింది.
స్వాగతం మిత్రమా !
చంద్రయాన్‌-2 ఆర్బిటర్‌, చంద్రయాన్‌-3 లూనార్‌ మాడ్యూల్‌ మధ్య పరస్పర కమ్యూనికేషన్‌ ఏర్పడిందని ఇస్రో సోమవారం ప్రకటించింది. ”వెల్‌కమ్‌ బడ్డీ !” (స్వాగతం మిత్రమా !) అంటూ చంద్రయాన్‌-2 ఆర్బిటర్‌, చంద్రయాన్‌-3 ల్యాండర్‌ మాడ్యూల్‌ను పలకరించి, స్వాగతం చెప్పింది. ల్యాండర్‌ మాడ్యూల్‌ను చేరడానికి ఇప్పుడు మిషన్‌ ఆపరేషన్స్‌ కాంప్లెక్స్‌ (ఎంఓఎక్స్‌)కు అనేక మార్గాలు వున్నాయని ఇస్రో పేర్కొంది.
బుధవారం సాయంత్రం 6.04 గంటలకు చంద్రుని ఉపరితలంపై ల్యాండర్‌ దిగుతుందని భావిస్తున్నట్లు ఇస్రో ప్రకటించిన సంగతి తెలిసిందే. బెంగళూరులోని ఇస్రో టెలిమెట్రీ, ట్రాకింగ్‌ అండ్‌ కమాండ్‌ నెట్‌వర్క్‌లో మాక్స్‌ విభాగం వుంది. 5.20 గంటల నుంచి ల్యాండింగ్‌ ప్రక్రియ ప్రత్యక్ష ప్రసారం ప్రారంభమవుతుందని ఇస్రో తెలిపింది.