తెలంగాణ సంస్కృతికి ప్రతీక బోనాలు..

నవతెలంగాణ -సుల్తాన్ బజార్ 
తెలంగాణ సంస్కృతికి ప్రతీక  బోనాలని తెలంగాణ రాష్ట్ర శాసనమండలి వైస్ చైర్మన్ బండ ప్రకాష్ ముదిరాజ్ అన్నారు. తెలంగాణ ఆషాడ మాస బోనాల సందర్భంగా ఉజ్వల  సంస్కృతిక సామాజిక స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో  ఉత్తమ బోనం పోతరాజు,  ఫలహారం బండి అవార్డుల ప్రదానోత్సవం కార్యక్రమం తెలంగాణ సరస్వత పరిషత్ లో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బండ ప్రకాష్ పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బోనాల పండుగకు నిధులు కేటాయించి అత్యంత వైభవంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్  నిర్వహిస్తున్నారని  తెలిపారు. తెలంగాణ బోనాలు ప్రపంచ వ్యాప్తంగా జరుపుకోవడం ఆనందదాయకమన్నారు. ఉజ్వల సంస్థ విలక్షణమైన కార్యక్రమాలను నిర్వహిస్తూ.. కళాకారులను ప్రోత్సహించడం సంతోషదాయకమన్నారు. అనంతరం బెస్ట్ బోనం, బెస్ట్ పోతరాజు, బెస్ట్ ఫలహారం బండి నిర్వాహకులకు  అవార్డులను ప్రధానం చేశారు.  ప్రముఖ సంఖ్యా శాస్త్ర నిపుణుడు దైవజ్ఞ శర్మ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ప్రముఖ కేరళ జ్యోతిష్య నిపుణుడు శివ నరసింహన్ స్వామి, గౌతమ్ ఎంటర్ప్రైజెస్  మేనేజింగ్ డైరెక్టర్ బీ. బాలరాజు ముదిరాజ్,  సామాజికవేత్త డాక్టర్ వీరభోగ వసంత రాయులు, వ్యాఖ్యాత జబర్దస్త్ ఫేమ్ వినోదిని, సంస్థ అధ్యక్షురాలు ఎం. లక్ష్మి పాల్గొన్నారు.