ఎమ్మెల్యేకు మద్దతుగా బీఆర్‌ఎస్‌ భారీ ర్యాలీ

ఐటీ దాడులతో ఎమ్మెల్యే రాజకీయ ఎదుగుదలను ఆపలేరు
నవతెలంగాణ-భువనగిరి
యాదాద్రి భువనగిరి జిల్లాలోని భువనగిరి నియోజకవర్గంలో ఎన్నికల హడావుడి తలపించే విధంగా బీఆర్‌ఎస్‌ శ్రేణులు బైక్‌ ర్యాలీ నిర్వహించారు. భువనగిరి శాసనసభ్యులు పైళ్ల శేఖర్‌రెడ్డి ఇంటిపై నిర్వహించిన ఐటీ దాడుల్లో ఎలాంటి అక్రమ ఆస్తులు బయటపడలేదని ఎమ్మెల్యే కడిగిన ముత్యమని తెలుపుతూ యాదాద్రి భువనగిరి పట్టణంలోని స్థానిక పాలశీతలీకరణ కేంద్రం నుంచి హైదరాబాద్‌ చౌరస్తా వరకు బీఆర్‌ఎస్‌ శ్రేణులు భారీ బైక్‌ ర్యాలీ నిర్వహించారు. ఓపెన్‌టాప్‌ జీపుపై ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మెన్‌ జడల అమరేందర్‌గౌడ్‌, రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షులు కొలుపుల అమరేందర్‌ ఉండగా నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున బైకులు నడిపిస్తూ బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నాయకులు, కార్యకర్తలు గులాబీ కండువాలు వేసుకొని ఎమ్మెల్యేపై గులాబీ పూలవర్షం కురిపించారు. ఎమ్మెల్యేకు రాజ కిరీటం పెట్టి చేతికి తల్వార్‌ అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నేరుగా, రాజకీయంగా ఎదుర్కోలేక ఇలాంటి చర్యలు పూనుకుంటున్నారని ఆరోపించారు. ఇంట్లో సోదాలు జరిపిన ఎలాంటి అవినీతి అక్రమాలకు సంబంధించిన పత్రాలు లభించలేదని తెలిపారు. తాను చాలా ఏండ్లుగా వ్యాపారంలో ఉన్నానని, ప్రతిది అకౌంటబుల్‌గా తన నిర్వహణ ఉంటుందని తెలిపారు. ఇది తన రాజకీయ ఎదుగుదలను ఓర్వలేక ఇతర పార్టీ నాయకులు తనపై ఇలాంటి సోదాలు నిర్వహించే విధంగా ప్రోత్సహించారని ఆరోపించారు. రాజకీయాల్లో కక్ష సాధింపు చర్యలు మానుకోవాలని హితవు పలికారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్మెన్‌ ఎనబోయిన ఆంజనేయులు, వైస్‌చైర్మెన్‌ చింతల కిష్టయ్య, పార్టీ పట్టణ అధ్యక్షులు ఏవీ.కిరణ్‌కుమార్‌, నాయకులు, కౌన్సిలర్లు పాల్గొన్నారు.