బుడ్డ చింత

చెట్టు పెద్దదేగాని దాన్ని తాత ముత్తాతల కాలం నుంచి బుడ్డచింత అనే పిలిచేటోళ్ళు, ఎందుకో…
ఎండాకాల మొస్తే అది మాకేరి కంతటికి నీడనిచ్చే పచ్చని చలువ పందిరి…
ఒగాది పండుగొస్తే పెద్దలు తాళ్లువేనుకుంట ఆ తాళ్లు సాగనీకె ఆ చింతకొమ్మలకు టుంగుటుయ్యాలలు గట్టి ఊగుతుంటే…
పిల్లలేమో కొత్తచింతగింజలు తట్టుసంచిల వోసి, బంతిని కుట్టి, రెండు రాళ్ళ మీద కట్టెవెట్టి కొట్టుకుంట..
ఓడిన జట్టు పొల్లగాల్లను వొంగ వెట్టి వీపు మీది కెక్కి, ఎక్కుడు గుర్రాలాడుతుంటే తాతలు గూడ మాతో కలిసిపోయి పసిపిల్లలయ్యేటోళ్ళు….
వారానికొక్కనాడు నింగుతాత చెట్టెక్కి గోసినిండా చింత కాయలు దెంపి దిగంగనే….
సుట్టుపక్కల ఆడోళ్లందరు పూజారి పంచే ప్రసాదానికి మూగినట్లుగా ఆ తాతకు దడి గట్టేటోళ్ళు.
తలా పిడికెడన్ని చింతకాయలు పంచి అందరి కుండల పప్పుచారులోపులుసయ్యేవాడు నింగుతాత
మా కేరిలో కొట్లాటైనా పంచాదైనా పెద్దలందరిచ్చే తీర్పుకు మూగసాక్షమయ్యేది ఆ బుడ్డచింత….
ఊరికి బైరుగమ్మరోళ్ళొచ్చినా.. పోచమ్మలొల్లొచ్చినా ఆశ్రయమిచ్చే ధర్మసత్రం ఆ బుడ్డచింత….
ఇండ్లల్లో పిల్లలు పెద్దలు ఎవరు గనవడక పోయినా బుడ్డచింతలి కిందున్నరు అని తెలిపే చిరునామయ్యేది….
కాలానుగుణంగా జరిగే మార్పులలో వలసపక్షులు కొంగలు వచ్చినపుడు అక్కున జేర్చుకొని ఆదరించే అమ్మయ్యేది ఆ బుడ్డచింత…
ఎవరైనా కాలంజేస్తే (చనిపోతే) చింతకొమ్మలు నరికి పాడెపై పరిచినపుడు వారి చివరి మజిలీలో హంసతూలికా పానుపయ్యేది ఆ బుడ్డచింత ……
ఇంతటి ఘనతను గలిగిన ఆబుడ్డచింతలి నేడు…మాఊరి నక్షత్రాలను దాచుకున్న పాలపుంతై…. ఆకాశంలో కాంతులీనుతున్నది
-టి.ఆశీర్వాదం, 90102 08191