మణిపూర్‌ వీడియోపై సీబీఐ దర్యాప్తు ప్రారంభం ఎఫ్‌ఐఆర్‌ నమోదు

ఇంఫాల్‌ : మణిపూర్‌లో కుకీ మహిళలను నగంగా ఊరేగించి, ఆపై ఆత్యాచారం జరిపిన సంఘటనకు సంబంధించి వెలుగులోకి వచ్చిన వీడియోపై సీబీఐ శనివారం దర్యాప్తు ప్రారంభించింది. ఈ కేసుకు సంబంధించి ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసింది.
ఇద్దరు మహిళలపై లైంగిక వేధింపులు, హింసకు సంబంధించిన ఉదంతంపై కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు సీబీఐ దర్యాప్తు చేపట్టింది. సిబ్బంది, శిక్షణ (డీఓపీటీ) శాఖ నోటిఫికేషన్‌ విడుదల చేసిన అనంతరం ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. ఐపీసీలోని 153-ఏ, 398, 427, 436, 448, 302, 354, 364, 326, 376, 34 సెక్షన్లు, 25 (1-సీ) ఏ చట్టం ప్రకారం సీబీఐ ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసింది. ఈ కేసులో ఏడుగురు నిందితులను అరెస్ట్‌ చేశారు. వీడియో తీసిన మొబైల్‌ ఫోన్‌ను కూడా స్వాధీనం చేసుకున్నారు.
కేసు విచారణ చేపట్టిన సీబీఐ నిందితులను తన అధీనంలోకి తీసుకొని విచారిస్తుంది. బాధితుల స్టేట్‌మెంటును నమోదు చేస్తుంది. నేరం జరిగిన ప్రదేశాన్ని పరిశీలిస్తుంది. మణిపూర్‌ వైరల్‌ వీడియో కేసును సీబీఐ చేపడుతుందని కేంద్ర హోం శాఖ గురువారం సుప్రీంకోర్టుకు తెలిపింది. విచారణను మణిపూర్‌ వెలుపల చేపట్టేలా ఆదేశాలు జారీ చేయాలని అభ్యర్థించింది. మణిపూర్‌ ప్రభుత్వాన్ని సంప్రదించిన అనంతరం కేసును సీబీఐని అప్పగించాలని నిర్ణయించినట్లు కేంద్ర హోం కార్యదర్శి అజరు భల్లా సుప్రీంకోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌లో తెలియజేశారు.

Spread the love