– అభివృద్ధిపై చర్చకు రమ్మంటే కేసీఆర్ పారిపోతున్నడు
– రాష్ట్ర ఆవిర్భావోత్సవ వేడుకల్లో బండి సంజయ్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
తెలంగాణ అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం నాలుగు లక్షల కోట్ల రూపాయలిచ్చిందనీ, అభివృద్ధిపై చర్చకు రమ్మంటే రాకుండా కేసీఆర్ పారిపోతున్నాడని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్‌కుమార్ అన్నారు. శుక్రవారం హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా బండి మాట్లాడుతూ.. కేసీఆర్ మూర్ఖత్వ పాలనలో రాష్ట్రం తిరోగమనం వైపు వెళ్తున్నదన్నారు. తెలంగాణ బంగారుమయమైతే ఎవర్ని కదిలించినా కన్నీళ్లే ఎందుకు వస్తున్నాయని ప్రశ్నించారు.
కొట్లాడి సాధించుకున్న తెలంగాణ నలుగురి చెరలో బంధీగా మారిందని విమర్శించారు. సొంత ప్రచారం కోసం వందల కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తారా? అని ప్రశ్నించారు. డిపాజిట్లు కూడా రాని కాంగ్రెస్ పార్టీని జాకీలు పెట్టి లేపి బీజేపీని దెబ్బతీసేందుకు బీఆర్‌ఎస్ కుట్ర చేస్తున్నదని ఆరోపించారు. ఉద్యమకారులంతా అప్రమత్తమై తెలంగాణ ఉద్యమ స్మృతులను గుర్తుచేసుకుని బీఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని గద్దె దింపే పోరాటంలో కలిసి రావాలని కోరారు. బీజేపీ అధికారంలోకి వస్తే పేదలపై ఫీజుల భారం పడకుండా ఉచితంగా విద్య, వైద్యాన్ని అందిస్తామని మరోమారు చెప్పారు. పేదలందరికీ ఇండ్లు కట్టిస్తామనీ, రైతులకు ఫసల్ బీమా అమలు చేస్తామని అన్నారు. రాష్ట్రంలో 25వేలటీచర్ పోస్టులను భర్తీచేస్తామని తెలిపారు. కార్యక్రమంలో బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు నల్లు ఇంద్రసేనారెడ్డి, జి.వివేక్, తమిళనాడు సహ ఇన్‌చార్జి పొంగులేటి సుధాకర్ రెడ్డి, మాజీ మంత్రి మర్రి శశిధర్ రెడ్డి, మాజీ ఎంపీలు బూర నర్సయ్యగౌడ్, రవీంద్రనాయక్, ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి ఎస్.కుమార్, అధికార ప్రతినిధులు సీహెచ్.విఠల్, ఎన్వీ సుభాష్, రాణిరుద్రమదేవి, జె.సంగప్ప తదితరులు పాల్గొన్నారు.