స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకోవాలి: సీఐ సత్యనారాయణ

– మండలంలో కేంద్ర బలగాలు కవాతు

నవతెలంగాణ- పెద్దవంగర: నవంబర్ 30న జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని తొర్రూరు సీఐ సత్యనారాయణ, పెద్దవంగర ఎస్సై రాజు అన్నారు. సోమవారం మండలంలోని అవుతాపురం, పోచంపల్లి గ్రామాల్లో కేంద్ర బలగాలతో కలిసి కవాతు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రజలు శాంతియుతంగా, నిర్భయంగా, స్వేచ్ఛగా వారికి నచ్చిన అభ్యర్థికి ఓటు వేయాలని సూచించారు. ప్రజల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించేందుకు, ఎన్నికలు శాంతియుత వాతావరణంలో జరిగేందుకు ఫ్లాగ్ మార్చ్ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. పోలింగ్ సమయంలో కేంద్ర బలగాలు కీలక పాత్ర పోషిస్తాయని, వారితో పాటు తమ సిబ్బంది విధులు నిర్వహిస్తామని వివరించారు. ఓటు హక్కు కలిగిన ప్రతి ఒక్కరూ పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటేసి వంద శాతం పోలింగ్ సాధించేందుకు సహకరించాలన్నారు. ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకు అప్రమత్తంగా ఉంటూ ఎలాంటి ప్రలోభాలకు తావివ్వొద్దని కోరారు. కార్యక్రమంలో ఏఎస్సై కుమారస్వామి పోలీసులు పాల్గొన్నారు.