సెప్టెంబరు 17న కాంగ్రెస్‌ మ్యానిఫెస్టో…

– రాష్ట్రంలో విజయం సాధించి సోనియా గాంధీకి కానుకగా ఇద్దాం
– డబుల్‌ ఇంజన్‌ అంటే ఆదానీ, ప్రధానే
– అధికారంలోకి వస్తే ధరణిని బరాబర్‌ రద్దు చేస్తాం
– కాంగ్రెస్‌ పదేండ్లు, బీఆర్‌ఎస్‌ పదేండ్ల అభివృద్ధిపై చర్చకు సిద్ధం: యూత్‌ కాంగ్రెస్‌ జాతీయ సమావేశంలో పీసీసీ చీఫ్‌ రేవంత్‌
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
అసెంబ్లీ ఎన్నికల కోసం రూపొందించిన కాంగ్రెస్‌ మ్యానిఫెస్టోను తెలంగాణ విమోచన దినోత్సవమైన సెప్టెంబర్‌ 17న విడుదల చేస్తామని టీపీసీసీ అధ్యక్షులు, ఎంపీ ఎనుముల రేవంత్‌రెడ్డి వెల్లడించారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్‌ పార్టీకి ఒక్క అవకాశం ఇవ్వాలని ప్రజలను ఆయన కోరారు. అత్యంత కీలకమైన ఐదు అంశాలతో ప్రజల వద్దకు వెళతామన్నారు. అగ్రనాయకులు అందుబాటులో ఉండే అవకాశాన్ని బట్టి బహిరంగ సభలు నిర్వహిస్తామని తెలిపారు. కర్నాటకలో మాదిరిగానే తెలంగాణలో కూడా కాంగ్రెస్‌ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. డిసెంబర్‌ 9న సోనియా గాంధీ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పాటు చేసి, ఆమెకు కానుక ఇద్దామని వ్యాఖ్యానించారు. శుక్రవారం హైదరాబాద్‌ సోమాజిగూడలోని ఓ ప్రముఖ హోటల్‌లో నిర్వహించిన యూత్‌ కాంగ్రెస్‌ జాతీయ
సెప్టెంబరు 17న కాంగ్రెస్‌ మ్యానిఫెస్టో…
సమావేశంలో రేవంత్‌ మాట్లాడారు. ఎన్నికల యుద్ధంలో గెలవాలంటే యువత ముందుండి పోరాడాలని రేవంత్‌ ఈ సందర్భంగా సూచించారు. ఎన్నికల్లో కాంగ్రెస్‌ గెలుపు కోసం అవిశ్రాంతంగా కృషి చేయాలని చెప్పారు. 2024 ఎన్నికల్లో కాంగ్రెస్‌ను గెలిపించి రాహుల్‌ గాంధీని ప్రధానిని చేయాల్సిన అవసరముందన్నారు. దీనికి అవసరమైన కార్యాచరణపై యూత్‌ కాంగ్రెస్‌కు దిశానిర్దేశం చేశామన్నారు. క్షేత్ర స్థాయిలో కీలకంగా పని చేసిన వారే, రాష్ట్ర, జాతీయ స్థాయి నాయకులవుతారని గుర్తు చేశారు. మోడీ, కేసీఆర్‌లను గద్దె దించాలంటే యూత్‌ కాంగ్రెస్‌ క్రియాశీలకంగా పని చేయాలని సూచించారు. నాయకుడుగా మారేందుకు ఇది ఒక వేదిక అని తెలిపారు. రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి మాణిక్‌రావు ఠాక్రేనే ఉదాహరణ అని వివరించారు. 1200 మంది విద్యార్థి, యువత ప్రాణత్యాగాలతో తెలంగాణ ఏర్పడిందని గుర్తు చేశారు. డబుల్‌ ఇంజన్‌ అంటే ఆదానీ, ప్రధాని అని ఎద్దేవా చేశారు. దేశాన్ని దోచుకోవడమే ఈ డబుల్‌ ఇంజన్‌ పని అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘వన్‌ నేషన్‌ వన్‌ పారీ’్ట అనేది బీజేపీ రహస్య ఎజెండా అని విమర్శించారు. బీజేపీ కుట్రలను ఛేదించి దేశంలో కాంగ్రెస్‌ జెండా ఎగరేయాలన్నారు. త్వరలోనే ఎన్నికలు రాబోతున్నాయనీ, అందువల్ల కార్యకర్తలంతా క్రియాశీలకంగా పనిచేయాల్సిన అవసరముందని నొక్కి చెప్పారు. ఎన్నికల్లో కాంగ్రెస్‌ గెలుపు కోసం అందరం సమిష్టిగా కష్టపడదామని పిలుపునిచ్చారు. తెలంగాణలో కేసీఆర్‌ను ఓడించి కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పాటు చేయాలన్నారు. గడీల పాలన పునరుద్ధరించేందుకే కేసీఆర్‌ ధరణి తీసుకొచ్చారని రేవంత్‌ విమర్శించారు. బినామీల పేరిట సీఎం కేసీఆర్‌ వేల ఎకరాలను కొట్టేశారని ఆరోపించారు. కొద్ది మంది భూస్వాముల కోసమే ధరణి తెచ్చారని విమర్శించారు. కాంగ్రెస్‌ పార్టీ ధరణి పోర్టల్‌ను పూర్తిగా ఎత్తివేస్తామన్నారు. 97శాతం భూవివాదాలకు ఆ పోర్టలే కారణమని చెప్పారు. మాట ఇచ్చిన ప్రకారం ధరణిని బరాబర్‌ రద్దు చేస్తామని తెలిపారు. భూముల విషయంలో అవకతవకలకు పాల్పడ్డ అధికారులను ఊచలు లెక్కబెట్టిస్తామని హెచ్చరించారు. ప్రభుత్వ అధికారుల దగ్గర ఉండాల్సిన సమాచారం దళారుల చేతికి వెళ్లిందని ఆరోపించారు. ధరణిని రద్దు చేస్తామంటే కేసీఆర్‌కు ఎందుకంత ద్ణుఖం వస్తుందో అర్థం కావడం లేదన్నారు. ఏడ్చి, గోల పెట్టినా తండ్రి కొడుకులను జైలుకు పంపిస్తామని హెచ్చరించారు. 2004 నుంచి 2014 వరకు జరిగిన అభివద్ధి, 2014 నుంచి ఇప్పటి వరకూ జరిగిన అభివృద్ధిపై చర్చకు సిద్ధంగా ఉన్నట్టు రేవంత్‌ చెప్పారు. 2014 తర్వాత జరిగిన అభివృద్ధిపై మంత్రులు కేటీఆర్‌, హరీష్‌రావు చర్చకు సిద్ధమా? అని సవాల్‌ విసిరారు. కాంగ్రెస్‌ అడ్డుకోవడానికే కేసీఆర్‌ చిల్లర మల్లర వేషాలు వేస్తున్నారని ఎద్దేవా చేశారు. ఎవరు, ఎవర్ని శంకరగిరి మాన్యాలు పట్టిస్తారో త్వరలోనే తెలుస్తుందని హెచ్చరించారు. తెలంగాణ ప్రజలు కాంగ్రెస్‌కు ఒక్క అవకాశం ఇస్తే, ఈ దొంగల పాలన నుంచి విముక్తి కల్పిస్తామని వ్యాఖ్యానించారు.