కాంట్రాక్ట్‌ అధ్యాపకులను రెగ్యులరైజ్‌ చేయాలి

Contract teachers Should be regularized– ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి
– కాంట్రాక్ట్‌ అసిస్టెంట్‌ ప్రొఫెసర్ల సామూహిక సమరదీక్ష
నవతెలంగాణ-అడిక్‌మెట్‌
రాష్ట్రంలోని అన్ని విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్‌ అధ్యాపకులను రెగ్యులరైజ్‌ చేయాలని ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి, ఎంపీ ఆర్‌. కృష్ణయ్య, ప్రొఫెసర్‌ హరగోపాల్‌ డిమాండ్‌ చేశారు. ఆదివారం హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్‌ (ధర్నాచౌక్‌) ఎదుట కాంట్రాక్ట్‌ అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు నిర్వహించిన సామూహిక సమరదీక్షకు వారు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ నర్సిరెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 12 విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్న 1445 మంది కాంట్రాక్ట్‌ అసిస్టెంట్‌ ప్రొఫెసర్లతో పాటు బడ్జెట్‌ సేల్స్‌ఫైనాన్స్‌ కోర్సులను బోధిస్తున్న అధ్యాపకులను వెంటనే రెగ్యులర్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. 20 ఏండ్లకు పైగా పనిచేస్తూ యూనివర్సిటీ ఉన్నతికి కృషి చేస్తున్నారని, అలాంటి వారిని రెగ్యులరైజ్‌ చేయడానికి ప్రభుత్వం దృష్టి పెట్టాలని తెలిపారు. సమస్య పరిష్కారానికి ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తానని హామీ ఇచ్చారు. అనంతరం ఆర్‌. కృష్ణయ్య, ప్రొఫెసర్‌ హరగోపాల్‌ మాట్లాడుతూ.. కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్‌ చేయకపోతే అది శ్రమ దోపిడీ అవుతుందని, ఒకవైపు ప్రయివేటు యూనివర్సిటీలను ప్రోత్సహిస్తూ ప్రభుత్వ యూనివర్సిటీలను నిర్లక్ష్యం చేయడం చూస్తుంటే.. పేద, బడుగు, బలహీన వర్గాల పిల్లలకు విద్యను దూరం చేయడమే అవుతుందన్నారు. విశ్వవిద్యాలయాలను స్తంభింపజేసేలా ఉద్యమ కార్యచరణ రచించాలని అధ్యాపకులకు సూచించారు. ఈ దీక్షలో కాంట్రాక్ట్‌ అధ్యాపకుల జేఏసీ చైర్మెన్‌ వేల్పుల కుమార్‌, ఓయూ జేఏసీ చైర్మెన్‌ ఉపేందర్‌, నాయకులు తాళ్లపల్లి వెంకటేష్‌, బీర్ల రాజు, భవాని, రాధిక, శ్రీధర్‌ రెడ్డి, విజయేందర్‌ రెడ్డి, రాజేంద్రప్రసాద్‌, సీహెచ్‌ వెంకటేష్‌, తదితరులు పాల్గొన్నారు.