అరణ్యంలో ప్రజాస్వామ్యం

ఓ అడవిలో అనేక జంతువులు నివశిస్తుండేవి. అడవికి సింహం రాజు. దానికి నక్క మంత్రి. పులి సైన్యాధిపతి. తోడేలు అంగరక్షకుడు. వాటికి ఎదురు పడిన జంతువునల్లా వేటాడి సుస్టుగా తింటుండేవి.
ఒకనాడు తెలివైన కుందేలు ఏనుగుతో ”మనల్ని ఈ క్రూర జంతువులు – అడ్డూ అదుపూ లేకుండా చంపి తినేస్తున్నాయి . కొంత కాలానికి మన చిన్న ప్రాణుల ఉనికి లేకుండా పోయినా ఆశ్చర్యం లేదు. ప్రపంచమంతటా ప్రజాస్వామ్య గాలులు వీస్తున్నాయి. మన అడవిలో కూడా నియంతత్వం తొలగిపోయి ప్రజస్వామ్యం వెల్లి విరియాలి. సింహ రాజును దింపేసి, ఎన్నికలు ఏర్పాటు చేయాలి. చిన్నా, పెద్దా తేడా లేకుండా ప్రతి జంతువుకు ఓటు హక్కు ఇచ్చి, ఎన్నికలు నిర్వహిస్తే మనమే గెలుస్తాం. చిన్న జంతువులు, అందునా శాకాహార జంతువులే ఎక్కువ ఉన్నాయి అడవిలో. మనలో ఎవరు పోటీచేసి గెలిచినా మన ధన, మాన, ప్రాణాలకు రక్షణ ఉంటుంది. హింస ఆగిపోతుంది. అధికారం మన చేతిలో ఉంటుంది కాబట్టి, అప్పుడు క్రూర జంతువులు మనం చెప్పినట్లే వింటాయి” అంది కుందేలు.
”దివ్యమైన ఆలోచన. మనలాగే బాధలు అనుభవిస్తున్న జంతువుల్ని ఏకం చేద్దాం. ఎన్నికలు పెట్టమని డిమాండ్‌ చేద్దాం” అంది ఏనుగు.
ఏనుగు, కుందేలు, అడవిలోని శాకాహార జంతువులని కలిసి తమ ఆలోచనను వివరించాయి. అవి సంతోషంతో ఎగిరి గంతులేశాయి. ‘మనకు స్వేచ్ఛ, స్వతంత్రం, లభించ బోతుటుందంటే అంతకన్నా ఆనందమేముంటుంది’ అని చిందులేశాయి. జిరాఫీ, నీటి గుర్రం, జింక, పంది, మేక, కోతి వంటి జంతువులన్నీ రాజు వద్దకు తమ ప్రతినిధిగా కుందేలును, ఏనుగును పంపాలనుకున్నాయి.
ఒకనాడు సింహరాజు వద్దకు వెళ్లి, తమ విన్నపాన్ని తెలిపాయి. ”భలేగుందే మీ ప్రతిపాదన. లోకమంతా మారిపోతుంది. మనం కూడా మారక తప్పదు కదా. మీరు ఆశించినట్లే, జంతువుకో ఓటు ఇచ్చి, ప్రజా ప్రతినిధులని ఎన్నుకోమందాం. ఎన్నికల్లో ఎవరు గెలిస్తే వాళ్ళే రాజు. వారిమాటే మిగతా వారు వినాలి. అంతేకదా. పనిలో పనిగా గ్రామాల్లో ఉన్న మీ స్నేహితులైన పశువులని, గుర్రాల్ని కూడా తీసుకురండి అంది” పులి రాజ ప్రతినిధిగా .
సింహం ఉదార బుద్ధిని వేనోళ్ల కీర్తించి, ”గ్రామాల్లో ఉన్న సాదు జంతువులను కూడా పిలుచుక రండి. అందరం కలిస్తే, మనలో పదో వంతు కూడా ఉండవా క్రూర జంతువులు. మనం తప్పక గెలుస్తాం. సింహాసనం మనదే”. అని వెంటనే జింకను గ్రామాల్లోకి పంపాయి. నమ్మిన సాధు జంతువులు అడవికి వచ్చాయి. ఎక్కడ చూసినా శాకాహార జంతువులే కనిపించ సాగాయి.
”మా తరపున ఏనుగును పోటీలో నిలబెడుతున్నాం. మాకు ఓటు హక్కు కల్పించి, ఎన్నికలు పెట్టండి. మీ క్రూర పాలనకు, స్వస్తి పలికి, మా సాధు జీవుల పాలన ప్రారంభిస్తాం. మా పాలనలో అన్నీ జంతువులకు రక్షణ, ఆహారం, వసతి ఉంటుంది” అని జంతువులన్నీ ఒక్కుమ్మడిగా నివేదించాయి, నినదించాయి గుహ ముందు.
తప్పకుండా పెడదాం. ఇప్పుడా ఎండాకాలం. చెలిమల్లో నీళ్ళు ఎండిపోయి, దాహానికి భలే ఇబ్బంది అవుతోంది. కాస్త వర్షాలు పడ్డాక ఎన్నికలు పెట్టుకుందాం. ఇది రాజు గారు చెప్పమన్న మాట” అంది గుంట నక్క.
నమ్మిన బక్క జంతువులన్నీ ‘నిజమేకదా….’ అనుకుంటూ అడవిలోకి వెళ్లిపోయాయి. పెద్ద జంతువుల వేట నిక్షేపంగా సాగుతోంది.
వర్షాకాలం రావడంతో అడవంతా పచ్చ బడ్డది. వర్షాలు చక్కగా పడసాగాయి.
మళ్ళీ సాధు జీవులన్నీ కూడి ”ఇక ఎన్నికలు పెట్టొచ్చు. నీళ్ళకు ఇబ్బంది లేదు” అని మళ్ళీ ఏనుగు, కుందేలు వెళ్లి అడిగాయి.

”వాగులు, వంకలు పొర్లి పోతున్నాయి. చాలా జంతువులు కొట్టుకపోయాయి. ఎన్ని మిగిలాయో చూసి, వర్షాలు తగ్గాక పెట్టుకుందాం ఎ…న్ని….క…..లు….” అంది సింహం తరపున తోడేలు.
నిజమే కదా. మా చిన్న జంతువులే ఎక్కువ నష్టపోయాయి. వర్షాలు తగ్గాకే పెట్టుకుందాం. ఎంతైనా దయగల మారాజు” అనుకుంటూ అడవిలోకి వెళ్లిపోయాయి.
క్రూర జంతువుల వేట, బక్క ప్రాణుల మీద చక్కగా సాగుతోంది. గతంలోకంటే, జంతువులు సమద్ధిగా దొరకడంతో, తిని బాగా బలిశాయి పెద్ద జంతువులు.
”వర్షాలు తగ్గి, చలికాలం వచ్చింది. ఇప్పటికైనా ఎన్నికలు పెడతారా,? లేదా?” అని ప్రశ్నించాయి ధైర్యం చేసి చిన్న జంతువులు. రాజుగారు అజీర్తి చేసి, విశ్రాంతి తీసుకుంటున్నారు. వారి వొంట్లో సుస్తి తగ్గితే, అప్పుడు పెడతాం ఎన్నికలు అంటున్నారు. అప్పటివరకూ మీరు రానవసరం లేదు. మా రాజు గారే తాఖీదు పంపిస్తారు ఎన్నికలకు వెళ్ళండి”. అంది పులి.
ఏనుగు, కుందేలు మాట నమ్మి, బంగారు కలలతో అడవికి వచ్చిన జంతువులు, తమ వారిని పోగొట్టుకొని- ఇంక ఎదురుచూసే ఓపిక, రాజుపై నమ్మకం లేక బ్రతుకు జీవుడా అనుకుంటూ తిరుగుముఖం పట్టి వెళ్లి పోయాయి గ్రామాల్లోకి .
జింక, కుందేలు, ఏనుగు వంటి మరికొన్ని జంతువులు ‘ఎప్పటికైనా, ఎన్నికలు పెట్టక పోతారా! మేము గెలవక పోతామా! మా రాజ్యం రాకపోతుందా!’ అని ఎదురుచూస్తూ, అడవిలో అలాగే ఉండిపోయాయి.
క్రూర జంతువుల వేట కొనసాగుతూనే ఉంది. సాధు జీవులు బలవుతూనే ఉన్నాయి. ఇంకా ఎన్నికలు జరగానే లేదు. సింహం తన సింహాసనాన్ని వదులుకోనే లేదు.
ఎప్పటికైనా సింహం- ప్రజాస్వామ్యాన్ని ప్రేమించి, అన్ని జంతువులకూ ఓటు హక్కు కల్పిస్తుందని – ఎన్నికలు నిర్వహిస్తుందనీ – మెజారిటీ కలిగిన తమకు రాజ్యాధికారం సిద్ధిస్తుందని – నిత్యం క్రూర జంతువులకు బలవుతూ ఆశగా అడవిలో అలాగే ఎదురుచూస్తున్నాయి సాత్విక జీవులు.
– పుప్పాల కృష్ణమూర్తి