విభిన్న దృవాలే..!

Different styles..!వాడెప్పుడూ బహిరంగపు బాటవెంట
చిరునవ్వుల కిరణాలనే వెదజల్లుతాడు.
అంతరంగపు అంతరిక్షంలోనే
కన్నీటి వేదన తాళాన్ని మోగిస్తాడు..!
వాడెప్పుడూ బహిరంగ బాటవెంట
శాంతి వచనాల సౌధాన్నే నిర్మిస్తుంటాడు.
అంతరంగపు అంతరిక్షంలోనే
యుద్ధభీకర సామ్రాజ్య గర్జనలు వింటుంటాడు..!
వాడెప్పుడూ బహిరంగ బాటవెంట
ప్రేమతత్వపు గులాబీ మొక్కలను నాటుతుంటాడు.
అంతరంగపు అంతరిక్షంలో ద్వేషపు ఆనవాళ్ల
అగ్నిపర్వతమై రగులుతుంటాడు..!
వాడెప్పుడూ బహిరంగపు బాటవెంట
సత్యసందేశపు శిఖరమై కనిపిస్తాడు.
అంతరంగపు అంతరిక్షంలోనే అబద్ధాల
జలపాతంలో అసత్యమై తేలుతుంటాడు..!
వాడెప్పుడూ బహిరంగపు బాటవెంట
మానవత్వపు ప్రజాస్వామ్యగీతాన్నే పాడుతుంటాడు.
అంతరంగపు అంతరిక్షంలో మతాల
గేయాల మందుపాతరలను పేల్చుతుంటాడు..!
వాడు బహిరంగంగా బతికే వున్నాడు.
అంతర్గతంలో అనాథ శవమయ్యాడు..!
వాని బహిర్గతం.. అంతర్గతం రెండూ ఎప్పటికీ రాజకీయ అయస్కాంతపు విభిన్న ధవాలే..!
– ఫిజిక్స్‌ అరుణ్‌ కుమార్‌, 9394749536