గుజరాత్‌ బీజేపీలో అసమ్మతి

Dissent in Gujarat BJP– పార్టీ పదవికి ప్రదీప్‌సింగ్‌ వాఘేలా గుడ్‌బై
అహ్మదాబాద్‌ : సాక్షాత్తూ ప్రధాని నరేంద్ర మోడీ ఇలాకాలోనే బీజేపీలో అసమ్మతి స్వరాలు వినిపిస్తున్నాయి. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పాటిల్‌పై తిరుగుబాటు చేస్తున్న నాయకులను ఒక్కొక్కరినే బయటికి సాగనంపుతున్నారు. తాజాగా పార్టీ ఆదేశానుసారం బీజేపీ గుజరాత్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రదీప్‌సింగ్‌ వాఘేలా తన పదవికి రాజీనామా చేశారు. ఆయనను రాజీనామా చేయాల్సిందిగా పార్టీ ఆదేశించిందని డెక్కన్‌ హెరాల్డ్‌ పత్రిక తెలిపింది. ‘పార్టీ పదవికి రాజీనామా చేయాల్సిందిగా వాఘేలాను గత నెలలోనే ఆదేశించారు. గాంధీనగర్‌లోని పార్టీ కార్యాలయానికి రావద్దని కూడా చెప్పారు’ అని పేరు చెప్పడానికి ఇష్టపడని బీజేపీ నాయకుడొకరు ఆ పత్రికకు చెప్పారు. పార్టీ నాయకత్వంతో చర్చించి సమస్యను పరిష్కరించుకోవాలని వాఘేలా ప్రయత్నించారని, అయితే అది ఫలించలేదని, దీంతో గత నెల 31న ఆయన రాజీనామా చేశారని ఆ నాయకుడు వివరించారు. పార్టీకి చెందిన మరో ప్రధాన కార్యదర్శి భార్గవ్‌ భట్‌ను కూడా ఇలాగే సాగనంపారు. ఆయనను పార్టీ పదవి నుండి వైదొలగాల్సిందిగా ఏప్రిల్‌లో ఆదేశించారు.లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సీఆర్‌ పాటిల్‌పై పలువురు నాయకులు తిరుగుబాటు చేయడం బీజేపీని కలవరపరుస్తోంది. పాటిల్‌కు వ్యతిరేకంగా గళం విప్పిన వారిని పార్టీ నుండి బయటికి సాగనంపే కార్యక్రమం కొనసాగుతోంది. అందులో భాగంగానే గతంలో భార్గవ్‌ భట్‌ను, ఇప్పుడు ప్రదీప్‌సింగ్‌ వాఘేలాను బయటికి పంపారు. పార్టీ నాయకులకు పదవులు కట్టబెట్టి, అందుకు ప్రతిఫలంగా వారి నుండి లంచం తీసుకున్నా రంటూ పాటిల్‌పై ఆరోపణలు చేసినందుకు ముగ్గురు కార్యకర్తలను ఇటీవలే సూరత్‌ క్రైమ్‌ బ్రాంచ్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. వాఘేలా 2016 ఆగస్ట్‌ 10న రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియమించారు.