సెప్టెంబర్‌ 2 నుంచి డబుల్‌ ఇండ్లు పంపిణీ

సెప్టెంబర్ 2 నుంచి తొలి విడుత పంపిణి
సెప్టెంబర్ 2 నుంచి తొలి విడుత పంపిణి

– తొలి విడతలో 12వేల మందికి కేటాయింపు

నవతెలంగాణ హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన డబుల్‌ బెడ్రూం ఇండ్ల పంపిణీకి వచ్చే నెల 2 నుంచి ప్రారంభించనున్నట్టు మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ పేర్కొన్నారు. హైదరాబాద్ లో మొదటి విడతలో 12వేల మంది లబ్ధిదారులకు ఇండ్లను కేటాయించనున్నట్టు తెలిపారు. శనివారం డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ రాష్ట్ర సచివాలయంలో జీహెచ్‌ఎంసీ పరిధిలోని బల్దియా కమిషనర్‌ రోనాల్డ్‌ రోస్‌, హైదరాబాద్‌, మేడ్చల్‌-మల్కాజిగిరి, రంగారెడ్డి జిల్లాల కలెక్టర్లు అనుదీప్‌ దురిశెట్టి, హరీశ్‌, అమోయ్‌కుమార్‌, జీహెచ్‌ఎంసీ హౌజింగ్‌ ఓఎస్డీ సురేశ్‌లతో మంత్రి సమీక్ష నిర్వహించారు. సెప్టెంబరు 2న జీహెచ్‌ఎంసీ పరిధిలోని 8 ప్రాంతాల్లో అర్హులైన పేదలకు డబుల్‌ బెడ్‌రూం ఇండ్లను పంపిణీ చేయనున్నట్టు, ఇందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని కలెక్టర్లను మంత్రి ఆదేశించారు. ఇండ్ల పంపిణీలో పారదర్శకత ఉండేందుకు ఈ నెల 24న హైదరాబాద్‌ జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలో ర్యాండోమైజేషన్‌ సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించి డ్రా పద్ధతిలో అర్హులను ఎంపిక చేయనున్నట్టు తెలిపారు. సీఎం కేసీఆర్‌ పెద్ద మనసుతో పేద ప్రజల సొంతింటి కలను నెరవేర్చి తన ఉదారత్వాన్ని చాటుకుంటున్నారని మంత్రి తెలిపారు.

Spread the love