ఏడాదిలోపు పిల్లలకు పౌష్టికాహారం ఎలా ఇవ్వాలనేది తల్లులకు పెద్ద సవాలు.. పాలతో పాటు శిశువుకు ఏ ఆరోగ్యకరమైన ఆహారం ఇవ్వాలనే ఆలోచన ఎప్పటికీ ఉంటూనే ఉంటుంది. మరీ ముఖ్యంగా ఐదు ఆరు నెలల శిశువుకు ఎలాంటి ఆహారం ఇవ్వాలో అని సతమతం అవుతుంటారు. పౌష్టికాహారాన్ని పిల్లలు ఇష్టపడి తినేలా చూసుకోవడం కూడా ముఖ్యమే. బీటా కెరోటిన్ అధికంగా ఉండే క్యారెట్లు శిశువుకు పోషకాలనిచ్చే ఆహారం. అయితే పిల్లలకు క్యారెట్‌ను ఎలా ఇవ్వాలో తెలుసుకుందాం..
పిల్లలకు ఆహారం ఇవ్వడం ప్రారంభించినప్పుడు క్యారెట్‌తో ప్రారంభించవచ్చు. మంచి సేంద్రీయ క్యారెట్లను ఎంచుకోవాలి. చల్లటి నీటిలో బాగా కడగాలి. తొక్కలను తీసివేసి చిన్న ముక్కలుగా కోయండి. తర్వాత, వాటిని నీటిలో వేసి మరిగించాలి. కనీసం 10 నుండి 15 నిమిషాలు బాగా మొత్తగా ఉడికించాలి. బయటకు తీసి ఫిల్టర్ చేసిన చల్లటి నీటిలో కొద్దిసేపు ఉంచాలి. క్యారెట్లు మెత్తని పేస్టులా చేసుకోవాలి. అవసరాన్ని బట్టి నీటిని ఉపయోగించుకోవచ్చు. ఈ మిశ్రమాన్ని కొద్దికొద్దిగా పిల్లలకు ఇస్తూ ఉండాలి. మెల్లిగా క్యారెట్లు తినడం ప్రారంభమైతే, తర్వాత ఇతర కూరగాయలతో కలిపి ఆహారంగా ఇవ్వవచ్చు. ఇతర కూరగాయలలో బ్రోకలీ, గ్రీన్ బీన్స్, ఆపిల్, దోసకాయలు, ఆలూ, మోరం గడ్డ, బ్రౌన్ రైస్, చిక్కుళ్ళు, మాంసం, చికెన్ వంటివి పిల్లలకు బలవర్థకమైన ఆహారమే.
వైద్యుని సలహా
పిల్లలకు ఏదైనా ఆహారం ఇచ్చే ముందు వైద్యుడిని సంప్రదించడం మంచిది. కొంతమంది పిల్లలకు అలెర్జీ సంబంధిత సమస్యలు ఉంటే, వారికి క్యారెట్, బీట్‌రూట్ లేదా పాలకూర వంటి ఆహారాన్ని ఇవ్వకూడదని వైద్యులు సూచిస్తున్నారు.