ఇలా చేస్తే ఆడవారికి సమస్యలే…

మారుతున్న కాలానుగుణంగా మహిళలు పురుషులతో సమానంగా ఉద్యోగాలు చేస్తున్నారు. కొందరు రాత్రిపూట కూడా విధులు నిర్వర్తిస్తున్నారు. ఇది సాధికారతపరంగా సంతోషించదగిన విషయమే అయినప్పటికీ ఆరోగ్యపరంగా మాత్రం ప్రమాదకరం అంటున్నారు వైద్య నిపుణులు. ఆడవాళ్లు నైట్‌ డ్యూటీలు చేయక పోవడమే మంచిదని సూచిస్తున్నారు. పగలు ఉద్యోగాలు చేసే వారి కంటే రాత్రిళ్లు ఉద్యోగాలు చేసే మహిళలకు బ్రెస్ట్‌ క్యాన్సర్‌ ఎక్కువగా వస్తున్నట్లు ఓ పరిశోధనలో వెల్లడవ్వడమే ఇందుకు కారణం…
మామూలు వెలుతురులో కాకుండా లైట్ల కాంతిలో పని చేస్తే మెదడులో విడుదలయ్యే మెలటోనిన్‌ విడుదల కాకపోవడం వల్ల సమస్య మొదలవుతుందట. రొమ్ము, అండాశయ క్యాన్సర్లను ప్రేరేపించే ఈస్ట్రోజన్‌ మోతాదు పెరగకుండా చూసుకునే ఈ హార్మోన్‌… మధ్యరాత్రిలో బాగా ఉత్పత్తి అవుతుందట. అది కూడా చీకటిగా ఉన్నప్పుడు. అలాంటి సమయంలో కత్రిమ వెలుగులో పని చేయడం వల్ల ఉత్పత్తి ఆగిపోతుందట. తద్వారా క్యాన్సర్‌ ముప్పు పెరుగుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
అంతేకాదు, నైట్‌ డ్యూటీలు చేసే మహిళలకు పుట్టే పిల్లలు కూడా అంత ఆరోగ్యంగా ఉండటం లేదని కొన్ని పరిశోధనల్లో వెల్లడైంది. దానితో పాటు పేగుల సమస్యలు, జీర్ణక్రియ దెబ్బ తినడం వంటి మరికొన్ని సమస్యలు కూడా వచ్చినట్టు నివేదికలు చెబుతున్నాయి. ఈ విషయం మీద ఇంకా పరిశోధనలు జరుగుతున్నప్పటికీ… ఇంతవరకూ జరిపిన పరిశోధనల ఫలితాల దష్ట్యా మహిళలు రాత్రి పూట ఉద్యోగాలు చేయకపోవడమే మంచిదటున్నారు నిపుణులు.