బాధ పడొద్దు…

అమ్మాయిలు చిన్న చిన్న విషయాలకే బాధపడిపోతుంటారు. ఇలా మాట్లాడితే.. ఇలా చేస్తే.. ఎవరైనా ఏమన్నా అనుకుంటారేమోనని ఇబ్బంది పడడం, మదన పడటం సాధారణం.. అయితే శరీరం గురించి కానీ.. చుట్టూ ఉన్నవాళ్ల గురించి కానీ.. లేదా మాట్లాడే మాటలు, చేసే పనులు.. ఇలా దేని గురించైనా సరే.. ఇబ్బంది కానీ బాధ కానీ పడాల్సిన అవసరం ఏ మాత్రం లేదు. మరి, ఎక్కువ మంది అమ్మాయిలు ఏ విషయంలో ఇబ్బంది పడతారో.. దాని గురించి అసలు అంతగా పట్టించుకోవాల్సిన అవసరం ఎందుకు లేదో తెలుసుకుందాం...

నో చెప్పడం… : పనంతా పూర్తిచేసుకొని ఇంటికి వెళ్లేందుకు సిద్ధమవుతూ ఉండగా కొలీగ్‌ ”కాస్త ఈ పని చేసి పెట్టవా.. నాకు చాలా పని ఉంది” అంటూ అడగగానే.. ఇంట్లో అర్జంట్‌ పని ఉన్నా.. ఒప్పుకోకపోతే అవతలి వ్యక్తి ఏమనుకుంటారో అని ఇబ్బందిపడుతూ ఒప్పుకుంటారు. తన పనిని మీకు అప్పగించిన కొలీగ్‌ మాత్రం కాసేపట్లో ఇంటికి వెళ్లిపోతే.. తన పనిని భుజాలపై వేసుకొని మీరు రాత్రి వరకూ పనిచేస్తూ ఉండిపోతారు. అందుకే పని విషయంలోనే కాదు, నచ్చని విషయం ఏదైనా సరే.. దానికి ఖరాఖండీగా నో చెప్పేయండి. అవతలివారు ఏమనుకుంటారో, భవిష్యత్తులో మీకు ఏదైనా ఇబ్బంది ఎదురవుతుందేమో, అంటూ ఇలా రకరకాల కారణాలు మీకు మీరే చెప్పుకొని నచ్చని పని చేయవద్దు. కొన్నిసార్లు ఎదుటివాళ్లు మీరు మంచివాళ్లు కాదనుకున్నా సమస్యలేదు. వారి అవసరం అలా మాట్లాడిస్తుందంతే.
నచ్చని ఉద్యోగం : కొందరు చేసే ఉద్యోగం నచ్చకపోయినా చేయాల్సి వస్తోంది అని బాధపడుతూ ఉంటారు. కానీ చేసే ఉద్యోగం పెద్దగా నచ్చకపోయినా మనం చేసే ప్రతి పని మనకు ఎన్నో పాఠాలను నేర్పుతుంది. అందుకే పాఠాలను నేర్చుకుంటూ నచ్చిన ఉద్యోగం కోసం వెతుక్కోవాలే తప్ప.. మనసులో బాధ నింపుకోకూడదు.
కాస్త సమయం.. : జీవితంలో ఎత్తుపల్లాలుంటాయి. కొంత మందికి వైవాహిక బంధం అద్భుతంగా ఉందనుకున్నా కొన్ని రోజులకే వివిధ కారణాల వల్ల విడిపోవాల్సి రావచ్చు. ఇది మనసుకు బాధనిపించడం సహజమే. ఇలాంటి సందర్భాల్లో ఏడిస్తే మనం బలహీనులమని ఎదుటివారు ఎక్కడ అనుకుంటారో అని ఇబ్బందిపడితే నష్టం మనకే. కాబట్టి మీలోని బాధను కన్నీళ్ల రూపంలో బయటకు పంపించేయండి. మర్చిపోవడానికి మీకంటూ కాస్త సమయాన్ని ఇచ్చుకోండి. త్వరగా మర్చిపోలేకపోతుంటే మీరు బలహీనులని భావించొద్దు. మీరు అవతలి వ్యక్తిని అంత బలంగా ప్రేమించారు కాబట్టి మర్చిపోవడానికి కాస్త సమయం పడుతుందని భావించి జీవితంలో ముందుకెళ్లండి.
బరువు : కాస్త బరువు పెరిగితే చాలు… చాలామంది అమ్మాయిలు తెగ బాధపడిపోతుంటారు. అయితే ఆ బరువు నచ్చిన రెస్టారెంట్‌లో, ఎంతో ఇష్టమైన వ్యక్తులతో కలిసి కూర్చొని తినడం వల్ల పెరిగారని గుర్తుచేసుకోండి. ఆ అందమైన జ్ఞాపకాల ముందు ఈ కొద్దిపాటి బరువు ఏపాటిది? అందుకే దీని గురించి బాధపడడం మానేసి, ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని బరువు తగ్గించుకునేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టండి.
మనసు తేలిక : కొందరు బ్రేకప్‌ని తట్టుకోవడానికి స్నేహితులతో ఎక్కువ సమయం కేటాయిస్తుంటారు. లేదంటే కొన్ని వ్యసనాలకు బానిసలౌతుంటారు. కోపంతో అతడికి ఫోన్‌ చేసి తిట్టి.. తర్వాత బాధపడుతూ కూర్చోవద్దు… ఇవన్నీ మనసు ఎప్పటి నుంచో ఫీలవుతున్న విషయాలు… అందుకే అలా బయటకొచ్చేశాయి. కాబట్టి ఇలాంటి చిన్న విషయాల గురించి ఆలోచించి బాధపడకుండా, మనసు తేలిక పడిందని ఆనందించాలి.
మీ కోసం… : చాలామంది కుటుంబం కోసం ఖర్చు చేయడానికి ఏ మాత్రం వెనుకాడరు. కానీ తమ కోసం ఏదైనా కొనాలంటే మరీ ఎక్కువ ఖర్చు చేస్తున్నామని బాధపడుతూ ఉంటారు. అయితే మీరు ఖర్చు చేసేది మీరు కష్టపడి సంపాదించిన డబ్బు. దాన్ని మీ కోసం ఖర్చు చేయడంలో ఏ మాత్రం తప్పు లేదని గుర్తుంచుకొని బాధపడడం మానేయండి.
తప్పు కాదు : మీ బెస్ట్‌ఫ్రెండ్‌, మీరు కొన్నేళ్ల నుంచి కలిసి ఉన్నారు. కానీ మీ ముందు బాగుంటూ మీ వెనుక మీ గురించి తప్పుగా చెబుతోందని తెలిసిందా? లేక మీ ఇద్దరి మధ్యా ఏదైనా గొడవ వచ్చి విడిపోయారా? అయితే దీని గురించి తప్పుగా మాట్లాడే వ్యక్తితో విడిపోవడం మీకే మంచిది. కొన్ని రోజులు స్నేహితురాలు లేని లోటు తెలుస్తుంది. కానీ తనని వదులుకోవడం మీ తప్పు కాదు కాబట్టి బాధపడకండి.
సక్సెస్‌ సాధించడం : ఒక మహిళ సక్సెస్‌ సాధిస్తోందంటే కేవలం పని వల్లే కాదని.. ఇంకేదో చేస్తోందని అనే వాళ్లు ఎంతో మంది ఉంటారు. కానీ ఎలాంటి పనులు చేశారో మీకు తెలుసు కాబట్టి ఎవరో అనే మాటలను పట్టించుకుని బాధపడాల్సిన అవసరం లేదు. మీరు పడే కష్టానికి వచ్చే ప్రతి విజయాన్ని ఆస్వాదిస్తూ ముందుకు సాగండి.