ఇల్లందు సీపీఐ(ఎం) అభ్యర్థిగా దుగ్గి కృష్ణ

నవతెలంగాణ-కామేపల్లి
ఇల్లందు అసెంబ్లీ నియోజకవర్గం సీపీఐ(ఎం) అభ్యర్థిగా దుగ్గి కృష్ణను పార్టీ రాష్ట్ర కమిటీ నిర్ణయించి ఎంపిక చేసింది. దీంతో పార్టీ కార్యకర్తలతో పాటు అభిమానులు హర్షం వ్యక్తం చేశారు. దుగ్గి కృష్ణది ఖమ్మం జిల్లా కామేపల్లి మండలం మద్దులపల్లి గ్రామం. తండ్రి నరసయ్య, తల్లి అనంతమ్మ కాగా తండ్రి సిపిఎం పార్టీ మద్దులపల్లి గ్రామపంచాయతీ సర్పంచ్‌గా గెలుపొంది ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాటాలు చేశారు. తండ్రిని స్ఫూర్తిగా తీసుకొని దుగ్గి కృష్ణ సీపీఐ(ఎం)లోకి వచ్చారు. పార్టీ మండల కార్యదర్శిగా పని చేయడంతో పాటు ప్రస్తుతం పార్టీ జిల్లా కమిటీ సభ్యులుగా, గిరిజన సంఘం రాష్ట్ర నాయకులుగా పనిచేసి ప్రజా సమస్యల పరిష్కారం కోసం నేటి వరకు పోరాటాలు చేస్తూనే ఉన్నారు. గిరిజనుల పోడు భూముల పట్టాల కోసం, గిరిజనేతరుల సమస్యల పరిష్కారం కోసం పోరాటాలు చేశారు. ప్రజల కోసం జైలుకు కూడా వెళ్లారు. ఇల్లందు నియోజకవర్గం అంటేనే కమ్యూనిస్టుల గడ్డ. సిపిఎం పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కృష్ణకు అడుగడుగునా ఆదరణ లభించే అవకాశాలు బాహటంగా కనబడుతున్నాయి. నిత్యం ప్రజలతో కలిసి ప్రజా సమస్యల పరిష్కారం కోసం పాదయాత్రతో పాటు సైకిల్‌ యాత్ర చేసి సమస్యలను తెలుసుకొని ఎమ్మెల్యేలకు వినతి పత్రాలు అందించిన ఘనత దుగ్గికి ఉన్నది. సీపీఐ(ఎం) రాష్ట్ర, జిల్లా నాయకత్వం తనను గుర్తించి ఎన్నికల బరిలో నిలబెట్టినందుకు కృతజ్ఞతలు తెలిపారు.
సీపీఐ(ఎం) రాష్ట్ర జిల్లా కమిటీకి కృతజ్ఞతలు : అంబటి శ్రీనివాసరెడ్డి
దుగ్గి కృష్ణకు ఎమ్మెల్యే సీపీఐ(ఎం) అభ్యర్థిగా పోటీలో నిలబెట్టినందుకు పార్టీ రాష్ట్ర, జిల్లా కమిటీకి సిపిఎం పార్టీ కామేపల్లి మండల కార్యదర్శి అంబటి శ్రీనివాసరెడ్డి, మండల కమిటీ, మండల కార్యకర్తలు కతజ్ఞతలు తెలిపారు. సీపీఐ(ఎం) కార్యకర్తలతో పాటు సానుభూతిపరులు అభిమానులు అత్యధిక ఓట్లువేయాలని కోరారు.