రూ.5 కోట్ల 27 లక్షలతో రోడ్ల నిర్మాణం విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి

మీర్జాగూడ-జన్వాడ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన
నవతెలంగాణ-శంకర్‌పల్లి
రూ.5 కోట్ల 27 లక్షలతో మీర్జాగుడా-జన్వాడ రోడ్డు పనులకు శంకుస్థాపన చేసినట్టు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. బుధవారం చేవెళ్ల ఎమ్మెల్యే యాదయ్య ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ శంకర్‌పల్లి రూపురేఖలు మార్చిన ఘనత ముఖ్య మంత్రి కేసీఆర్‌కే దక్కుతోందన్నారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఆధ్యాత్మిక దినోత్సవాల సందర్భంగా చిరు జల్లులు కురవడం సంతోషం కల్గిస్తుందన్నారు. దశాబ్ది ఉత్సవాల సందర్భంగా రాష్ట్రంలోని గుడులు, మసీదులు, చర్చీలు ముస్తాబు చేసి ప్రత్యేక ప్రార్థనలు చేసినట్టు చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో తొమ్మిదేండ్లలో ఊహించని అభివద్ధి జరిగిందనీ, ప్రతి ఒక్కరూ 2014కు ముందు, తర్వాత పరిస్థితులను బేరీజు వేసు కోవాలన్నారు. ప్రజలతో ప్రజాప్రతినిధులు మమేకమై, పల్లె ప్రగతితో చేపట్టిన కార్యక్రమాలు సత్ఫలితాలు ఇచ్చాయన్నారు. హరితహారం ద్వారా విరివిగా మొక్కలు నాటడంతో రాష్టం దేశానికే ఆదర్శంగా నిలుస్తుందన్నారు. గతంలో 8 వేలు ఉన్న గ్రామ పంచాయతీలు 4 వేల వరకు నూతనంగా ఏర్పాటు చేయడంతో 12 వేల గ్రామ పంచాయతీలు ఉన్నాయనీ ,500 జనాభా ఉన్న తండాలను కూడా గ్రామపంచాయతీలుగా చేసినట్టు తెలిపారు. ఆయా గ్రామాలకు నూతన కార్యదర్శులను కూడా నియమించి, ప్రతి గ్రామానికి గ్రామ పంచాయతీ భవనం ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి తెలిపారు. ఇందుకు గాను రూ.85 కోట్లు విడుదల చేసినట్టు తెలిపారు.గ్రామాల్లో పల్లె ప్రకతి వనం, నర్సరీ, శ్మశాన వాటికలు, క్రీడా మైదానాలు, ట్రాక్టర్లు, ట్యాం కర్లు, ట్రాలీలతో తెలంగాణ పల్లెలు కళకళ లాడుతున్నాయన్నారు. దీంతో సర్పంచ్‌ల గౌరవం పెరిగిందన్నారు. రాష్ట్రంలో 19 వేల ప్రకతి వనాలు రూ.750 కోట్లు ఖర్చుతో అభివృద్ధి చేసినట్టు చెప్పారు. హరితహారంలో భాగంగా ఇప్పటివరకు 230 కోట్ల మొక్కలు నాటడంతో అడవుల శాతం పెరిగిందన్నారు. నకిలీ విత్తనాలు విక్రయిస్తే, పీడీ యాక్ట్‌, రైతు బంధు, భీమా, సకాలంలో ఎరువులు అందిస్తూ, 24 గంటల విద్యుత్‌ అందిస్తూ సీఎం కేసీఆర్‌ రైతు పక్షపాతిగా నిలిచారని తెలిపారు. సీఎం కేసీఆర్‌ రూ. 7 వేల 300 కోట్లతో మన ఊరు-మన బడి కార్యక్రమంలో భాగంగా పాఠశా లల్లో సకల సౌకర్యాలు కల్పిస్తున్నట్టు తెలిపారు. ఇండ్లు లేని నిరుపేదలకు ఇండ్లు, ఇండ్ల స్థలాలు ఇస్తుందని, గృహలక్ష్మి కింద రూ. 3 లక్షలు ఇల్లు కట్టుకోవడానికి ఇస్తుందన్నారు. రూ.30 లక్షలు మిర్జాపూర్‌ అనుబంధం గ్రామానికి రోడ్డు నిర్మా ణానికి మంజూరు చేస్తున్నట్టు మంత్రి తెలిపారు. గురుకులాలు 1000 ఏర్పాటు చేస్తే, అందులో 5 లక్షల మంది విద్యార్థులు విద్య అభ్యసిస్తున్నారని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో గతేడాది 8 వ తరగతి నుంచి ఆంగ్లంలో బోధన ప్రారంభించారని, ఈ సంవత్సరం 9 వ తరగతి వరకు ఆంగ్ల బోధన ఉంటుందన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ర్థులకు నోట్‌, పాఠ్య పుస్తకాలు, యూనిఫాంలు, రాగి జావా ఇవ్వాలని, ఉపాధ్యాయులకు ట్యాబ్‌లు ఇవ్వా లని సీఎం కేసీఆర్‌ నిర్ణ యించినట్టు తెలిపారు. నూతన సెక్రటేరియట్‌లో మొదటి సమావేశం పాలమూరు-రంగారెడ్డిపై సీఎం కేసీఆర్‌ పెట్టారనీ,ఈ విషయంపై కాళేశ్వరం ప్రాజెక్ట్‌ లాగే పాలమూరును కూడా పూర్తి చేస్తారనే నమ్మకం ప్రజలకు ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ గోవర్ధన్‌ రెడ్డి, జడ్పీటీసీ గోవిందమ్మగోపాల్‌ రెడ్డి, మార్కెట్‌ చైర్మన్‌ మారేపల్లి పాపారావు, వైస్‌ చైర్మన్‌ వెంకటేష్‌, సొసైటీ చైర్మన్‌ శశిధర్‌ రెడ్డి, సర్పంచ్‌ల సంఘం జిల్లా అధ్యక్షులు, మిర్జాగూడ గ్రామ సర్పంచ్‌ రవీందర్‌ గౌడ్‌, గ్రామాల సర్పంచ్‌, లలిత నరసింహా, శ్రీనివాస్‌, ఎంపీడీవో వెంకన్న, పార్టీ మండల అధ్యక్షులు గోపాల్‌, సీనియర్‌ నేతలు గోపాల్‌ రెడ్డి, వెంకట్‌రెడ్డి, వాసుదేవ్‌ కన్నా, బాలకృష్ణ, గోవర్ధన్‌రెడ్డి, శ్రీనాథ్‌గౌడ్‌, ఎంపీటీసీలు, ఉప సర్పంచ్‌లు, ఇతర ప్రజాప్రతినిధులు, నాయకులు, ప్రజలు,పెద్ద ఎత్తున మహిళలు, యువత పాల్గొన్నారు.