జమ్ముకాశ్మీర్‌లో ఎన్‌కౌంటర్‌

నలుగురు ఉగ్రవాదులు మృతి
శ్రీనగర్‌ : జమ్ముకాశ్మీర్‌లోని కుప్వారాలో శుక్రవారం ఉదయం జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌లో నలుగురు మిలిటెంట్లు మరణించారు.
కుప్వారాలోని మచల్‌ సెక్టార్‌లో గల నియంత్రణరేఖ (ఎల్‌ఓసీ) సమీపంలో పోలీసులు, ఆర్మీ అధికారులు శుక్రవారం సంయుక్తంగా ఆపరేషన్‌ చేపట్టారు. ఈ ఆపరేషన్‌లో నియంత్రణ రేఖ మీదుగా పాకిస్తాన్‌ ఆక్రమిత కాశ్మీర్‌ నుంచి భారత్‌లోకి చొరబడేందుకు యత్నిస్తున్న నలుగురు ఉగ్రవాదులను భద్రతా సిబ్బంది గుర్తించారు. కాల్పుల్లో ఆ నలుగురు మరణించినట్టు కాశ్మీర్‌ జోన్‌ పోలీసులు తెలిపారు. గతవారం కూడా కుప్వారాలోని నియంత్రణ రేఖ(ఎల్‌ఓసీ)కి సమీపంలో ఉన్న జంగుండ్‌ కెరాన్‌ వద్ద భారీ చొరబాటు ప్రయత్నాల్ని భద్రతా బలగాలు అడ్డుకున్నాయి.
నాటి ఎన్‌కౌంటర్‌లో పాకిస్తాన్‌కు చెందిన ఐదుగురు మిలిటెంట్లు మరణించినట్టు కాశ్మీర్‌ పోలీసులు పేర్కొన్నారు.