తొలకరి పలకరింపు!

రోజూ ఒక కలగంటాను
నే రాసిన ప్రతి పద్యమూ
పాఠకుని ఎదలో ఇంకే
అదను చూసి కురిసే వాన చినుకు కావాలని!

అరవైకి పైగా వానా కాలాల్ని చూశాను
ప్రతి వానా కాలమూ
నన్ను ఆశ్చర్య పరిచే
మహా కవి సరి కొత్త కావ్యమే!

తొలకరి మొదలైతే చాలు
ఇప్పటికీ నాలో ఒక పులకింత
కక్ష కట్టిన ఎండా కాలం క్షణంలో
ఎవరో మంత్రించినట్లు మాయం!

ఎదలో దాచుకున్న
బాల్యపు స్మతి కెరటాలన్నీ
కాగితప్పడవలేసుకునిజి
జీవన మాధుర్యాలను మోసుకొస్తాయి!

జిన జిన వాన కురుస్తున్నప్పుడు
గుడిసె హౌటల్లో నుంచొని మిత్రుల్తో
వేడి వేడి ఛాయిని ఆస్వాదిస్తుంటే
ఆ అనుభూతిని ఏ పద్యమూ వ్యక్తం చేయలేదు!

వానలో తడవొద్దూ తడవొద్దని
మనసూ ఆమే ఒకటే గోల
నేను కవిని కదా నిలువునా తడవందే
ఈ మట్టి పరిమళం నన్నంటుకోదు!

పొలాన్ని తడిపిన తొలకరి పలకరింపు
పదునైన కవితా పాదం
నిత్యం ఈ లోకానికి
సరికొత్త పంటను వాగ్దానం చేస్తాయి!!

– కోట్ల వెంకటేశ్వర రెడ్డి
9440233261