దక్కన్‌ పతాకం

ఇది తూర్పు పడమరల నట్టనడిగడ్డ
సాత్పురా నీలగిరిల నడుమ నిలిచిన మైదానం
బహు సంస్కతుల దక్కన్‌ పీఠభూమి

కష్ణా గోదావరి నీళ్ల గలగలలోనే
పోరాటం సామరస్యం కలెగలిసిన ప్రవాహం
సహజీవనం ఈ నేల ప్రాకతిక లక్షణం
ఇది తెలంగాణ మట్టి తెచ్చుకున్న వారసత్వం

నెత్తి మీద తెల్ల తెల్లని రుమాలు
తల మీద నిటారుగా నిలిచిన రూమి టోపీ
గుండె గుండె అలారు బలరు ల తో నులువెచ్చని స్పర్శ

కలవక కలవక కలిస్తే రాలిన వలవల శోకం
కాకి ఎంగిలి తినిపించుకున్న స్నేహం
భుజాల మీద చేతులు ఏసుక తిరిగిన కాలం
ఆపతి సంపతిల ఆదుకునే సోపతి తత్వం

భాషలు వేరైనా భావాల సమైక్యత ఒక్కటే
సంస్కతులు వేరైనా జనజీవితం ఒకటే
నారాయణగూడ లో కన్నడిగుల కస్తూరి పరిమళం
బేగంబజార్‌ నిండా వ్యాపించిన మార్వాడి మధురిమలు
తిరుమలగిరి బొల్లారం తమిళ తళుక్కువాక్కులు
కోటి రామ్‌ కోటి చుట్టూ అల్లుకున్న గుజరాతీయం
కూకట్పల్లి కొండాపూర్‌ కొండల్లో నిలిచిన అంధ్రం
చార్మినార్‌ చుట్టూ అల్లుకున్న ముస్లిం జీవన సౌరభం
హైదరాబాద్‌ ఒక మహా భాగ్యనగర పుష్పం

అసిఫ్‌ జాహీలైన, కుతుబ్‌ షాహిలైనా
గోలకొండను ఏలిన బహుమనీలు ఎవరైనా
బహుళ విలువల దక్కన్‌ పతాకం రెపరెపలాడాలి
సాంస్కతిక సహజీవనం పరిఢవిల్లాలి.
– అన్నవరం దేవేందర్‌, 9440763479