కష్టపడి పనిచేయడం.. మనకు ప్రత్యేకంగా నేర్పక్కర్లేదు. ఇల్లు, ఆఫీసు పనేదైనా నిబద్ధతతో చకచకా చేసుకుంటూ వెళతాం. ఎంత సంపాదించినా.. ఏ స్థాయిలో నిలిచినా చాలా మంది ఆర్థిక నిర్వహణ దగ్గరికి వచ్చేసరికి తడబడుతుంటారు. ఇది చాలా ప్రమాదం కదా! ఇల్లు, ఆఫీసు బాధ్యతలను చక్కగా నిర్వర్తిస్తాం. ఇంట్లో వాళ్లకు ఏమేం కావాలో దగ్గరుండి చూసుకుంటాం. అన్నీ ఎంత క్రమపద్ధతిగా చేసినా.. ఖాతా మాత్రం ఎలా ఖాళీ అవుతోందో తెలియట్లేదు. చాలామంది ఉద్యోగినులు ఎదుర్కొనే పరిస్థితే ఇది. అయితే ఈ నియమాలు పాటిస్తూ, కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఖర్చు ఎలా అవుతుందో తెలుస్తుంది. తద్వారా పొదుపు కూడా సాధ్యమవుతుంది. మరి అవేంటో తెలుసుకుందాం…
బడ్జెట్‌ని మూడు రకాలుగా విభజించుకోండి. నిత్యా వసర సరకులు, మందులు, గ్యాస్, కరెంటు బిల్లులు, వంటి వాటిని అత్యవసర జాబితాగా రాసుకోండి. ఈ నెల లేకపోయినా పర్లేదు అనిపించిన వాటిని మరో జాబితాగా రాసి పెట్టుకోండి. వేటికి ఎంత ఖర్చవుతుందో అంచనా వేసుకొని ఉంచుకోండి. తర్వాత పొదుపుకు ఎంత కేటాయించుకోవాలో కూడా నిర్ణయించుకోండి. అత్యవసర అవసరాలు, పొదుపు.. రెండూ పూర్తయ్యాకే మిగిలినవి అనుకుంటే సరి. ఈ తీరు ఖర్చు అదుపులో ఉంచడమే కాదు.. ప్రాధాన్యాత లను నిర్ణయించుకోవడాన్నీ అలవాటు చేస్తుంది. అయితే ఖర్చు పెట్టిన ప్రతి రూపాయి లెక్కా ఆ పుస్తకంలో చేర్చడం మాత్రం మరవొద్దు.
వేస్ట్ ఖర్చులు వద్దు
సరకులు, దుస్తుల కోసం పెద్ద షాపులు, మాల్స్‌కి వెళుతున్నారా? ఒకటి కొనాలని వెళ్తుంటాం. ఆఫర్లు, రాయితీలు ఆకర్షించేస్తాయి. తక్కువకు వస్తున్నాయని అవసరం లేకపోయినా కొంటాం. అదేమో మన బడ్జెట్‌పై ప్రభావం చూపుతుంది. కొనేముందే నిజంగా అవసరమా అని చెక్ చేసుకోండి. చాలా అవసరం అనిపిస్తేనే కొనండి. లేదంటే ఎంత తక్కువ అయినా పక్కన పెట్టేయాల్సిందే. అప్పుడే ఖర్చు కట్టడి అవుతుంది.
ప్రణాళికగా..
పిల్లల పుట్టినరోజులు, పండగలంటూ అనుకోని ఖర్చులొస్తుంటాయి. బడ్జెట్‌లో వీటికీ ముందస్తు ప్రణాళిక ఉండాలి. లేదంటే తర్వాత మనమే ఇబ్బంది పడతాం. నెలలో ప్రత్యేక దినాలు వగైరా ఉంటే ముందుగానే మార్క్ చేసుకోవాలి. వాటికీ ఎంత ఖర్చు అవుతుందనేది అంచనా వేసుకోవాలి. దాని ప్రకారం ఆ నెల ఖర్చులను ప్లాన్ చేసుకోవాలి. అప్పుడూ భారమని పించదు. ఇలా నెలపాటు ప్రణాళికతో సాగండి. తర్వాతి నెలల్లో అవసరమైతే మార్పులు చేసుకోండి. ఖర్చు ఆనుపానులు తెలియడమే కాదు.. ఆర్థిక క్రమశిక్షణా అలవడుతుంది.
తరచూ బయట తింటున్నారా..
యువతులైతే.. ఓపిక లేదనో, వంట చేసుకోడానికి సమయం లేదనో ఒక్కోసారి బయట తింటుంటారు. ఎప్పుడో ఒకసారి పర్లేదు కానీ.. తరచూ చేస్తోంటే పర్సు ఖాళీ. పైగా అనారోగ్యాలూ చుట్టుముడతాయి. ఆరోగ్యానికి హాని కలిగించని, తేలికగా చేసుకునే వీలున్న వాటిపై దష్టిపెట్టండి. ఎక్కువ సమయం తీసుకోవు. ఆరోగ్యమూ పాడవదు. ఇంకా ఆ మిగిలిన డబ్బులతో ఏదైనా ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ చేసుకోవచ్చు.
అవసరమే కానీ..
వారమంతా పనిచేస్తుంటే శరీరం, మనసు అలసిపోవడం మామూలే. ఆఫీసు ముగిశాక సేదదీరు దామని సహౌద్యోగులు పిలవగానే మనసు అటుకేసి వెళ్లడమూ సాధారణమే. అలాగని బడ్జెట్ మరవట్లేదు కదా? ఏ ఒక్కరి ఆర్థిక అవసరాలూ ఒకలా ఉండవు. ఎదుటివారు ఖర్చు పెడుతున్నారనో.. వాళ్లముందు పరువు తక్కువనో అవసరం ఉన్నవీ లేనివీ కొనేయొద్దు. అమ్మాయిలం షాపింగులో పడితే సమయమే తెలీదు. తీరా గమనించుకునే సరికే ఖాతా ఖాళీ అయిపోతుంది. వెళ్లాల్సి వస్తే ఇంత బడ్జెట్ అని పెట్టుకోండి. అదీ నెలకు రెండుసార్లకు మించకపోతే మంచిది. నిజంగా సేద తీరాలంటే ఏ పార్క్‌లో నడకకో, ఆటలకో ప్రాధాన్యమిస్తే సరి. ఆనందంతో పాటు ఆరోగ్యమూ సొంతమవుతుంది.
అన్నీ గమనించాలి
అప్పగించిన బాధ్యత చక్కగా నిర్వహిం చామా.. వేళకి పని ముగించుకొని బయటపడ్డామా అన్నట్లే ఉంటుంది ఎక్కువ శాతం మన ఆలోచన. ఇంటి వద్ద బాధ్యతలు ఎదురు చూస్తుంటాయి కదా మరి. అలాగని ఈ చట్రంలోనే ఉండిపోతే ఎలా? చుట్టుపక్కల విషయాలూ తెలుసు కోవాలి. సంస్థలు ఉద్యోగులకు కొన్నిసార్లు ప్రత్యేకంగా మహిళలకు కొన్ని సదుపాయాలు కల్పిస్తుంటాయి. వాటి గురించి తెలుసు కోండి. హెల్త్ ఇన్సూరెన్స్, రిటైర్‌మెంట్ ప్లాన్స్, ట్యూషన్ రీయం బర్స్‌మెంట్ వంటివి చాలావరకూ సంస్థలు అందిస్తుం టాయి. వాటిలో మీకు అనువైనవి ఉపయోగించు కోవడంలో తప్పూ లేదు. డబ్బు కూడా ఆదా అవుతుంది.