ఒక దురహంకార్యం కోసం..

ఉచ్ఛనీచాలు తలకెత్తుకున్నాక
ద్వేషం నీ నీడై నడుస్తున్నది
మెదళ్ల నిండా దురహంకారం తప్ప
మరో పదార్థమేది నిండలేదు

బుల్‌ షిట్‌…

బహుశా నువ్వు వికత శిశువుగా
ఈ దేశం మీద పుట్టి ఉంటావు
నిన్ను పెంచిన తల్లి…
నీకు నడక నేర్పిన తండ్రి
నీకు సరైన బుద్ధులు మాత్రం నేర్పలేకపోయారు

నీ పుట్టుకే ఈ దేశానికి తలవంపు!
తరాలు గడిచినా మాయని మచ్చ!!

దిమాక్‌ లేని నీ వికత చర్యకు
సిగ్గుతో దేశం బిక్కచచ్చిపోయింది
ప్రపంచం నీ మీద కాండ్రించి ఉమ్మేస్తున్నది
కుక్కలు కూడా చేయని పని
నువ్వు మనిషివై చేసిన వైనానికి
కళ్లూ చెవులు మూసుకుంటున్నది

నీలో కండకావరం తప్ప
మనిషివనే సోయి ఇసుమంతైనా లేదు
నిన్ను ఇట్లా మగాన్ని చేసిన
మనువు ఈ పూట
ఉరి పెట్టుకొని చావాలి

ఇవాళ నువ్వు నా మీద విసర్జించింది

నీ మూత్రం మాత్రమే కాదు
తరాల నీ అహంకారం
తలకెక్కిన గొరగానితనం
నిచ్చెనమెట్లను నీలోకి
జాగ్రత్తగా నింపినోడొకి
సర్వం అప్పగించిన సన్నాసివి
జంధ్యం పోగుల బానిసవి

మందిని చూసుకొని విర్రవీగే నువ్వు
ఇంతకంటే ఇంకేం చేయగలవు
రేపటి చరిత్ర ముందు
నువ్వు తలవంచుకొని నిలబడే
తొలిపొద్దు ఒకటి
తప్పకుండా ఉదయిస్తుంది
చూపుడు వేలు సాక్షిగా…
నీకు క్షమాబిక్షలు లేని
శిక్షలు విధించడానికి
న్యాయదేవత కూడా
తన కండ్ల గంతలను విడిచేస్తుంది
నీలాంటి వాడి నిర్మూలనకు
ప్రకతే పగబట్టకపోదు!
– పసునూరి రవీందర్‌
77026 48825