విప్లవాల గానలోలుడు గద్దర్‌ !

Gaddar, the singer of revolutions!అతని జీవితం తెలిసినవాళ్ళు గద్దర్‌ ప్రజా యుద్ధనౌక అన్నారు. గాన గాంధర్వుడు అన్నా నిజమే, ప్రజల కవీ, గాయకుడు, వాగ్గేయకారుడు, వైతాళికుడు గద్దరన్న. తీరా చూస్తే ఆయన గోసి గొంగడిలో కనిపిస్తూ గొంతెత్తి రాగం తీస్తే, ఎగిరెగిరి ఆడీ పాడితే బొంగురు జీర ఉన్న గళంలోంచి మాటల తూటాలు దూసుకొచ్చి వెంట్రుకలు నిక్కబొడుకుంటాయి. చిన్న పిల్లలు సైతం తల్లి చంక దిగి ఆడటం చేస్తారు.
ఇలాంటి అపురూపమైన వ్యక్తుల్ని కాలం మళ్ళీ ఎప్పుడు పుట్టిస్తుందో, సమాజం ఎప్పుడు రూపొందిస్తుందో ! భుజం మీది ఎర్ర రుమాలు అమరులను గుర్తు చేస్తూ నిత్యం చెమటతో తడిసి ముద్దవుతుంటే, కడుపు శోకంతో విలపించే తల్లుల దు:ఖం గద్దర్‌ కంఠం నుండి ఎగతన్నుకు వస్తుంది. అందుకే ‘మీ పాటనై వస్తున్నానమ్మో మా తల్లులారా’ అని ఓదారుస్తాడు. సమాజం కోసం అడవిదారి పట్టి అర్ధాంతరంగా అసువులు బాసిన యువకులను పిలుస్తూ ‘వందనాలూ వందనాలమ్మో మా బిడ్డలూ. మీకు వందనాలు వందనాలమ్మో మా వీరులు.. మీరు తొలి పొద్దుల కిరణాలై వస్తారా, వాన చినుకులై కురిసి మమ్మల్ని పలకరిస్తారా.. ఇంటి ముందటి చేలల్ల జొన్న కంకులై మీ రాకను తెలియజేస్తారా..’ అంటూ ఏడుపు పాటలా సాగే ఈ ప్రవాహంలో హృదయమున్న మనుషులు కొట్టుపోక తప్పదన్నట్లు ఉంటుంది.
కేవలం ఒక కవి, ఆశుకవి, గాయకుడు, ఆటగాడు కాదు గద్దర్‌. పేదరికంలో పుట్టి దళిత దళాక్షుడై వికసించి బి. నర్సింగ్‌రావు (ఔశీతీశ్రీస ఖీaఎశీబర ణఱతీవష్‌శీతీ) సాంస్కృతిక టీమ్‌లో చేరి, జన నాట్య మండలిలో పాటలు రాస్తూ అతను తూప్రాన్‌ నేల కన్న మట్టి బిడ్డ గుమ్మడి విఠల్‌రావు నుండి విప్లవ సముద్రంలో మహా పుష్పమై పూచిన నెత్తుటి ఊట. కవోష్ణ రుధిరధారలతో నేల తల్లిని అభిషేకించిన ఉద్యమాల పసి బాలుడు ! విప్లవాల గాన లోలుడు !
పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలంతో సంతకం చేయించి వీర తెలంగాణా నుదట ఎర్ర తిలకం దిద్దినవాడు.. ఉద్యమం గద్దర్‌కు కన్నతల్లి అయితే విప్లవ స్వప్నం అతని నిత్యగానాలాపనం, సమ సమాజం స్థాపనే ఆయన లక్ష్యం. అందుకు ఆరాట పోరాటాలను ఎక్కుపెట్టి నిరంకుశ పాలకులపై ప్రశ్నల బాణాలు సంధించిన విలుకాడు. ప్రజల జీవన సంక్షోభాలే గద్దర్‌ను గర్జించే గళ గాయకుడిగా మార్చాయి. గద్దర్‌ను పాటకు పెద్దన్ననూ, పర్యాయపదాన్నీ చేశాయి.
ప్రజల ఉసురుబోసుకునే పాలకుల ఆగడాలనూ.. వివిధ రూపాల్లో ప్రజల్ని దోచుకునే దొరల మోసాలనూ ”జర భద్రం కొడుకో.. కొడుకో కొమురన్న జర” అంటూ హెచ్చరించే కాడికి తీసుకొచ్చాయి.. వెయ్యికాళ్ళ జర్రిలున్నాయని ప్రజల దృష్టిని మరల్చి వారిని ఆ జర్రి విషపు కాట్ల నుండి, క్రూర పరిష్వంగం నుండి కాపాడజూశాడు.
నిజానికి గద్దర్‌ది ప్రజాకవి కాళోజీ ఇష్టపడే ఉగ్ర నారసింహుని తత్వం. వేదిక మీద అతని ఆటా పాటల విన్యాసాలు చూస్తుంటే మానవ రూపంలో ఉన్న సింహం గర్జనలు చేస్తూ వేదికంతా కలెదిరుగుతున్నట్లు ఉంటుంది..
మొదటి నుండి తెలంగాణ ఆకలి, కరువు, నిర్భంధాలను చూసినవాడు. ”అమ్మా తెలంగాణమా ఆకలి కేకల గానమా” అంటూ తనను కన్న నేల తల్లి వెతలను ఆ తల్లిని ప్రేమించే బిడ్డగా, తల్లిని సస్యశ్యామలంగా పచ్చని వరిమడిలా చూడాలనే తన ఆకాంక్షను ప్రకటిస్తాడు.
అతని బతుకు బాట, బలిపీఠం మీద బలి కోసం తీసుకుపోయే బాట. కానీ తాను బహుముఖంగా విస్తరించి యుద్ధవీరుడైనాడు. 1970 నుండి ప్రజాపక్షం నిలబడుతూ అడివి బాటకు దారి చూపాడు. అది తొలుత మార్క్సిస్ట్‌ – లెనినిస్ట్‌ తాత్విక ధార అయినా, మావో లాంగ్‌మార్చ్‌ స్ఫూర్తి అయినా బ్రాహ్మణీయ వ్యవస్థ మీద తిరుగుబాటు పోరు జెండా ఎత్తిన జ్మోతీరావు ఫూలే, అంబేద్కర్‌ల తాత్విక సిద్ధాంత జ్ఞానాన్ని వొంట బట్టించుకున్నాడు. గద్దర్‌ ఆగ్రహమంతా ఈ అసమానతల యధాతథ వ్యవస్థ పైనే. గద్దర్‌ నిరంతర కార్యాచరణలో ఈ మహానుభావుల ఆశయ స్ఫూర్తిని చూస్తాము. తాను ఎవరి పక్కన నిలబడి ఎవరితో యుద్ధం చేసినా.. ఎవరితో సావాసం చేసి సామాజిక జ్ఞానాన్ని అవపోసన పట్టినా స్వయంగా తాను పుట్టిన కుల-వర్గాలను మర్చిపోలేదు. ఆ అడివి మనిషి తోడబుట్టిన చెల్లెల్ల పాదం మీద పుట్టుమచ్చై ఆ చెల్లెల్ల రుణం తీర్చుకునే ప్రేమార్తి !
తన తల్లి లచ్చుమమ్మ గుండె గీతాన్ని గీపెట్టడం ఆపలేదు. ఆడవాళ్ల పట్ల జరిగే సవాలక్ష అన్యాయాలను అకృత్యాలనూ గేయాలుగా ప్రపంచం ముఖం మీద గాయాలుగా ఆరేయడం మర్చిపోలేదు.
అందుకే ”సిరిమల్లె చెట్టు కింద లచ్చుమమ్మో లచ్చుమమ్మో / నువు చినబోయి కూసున్నవెందుకమ్మో ఎందుకమ్మో../ మోకాల్ల మట్టుకు బురదలో దిగబాడి / ఎద్దోలె ఎనుకాకు / ఒక్కొక్క అడుగేసి / నీ నడుమంత గుంజిందా లచ్చుమమ్మో లచ్చుమమ్మో”.. అంటూ తన తల్లిలో వేలాది కూలి తల్లులను చూస్తూ పరామర్శించి ఓదారుస్తాడు.
”అర్ధరాతిరి అమాస చీకటి చెల్లెమ్మా ఓ చెల్లెమ్మా / ఇల్లు దాటితివి పల్లే దాటితివి చెల్లామ్మా ఓ చెల్లెమ్మా ఎక్కడికమ్మా బయలుదేరితివి” అని దగాపడిన చెల్లెళ్లను కటిక చీకటి రోజుల్లో కూడా తోడు నడుస్తూ కనిపెట్టుకొని ఉంటాడు.
ఇక ఆడపిల్లలను పుట్టనీయని ఈ దౌర్జన్యపు లోకం.. పుడితే రకరకాల నేర పద్ధతుల్లో వాళ్ళను హతమారుస్తున్నది. అది ఏ మాత్రం సహించలేని ఈ సున్నిత హృదయుడు.. అన్యాయాలపై పులిలా లంఘించే శూరుడు. ”నిండూ అమాసనాడు ఓ లచ్చ గుమ్మడీ / ఆడపిల్ల పుట్టినాదో ఓ లచ్చ గుమ్మడి / అత్త తొంగి సూడలేదు ఓ లచ్చ గుమ్మడీ / మొగడూ ముద్దాడ రాలే ఓ లచ్చ గుమ్మడీ” అంటూ ఆడపిల్ల ఏ రోజున పుట్టినా అది లోకులకు అమావాస్య రాతిరితో సమానం. ఆ పసికూనను గుడ్డల్లో చుట్టి ముళ్ళ కంపల్లోకి నిర్ధాక్షిణ్యంగా విసిరేయడం, మురికి కాలువల్లో పడేయడం, ఎక్కడో రోడ్డు మీద వొదిలేయడం, వడ్లగింజ నోట్లో వేసి చంపడం లాంటి దుర్చర్యలకు పాల్పడుతుంటారు. ఆయన ఆడవాళ్ళ కోసం, విప్లవోద్యమాలకు తమ బిడ్డలను బలిదానం చేసిన తల్లుల కోసం, పుట్టుకకే నోచుకోని ఆడ పిండాల కోసం, శ్రామికులు, కార్మికుల కోసం, దుక్కిదున్నే రైతుల కష్టాలనూ ఏకరువు పెడ్తూ ఎన్నో కావ్యాలను గానం చేసాడు. పాట పుట్టుకను తాత్వికతో వివరించాడు. పాట వాహనమెక్కి ప్రపంచ పర్యటన చేసిన విశ్వమానవుడు ! అద్భుతమైన నరుడు కామ్రేడ్‌ గద్దర్‌ !
ఈ రోజున గద్దరన్న భౌతికంగా దురమయ్యాడు. కానీ ప్రజల హృదయ ఘోషలో నిత్య జీవితుడు. ప్రతి రోజు అరుణోదయంలోంచి వికసించే పొద్దు తిరుగుడు పూవై వస్తూ.. ప్రజల పాటలో ప్రజ్వరిల్లే క్రాంతి దీపమై వెలుగుతుంటాడు. అతని వారస్వత్వాన్ని కొనసాగించే వేలాది మంది బిడ్డలకు విప్లవాల పురిటి నెత్తుర్లలో జన్మనిస్తాడు. తానన్నట్లు పాటగానే వస్తాడు! పాటకు మరణం లేదు. పాట ప్రయాణం అనంతం ! అమరం ! జయహో గద్దరన్న !
కూలి నాలి కష్టజీవుల, ఆకలి కేకల అల్పజీవుల, బాధల బతుకు చెరల్లో కునారిల్లే ఆడవాళ్లతో మమేకమయిన మనిషి. గద్దర్‌కు జండర్‌ అంటూ లేదు. అతడు మనిషి అంతే. ప్రజల కోసం నిప్పుల గుండం తొక్కిన నిర్భయుడు, జయుడు. అస్పృశ్యతా అణిచివేతలను ఎండగట్టిన సమతాధార్మికుడు. ఒంట్లో తూటాలను భరిస్తూ రెండు దశాబ్ధాలపైన ధైర్యం చెడక జీవితోద్యమ కార్యాచరణతో ఉన్న కారణజన్ముడు ! ప్రజాస్వామిక వ్యవసాయదారుడు ! జనకావ్యం పుట్టించిన ఆదిమ మానవుడు! విధ్వంసకరమైన రాజకీయాలను దనుమాడిన దిగ్గజుడు. ప్రశ్నల కొడవలెత్తిన కమ్యూనిస్టు ! సామ్యవాద స్వాప్నికుడు !
– అనిశెట్టి రజిత