స్వరాష్ట్రంలో సుపరిపాలన

– 33 జిల్లాలు, 74 రెవెన్యూ డివిజన్లు, 612 మండలాలు
– ప్రభుత్వ పథకాలు సమర్ధవంతంగా అమలు
– దశాబ్ది ఉత్సవాల్లో నేడు సుపరిపాలన దినోతవ్సం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
ప్రభుత్వ పరిపాలనను ప్రజలకు మరింత చేరువ చేయడం కోసం తెలంగాణ ప్రభుత్వం అత్యంత సాహసోపేతంగా పరిపాలనా సంస్కరణలు అమలు చేసింది. ఏకకాలంలోనే పరిపాలనా విభాగాల పునర్విభజన చేపట్టింది. కొత్త పరిపాలనా విభాగాలను కూడా ఏర్పాటు చేసింది.
కొత్త జిల్లాల ఏర్పాటు
తెలంగాణలో 2016 అక్టోబర్‌కు ముందు 10 జిల్లాలుండేవి. ఒక్కో జిల్లాలో సగటున 35 లక్షలకుపైగా జనాభా ఉంది. దీనివల్ల పరిపాలన కష్టతరమయ్యేది. కొన్నిచోట్ల జిల్లా కేంద్రాలకు, కార్యాలయాలకు పోవాలంటే 200 నుంచి 250 కి.మీల దూరం వెళ్లాల్సివుండేది. దీంతో జిల్లా కేంద్రాల అధికారులు గ్రామాలకు పోవాలన్నా, ప్రజలు జిల్లా కేంద్రాలకు వెళ్లాలన్నా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొనేవారు. జిల్లాలో కుటుంబాల సంఖ్య 10 లక్షలుండేది. దీంతో ఎవరి పరిస్థితేంటో తెలుసుకోవడం అధికారులకు కష్టంగా మారేది. ప్రభుత్వ అభివద్ధి, సంక్షేమ కార్యక్రమాల నిర్వహణ కష్టం అయ్యేది. దీంతో అధికారులకు ప్రజల సమస్యలపై దష్టి కేంద్రీకరించడం కష్టంగా మారింది. ఈ సమస్యలను అధిగమించటానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ చట్టం-1974 ప్రకారం తెలంగాణలో మరో 23 కొత్త జిల్లాలను ఏర్పాటు చేసి, జిల్లాల సంఖ్యను 33 వరకు పెంచింది. దీంతో చిన్న పరిపాలనా విభాగాలతో సమర్దవంతమైన పాలన జరుగుతున్నది. కొత్త జిల్లాలను 2016 అక్టోబర్‌ 11న ప్రారంభించారు. రెవెన్యూ డివిజన్ల సంఖ్యను 43 నుంచి 74 వరకు, మండలాల సంఖ్యను 459 నుంచి 612 వరకు, గ్రామ పంచాయతీల సంఖ్యను 12,769 వరకు పెంచింది.
పరిపాలనా సౌలభ్యం, ప్రయోజనాలు
ప్రభుత్వ శాఖల నూతన విభాగాలను ఆ జిల్లాల్లో ప్రభుత్వం ఏర్సాటు చేసింది. దీంతో ప్రజలు గంట సేపట్లోనే తమ జిల్లాలోని ఏ ప్రదేశానికైనా వెళ్లే అవకాశం కలిగింది. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలు తీరు, పర్యవేక్షణ అధికారులకు సులువవుతున్నది. స్థానిక పరిస్థితులు, వనరులు, ప్రత్యేకతలు, ప్రజల అవసరాలు, సామాజిక స్థితిగతులపై అధికారులకు పూర్తి అవగాహన కలుగుతున్నది.
రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో ఏజన్సీ, అటవీ ప్రాంతాలు వున్నాయి. అటవీ రక్షణ, గిరిజనుల కోసం ప్రత్యేక కార్యక్రమాలు చేయడం అధికారులకు సులువవుతుంది. కొన్ని జిల్లాల్లో ఎస్సీ జనాభా ఎక్కువగా వుంది. అక్కడ ఎస్సీల కోసం ప్రత్యేక కార్యక్రమాలను చేపడుతూ ఈ రకంగా స్వరాష్ట్రంలో సుపరిపాలన సాకారమైందని సమాచార, పౌరసంబంధాల శాఖ కమిషనర్‌ ఒక ప్రకటనలో తెలిపారు.