14 నుంచి సర్టిఫికేషన్‌ వెరిఫికేషన్‌

– రాష్ట్రవ్యాప్తంగా 18 సెంటర్లలో పరిశీలన :
టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ చైర్మెన్‌ శ్రీనివాసరావు
నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి
రాష్ట్రంలో ఇటీవల నిర్వహించిన ఎస్సై, కానిస్టేబుల్‌, తత్సమాన పోస్టు తుది రాత పరీక్షల్లో అర్హత సాధించిన అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన ఈ నెల 14 నుంచి ప్రారంభమవుతుందని రాష్ట్ర పోలీసు రిక్రూట్‌మెంట్‌ బోర్డు చైర్మెన్‌ వి.వి శ్రీనివాసరావు ప్రకటించారు. 14వ తేదీ నుంచి 26వ తేదీ వరకు రాష్ట్రంలోని 18 కేంద్రాల్లో ఈ పరిశీలన జరుగుతుందని ఆయన తెలిపారు. అభ్యర్థులకు ఏయే తేదీలలో ఈ పరిశీలన జరుగుతుందనేది సంబంధిత అభ్యర్థుల వారి అకౌంట్లలో తమ అధికారిక వెబ్‌సైట్‌ ద్వారా 18వ తేదీ నుంచి 23వ తేదీ వరకు తెలపటం జరుగుతుందని ఆయన వివరించారు.
హైదరాబాద్‌కు చెందిన అభ్యర్థులు శివలాల్‌ పోలీసు స్టేడియంలో, సైబరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలోని అభ్యర్థులు అక్కడి సీటీసీ గ్రౌండ్‌లో, రాచకొండ పోలీసు కమిషనరేట్‌ పరిధిలోని అభ్యర్థులు అంబర్‌పేట్‌ సీపీఎల్‌ పోలీస్‌ గ్రౌండ్స్‌లో, వరంగల్‌ పోలీసు కమిషనరేట్‌ పరిధిలోని అభ్యర్థులు అక్కడి పోలీసు గ్రౌండ్స్‌తో పాటు ఆదిలాబాద్‌, ఖమ్మం, నల్లగొండ తదితర జిల్లాలకు చెందిన అభ్యర్థులు వాటి జిల్లా ఎస్పీ ఆఫీసు సమీపంలోని పోలీసు గ్రౌండ్‌లలో వెరిఫికేషన్లు జరిపించుకోవాల్సి ఉంటుందని ఆయన తెలిపారు. అభ్యర్థులకు తమకు కేటాయించిన తేదీల పత్రాలను డౌన్‌లోడ్‌ చేసుకొని ఆ పత్రాలతో పాటు వారి చదువుకు సంబంధించిన అర్హత పత్రాల ఒరిజినల్స్‌ను తీసుకొని హాజరు కావాల్సి ఉంటుందని ఆయన పేర్కొన్నారు. అలాగే, అధికారికంగా జారీ చేసిన కులధ్రువీకరణ పత్రాలతో పాటు ఇతర సంబంధిత పత్రాలను కూడా కచ్చితంగా వెంట తీసుకురావాలని ఆయన అభ్యర్థులకు సూచించారు. ఉదయం 9 గంటలకే వెరిఫికేషన్‌ కేంద్రాలకు అభ్యర్థులు చేరుకోవాలని ఆయన స్పష్టం చేశారు. సర్టిఫికేట్ల వెరిఫికేషన్‌ తర్వాత సంబంధిత అధికారులు అభ్యర్థుల నుంచి సంతకాలు తీసుకొని దాని ధృవీకరణ పత్రాన్ని సంబంధిత అభ్యర్థికి అందజేస్తారని చెప్పారు. ఎస్సై, కానిస్టేబుల్‌, తత్సమాన పోస్టులకు సంబంధించి మొత్తం 1,09,606 మంది అభ్యర్థులకు సంబంధించిన ధ్రువీకరణ పత్రాల పరిశీలన జరుపుతున్నట్టు ఆయన తెలిపారు.

Spread the love