పేదల సోయిలేని ప్రభుత్వాలు

– ప్రత్యేక రాష్ట్రంలోనూ సమస్యలతో సామాన్యుల సహవాసం
– రూ.467 కోట్ల ప్రభుత్వ సొమ్ముతో ఢిల్లీలో మోడీకి ఇల్లు కడుతుండ్రు
– ఏ ప్రధానికీ లేని హంగు ఆర్భాటాలు మోడీకి ఎందుకు?: పాలకుల తీరుపై ధ్వజమెత్తిన ప్రజాసంఘాల పోరాట వేదిక బృందం
నవతెలంగాణ-మెదక్‌
ప్రభుత్వాలు మారినా, పాలకులు మారినా పేదల బతుకులు మాత్రం మారడం లేదని, పేదల బతుకులను మార్చి వారిని ఆదుకుందామన్న సోయి కూడా ఈ ప్రభుత్వాలకు లేదని తెలంగాణ ప్రజా సంఘాల ఐక్య పోరాట వేదిక కన్వీనర్‌ ఎస్‌.వీరయ్య అన్నారు. మెదక్‌ జిల్లా కేంద్రంలోని 248/1 సర్వే నంబర్‌లో పేదలు వేసుకున్న గుడిసెల కేంద్రాన్ని ప్రజా సంఘాల పోరాట వేదిక బస్సు యాత్ర బృందం సభ్యులు ఆదివారం సందర్శించారు. గుడిసెల్లో నివసిస్తున్న పేదల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎస్‌.వీరయ్య మాట్లాడుతూ.. తెలంగాణ వస్తే అన్ని వస్తాయనుకున్నామని, రాష్ట్రం సిద్ధించి పదో ఏట అడుగుపెట్టడంతో ప్రభుత్వం దశాబ్ది ఉత్సవాలు జరిపి సంబురాలు చేసుకుంటోందని, పేదలకు మాత్రం ఎలాంటి లబ్ది చేకూర్చడం లేదని విమర్శించారు. పేద ఆడ బిడ్డలకు గూడు కల్పించాలన్న సోయి కూడా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు లేకుండా పోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తిండి లేకుంటే బతకొచ్చు.. చాటు లేకుండా ఎట్లా బతికేదని ప్రశ్నించారు. ప్రధాన మంత్రి ఆవాస్‌ యోజన పెట్టినా, ఇప్పటికీ ఎవరికి గూడు ఇచ్చిన పరిస్థితులు లేవన్నారు. ఢిల్లీలో ప్రధాని మోడీకి ప్రభుత్వ సొమ్ము రూ.467 కోట్లతో ఇల్లు కడుతున్నారని, ఇంత హంగు ఆర్భాటాలు ఎందుకని ప్రశ్నించారు. పూర్వం జమీందారుల ఇండ్లు సైతం ఇలా లేవని
పేదల సోయిలేని ప్రభుత్వాలు తెలిపారు. ప్రపంచంలో ఏ ప్రధాని ఇలా ఉండరని, రూ.10 లక్షల విలువ చేసే బట్టలను మోడీ వేసుకుంటారని, అంత విలువైన బట్టలు ధరించే వారిని ఎక్కడైనా చూశామా అని ప్రశ్నించారు. నిరుపేదలకు కేవలం 125 గజాల స్థలం ఇచ్చేందుకు ప్రభుత్వాలకు మనసు రావడం లేదని వాపోయారు. రాష్ట్ర ప్రభుత్వం దశాబ్ది ఉత్సవాల సందర్భంగా గృహలక్ష్మి పథకం ప్రారంభించిందని, ఈ పథకం ఎవరికీ వర్తించదని తెలిపారు. సొంత స్థలం, మహిళ పేరిట రిజిస్ట్రేషన్‌ అయి, నక్ష వేయిస్తే అన్ని షరతులను చూసి రూ.3 లక్షలు ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వం చెప్పడం సరికాదన్నారు. డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇల్ల్లు కట్టుకోవాలంటే కాంట్రాక్టర్లకు ఇస్తేనే రూ.8.5 లక్షలు అయిందని ప్రభుత్వమే స్పష్టం చేసిందని, మూడు లక్షలతో ఇంటి నిర్మాణం సాధ్యమవుతుందా అని ప్రశ్నించారు. పేదలకు పట్టా ఇచ్చి, రాష్ట్రం రూ.5 లక్షలు, కేంద్రం రూ.10 లక్షలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలో లక్ష మందికిపైగా పేదలు గుడిసెలు వేసుకున్నారని తెలిపారు. సభానంతరం ఆయన జెండా ఆవిష్కరించారు. సమవేశంలో సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు, రైతుసంఘం రాష్ట్ర కార్యదర్శి టీ.సాగర్‌, ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట ప్రధాన కార్యదర్శి వెంకట్రాములు, కేవీపీఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి స్కైలాబ్‌ బాబు, డీవైఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు కోట రమేష్‌, అనగంటి వెంకటేష్‌, సీఐటీయూ జిల్లా కార్యదర్శి బస్వరాజు, కోశాధికారి నరసమ్మ, ఉపాధ్యక్షులు ఏ.మల్లేశం, రైతుసంఘం జిల్లా అధ్యక్షులు సర్దార్‌, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి కె.మల్లేశం, తదితరులు పాల్గొన్నారు.

Spread the love