గ్రూప్‌-2 వాయిదా కోరుతూ నిరసన

– మూడు నెలలు వాయిదా వేయాలని డిమాండ్‌
– ప్రభుత్వ దిష్టిబొమ్మలు దహనం
నవతెలంగాణ- విలేకరులు
గ్రూప్‌-2 పరీక్షలు మూడు నెలలు వాయిదా వేయాలని డిమాండ్‌ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా శనివారం నిరసన కార్యక్రమాలు జరిగాయి. ఎస్‌ఎఫ్‌ఐ, డీవైఎఫ్‌ఐ, ఇతర వామపక్ష ప్రజాసంఘాల ఆధ్వర్యంలో ర్యాలీలు తీశారు. ప్రభుత్వ దిష్టిబొమ్మలు దహనం చేశారు.
కరీంనగర్‌ జిల్లా కేంద్రంలోని శాతవాహన యూనివర్సిటీ వద్ద, పెద్దపల్లి జిల్లా కేంద్రంలో బస్టాండ్‌ వద్ద ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు నిరసన తెలిపారు. డీవైఎఫ్‌ఐ, పీవైఎల్‌, ఏఐవైఎఫ్‌ ఆధ్వర్యంలో ఖమ్మం పట్టణంలోని ఆర్‌అండ్‌బి గెస్ట్‌ హౌస్‌ వద్ద రాష్ట్ర ప్రభుత్వం దిష్టిబొమ్మ దహనం చేసి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా డీవైఎఫ్‌ఐ, పీవైఎల్‌ జిల్లా ప్రధాన కార్యదర్శులు బషీరుద్దీన్‌, ఎన్‌వి రాకేష్‌, ఏఐవైఎఫ్‌ రాష్ట్ర నాయకులు శ్రావణ్‌ కుమార్‌ మాట్లాడుతూ.. అభ్యర్థులు రెండు వారాలుగా అభ్యర్థించినా అధికారులు పట్టించుకోకపోవడం సరికాదన్నారు. పరీక్షలు వాయిదా వేయకపోతే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.
హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఎస్‌ఎఫ్‌ఐ హైదరాబాద్‌ జిల్లా కార్యదర్శి కే అశోక్‌ రెడ్డి మాట్లాడుతూ.. ఈనెల 23వ తేదీ వరకు గురుకుల బోర్డు పరీక్షలు, జూనియర్‌ లెక్చరర్ల పరీక్షలు ఉన్నందున 29, 30 తేదీల్లో టీఎస్‌పీఎస్సీ నిర్వహించే గ్రూప్‌ 2 పరీక్షలను మూడు నెలలు వాయిదా వేయాలని డిమాండ్‌ చేశారు. గ్రూప్‌ 2 అభ్యర్థులపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తేయాలన్నారు.
అలాగే ఉస్మానియా యూనివర్సిటీకి చెందిన పలువురు విద్యార్థి సంఘాల నేతలను, అభ్యర్థులను పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ విద్యార్థి జన సమితి రాష్ట్ర అధ్యక్షుడు మాసంపల్లి అరుణ్‌ కుమార్‌ మాట్లాడుతూ.. అభ్యర్థులను గందరగోళానికి గురిచేసేలా ప్రభుత్వం పరీక్షలను నిర్వహించేందుకు సిద్ధమవటం సరికాదన్నారు. ఇప్పటికే పేపర్‌ లీకేజీలతో అయో మయంలో ఉన్న వారిని.. ఒత్తిడికి గురిచేసేలా వరుసగా పరీక్షలు నిర్వ హిస్తే వారి జీవితాలు నాశనమవుతాయన్నారు. ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకోవాలని కోరారు. ఆసిఫాబాద్‌ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌ ఎదుట వామపక్షాల ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు.
గ్రూప్‌-2 పరీక్షలను వాయిదా వేయాలి ; సీఎం కేసీఆర్‌కు తమ్మినేని లేఖ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
ప్రభుత్వ ఉద్యోగాల కోసం వరుస నోటిఫికేషన్లు ఉన్నందున అభ్యర్థులు గ్రూప్‌-2 పరీక్షకు దూరమయ్యే ప్రమాదముందని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తెలిపారు. కావున గ్రూప్‌-2 పరీక్షలను మూడు నెలలపాటు వాయిదా వేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావుకు శనివారం ఆయన లేఖ రాశారు. రాష్ట్ర ప్రభుత్వం అనేక ఉద్యోగాల భర్తీ కోసం వరుసగా నోటిఫికేషన్లను ఇచ్చిందని గుర్తు చేశారు. దీంతో వేర్వేరు పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థులు చాలా ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. గ్రూప్‌-1 ప్రశ్నాపత్రం లీక్‌ కావడం వల్ల మళ్లీ పరీక్ష నిర్వహించారని తెలిపారు. దాంతోపాటుగా ఇతర పోటీ పరీక్షలకూ సన్నద్ధమవుతున్నందున సమయం దొరక్క అభ్యర్థులు తీవ్ర ఆందోళనలో ఉన్నారని పేర్కొన్నారు. నిర్ణయించిన విధంగానే గ్రూప్‌-2, గురుకుల, జేఎల్‌, డీఎల్‌, పాలిటెక్నిక్‌ లెక్చరర్‌, హాస్టల్‌ వార్డెన్ల పరీక్షలు ఈనెల ఒకటి నుంచి 30 వరకు జరుగుతున్నాయని వివరించారు. వాటిలో ఒక్కో పరీక్షకు సిలబస్‌ వేర్వేరుగా ఉండడంతో ఏదో ఒక పరీక్షకు మాత్రమే అభ్యర్థులు సన్నద్ధం కావాల్సిన పరిస్థితి ఉందని తెలిపారు. గ్రూప్‌-2 పరీక్షలోని మూడో పేపర్‌ (ఎకానమీ)లో గతంలోని సిలబస్‌కు అదనంగా 70 శాతం కలిపారని పేర్కొన్నారు. ఇది సన్నద్ధం కావడానికి కూడా కొంత సమయం కావాలని తెలిపారు. ప్రశ్నాపత్రం లీకేజీ ఘటనతో మూడు నెలలు మానసిక ఆవేదనతో సరిగా చదవలేక పోయారని వివరించారు. వయస్సు రీత్యా కొంత మంది అభ్యర్థులకు ఇదే చివరి నోటిఫికేషన్‌ అని పేర్కొన్నారు. దీనికి తోడు వచ్చే నెలలో టెట్‌ పరీక్ష కూడా ఉందని తెలిపారు. ఇన్ని పరీక్షలు ఒకేసారి నిర్వహించడం వల్ల వారికి అర్హతలున్నప్పటికీ ఉద్యోగ అవకాశాన్ని కోల్పోతున్నామంటూ అభ్యర్థులు ఆందోళనలో ఉన్నారని పేర్కొన్నారు. వారి పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని గ్రూప్‌-2 పరీక్షను మూడు నెలలపాటు వాయిదా వేసి, వెసులుబాటు కల్పించాలని ప్రభుత్వాన్ని ఆయన కోరారు.