మే 31న హరిదా రచయితల సంఘం మహాసభ

– సరస్వతి రాజ్ హరిదా పురస్కారాలు-2023
– గజల్ రచయిత వి నరసింహారెడ్డికి సరస్వతీ రాజ్
– తెలంగాణ విశిష్ట సాహిత్య పురస్కారం ప్రదానం
– సామరస్య జీవనంలో సాహితీవేత్తల కర్తవ్యం
నవతెలంగాణ – కంటేశ్వర్
మే 31న హరిదా రచయితల సంఘం మహాసభ సరస్వతి రాజ్ హరిదా పురస్కారాలు 2023 ఉంటాయని గజల్ రచయిత వి నరసింహారెడ్డి కి సరస్వతి రాజ్ తెలంగాణ విశిష్ట సాహిత్య పురస్కారం ప్రదానం జరుగుతుందని సామరస్య జీవనంలో సాహితీ వేత్తల కర్తవ్యం అని హరిదా చేతల సంఘం జిల్లా అధ్యక్షులు ఘనపురం దేవేందర్ తెలిపారు.ప్రధానాంశంగా మే 31వ తేదీన జిల్లా కేంద్రంలోని హోటల్ లహరి ఇంటర్నేషనల్లో రవ్వా శ్రీహరి-గుమ్మన్న బాల శ్రీనివాసమూర్తి స్మారక వేదికన నిర్వహించనున్న హరిదా రచయితల సంఘం మహాసభ సందర్భంగా సాహిత్య పురస్కారాలు ప్రదానం చేయనున్నట్లు సంఘ అధ్యక్షుడు ఘనపురం దేవేందర్ తెలిపారు. ఈ మేరకు శుక్రవారం నగరంలోని కేరళ డిగ్రీ కళాశాలలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..గతంలో డాక్టర్ సామల సదాశివ, ఆచార్య ఎన్ గోపి, డాక్టర్ నందిని సిధారెడ్డి, డాక్టర్ నాళేశ్వరం శంకరంలు అందుకున్న రాష్ట్ర స్థాయిలో ప్రదానం చేసే “ సరస్వతి రాజ్ హరిదా తెలంగాణ విశిష్ట సాహిత్య పురస్కారం” ప్రముఖ గజల్, గీత, ఆధ్యాత్మిక కీర్తనల రచయిత వి. నరసింహ రెడ్డి కి ప్రదానం చేస్తున్నట్లు ఆయనకు “ఇందూరు అన్నమయ్య ” బిరుదును అందజేస్తున్నట్లు వారు వివరించారు. ఘనపురం దేవేందర్ అధ్యక్షతన జరిగే ఈ కార్యక్రమంలో శాసన మండలి సభ్యులు, భారత్ జాగృతి అధినేత్రి కల్వకుంట్ల కవిత ముఖ్య అతిథిగా, గౌరవ అతిథులుగా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఛైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, నిజామాబాద్ అర్బన్ శాసన సభ్యులు బిగల గణేష్ గుప్తా, ఆత్మీయ అతిథిగా తెలంగాణ సాహిత్య అకాడమీ ఛైర్మన్ జూలూరి గౌరీశంకర్ లు పాల్గొంటారని ఆయన తెలిపారు.పంచరెడ్డి లక్ష్మణ్ [తెలంగాణ భాషలో కవిత్వం], పొద్దుటూరి మాధవీలత [వచన కవిత్వం], డాక్టర్ వి. త్రివేణి [సాహిత్య విమర్శ ], మేక రామస్వామి [సాహిత్య సేవ], నరాల సుధాకర్ [వచన కవిత్వం], దారం గంగాధర్[కథా సాహిత్యం], తొగర్ల సురేశ్ [పోలీస్ కవి]లకు సరస్వతి రాజ్ హరిదా సాహిత్య పురస్కారాలు ప్రదానం చేస్తున్నామన్నారు.“సామరస్య జీవనంలో సాహితీవేత్తల కర్తవ్యం” అనే అంశంపై ‘కవిసమ్మేళనం’ నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. ఈ కవిసమ్మేళనంలో జిల్లా సాహిత్యవేత్తలతో పాటు రాష్ట్రంలోని వివిధ జిల్లాలనుంచి వచ్చే సాహిత్యవేత్తలు కవితా పఠనం చేస్తారని వారు వివరించారు. ఈ సమావేశంలో సంఘం ప్రధాన కార్యదర్శి డాక్టర్ కాసర్ల నరేశ్ , గంట్యాల ప్రసాద్ తిరుమల శ్రీనివాస్ ఆర్య , మద్దుకూరి సాయిబాబు, నరాల సుధాకర్, గుత్ప ప్రసాద్, గంగాధర్ , నాగరాజు తదితరులు పాల్గొన్నారు.