గాయాన్ని న‌యం చేస్తుంది…

ఆమె ఒకప్పుడు యాసిడ్‌ దాడికి గురయ్యింది. చూపు కోల్పోయింది. బాధతో కుంగిపోయి ఎంతో కాలం తన ముఖాన్ని దాచేసుకుంది. ఆ గాయం వల్ల తన శరీరం, మనసు ఎంతగా విలవిలలాడిందో గ్రహించింది. ఆర్థిక భారం అడుగు బయట పెట్టేలా చేసింది. తనలాంటి బాధితులకు అవసరమైన సహాయ సహకారాలు అందించాలనే లక్ష్యం పెట్టుకుంది. అప్నా ఘర్‌ (మన ఇల్లు) ప్రారంభించి యాసిడ్‌ దాడులకు గురైన వారికి సురక్షితమైన జీవితాన్ని అందిస్తుంది. ఆమే షాహీన్‌ మాలిక్‌. బాధితుల శరీరక గాయాలనే కాదు, మనసుకైన గాయాలను సైతం నయం చేస్తున్న ఆమె పరిచయం నేటి మానవిలో…
2016లో సుష్మ వివాహం చేసుకుంది. అయితే భర్త మద్యానికి బానిసై హింసించేవాడు. విపరీతమైన సవాళ్లు ఎదుర్కొంటూనే తన వివాహ జీవితాన్ని కొనసాగించింది. మగబిడ్డ పుట్టిన తర్వాత ఈ జంట తమ స్వస్థలం నుండి ఢిల్లీకి మకాం మార్చాలని నిర్ణయించుకున్నారు. కొత్త ప్రాంతంలోనైనా భర్త మారతాడని ఆశించింది. కానీ ఆమె ఆశ నెరవేరలేదు. ఒకరోజు ఇద్దరి మధ్య గొడవ జరిగి భర్త యాసిడ్‌ బాటిల్‌ తీసుకుని ఆమెతో బలవంతంగా తాగించాడు. ప్రతి గుటకకి యాసిడ్‌ వల్ల కలిగే నొప్పి సుష్మ శరీరంలో వ్యాపించింది. ఆ బాధ భరించలేకపోయింది. యాసిడ్‌ ఆమె ఆహార వాహికను పూర్తిగా దెబ్బతీసింది. ఏమీ తాగలేని, తినలేని పరిస్థితి వచ్చింది. ”ఈ దాడి తర్వాత జీవించాలనే కోరికే నాలో చచ్చిపోయింది” అని చెప్పింది. అయితే ఆమె బాధ అంతటితో ఆగలేదు. ప్రమాదం తర్వాత ఆమె తన స్వగ్రామానికి వెళ్లింది. అక్కడ భర్త మళ్లీ ఆమెపై దాడి చేసేందుకు ప్రయత్నించాడు. అనేక ఆసుపత్రులకు తిరిగి, లెక్కకు మించి వైద్య చికిత్సలు, విపరీతమైన డబ్బు ఖర్చు పెట్టి చివరకు ఢిల్లీలోని ”అప్నా ఘర్‌” గురించి తెలుసుకుంది.
సురక్షితమైన స్థలం
అప్నా ఘర్‌ అనేది బ్రేవ్‌ సోల్‌ ఫౌండేషన్‌ ద్వారా నిర్వహించబడుతున్న షెల్టర్‌ హోమ్‌. ఇది యాసిడ్‌ దాడులకు గురై, కుటుంబం నుండి వదిలివేయబడిన మహిళలకు సురక్షితమైన స్థలం. 2013లో యాసిడ్‌ దాడికి గురై ఆ గాయం నుండి బయటపడిన షాహీన్‌ మాలిక్‌ 2021లో దీన్ని ప్రారంభించారు. ఈ హోమ్‌ బాధితులకు వైద్యం, చికిత్సతో పాటు భవిష్యత్‌లో వారు స్థిరపడేందుకు నైపుణ్యాలు, అవసరమైన న్యాయ సహాయాన్ని అందిస్తోంది. ”రెండేండ్లు చికిత్స చేయించుని చాలా డబ్బు ఖర్చు పెట్టాను. అప్పుడు నాకు బ్రేవ్‌ సోల్‌ ఫౌండేషన్‌, అప్నా ఘర్‌ గురించి తెలిసింది. ఈ హోమ్‌కు మారిన తర్వాత నా చికిత్స, మందులు అన్నీ ఎన్‌జీఓనే చూసుకుంది. ప్రభుత్వం నుంచి 3 లక్షల పరిహారం కూడా పొందాను. ఈ హోమ్‌ నాకు నివసించడానికి ఒక స్థలాన్ని ఇచ్చింది’ అని సుష్మా చెప్పింది. ఆమె తన భర్తపై కేసు పెట్టి ఇప్పటికీ పోరాడుతూనే ఉంది. ఆమె అవసరాలన్నీ హోమ్‌ చూసుకుంటుంది. ప్రస్తుతం ఆమె ఇంగ్లీష్‌తో పాటు కంప్యూటర్‌లో ప్రాధమిక శిక్షణ తీసుకుంటోంది.
సూదులు గుచ్చినట్టు…
షాహీన్‌ పంజాబ్‌ టెక్నికల్‌ కాలేజీ నుంచి ఎంబీఏ చదువుతూ స్టూడెంట్‌ కౌన్సెలర్‌గా పనిచేసేది. 2009లో కాలేజీ నుండి బయటకి వస్తుండగా ఆమె యజమాని పంపిన వ్యక్తి ఆమెపై దాడి చేశాడు. ‘మొదట్లో ఎవరో నాపై సరదాగా ఏదో చల్లి ఆడుతున్నారని అనుకున్నాను. కానీ కొన్ని సెకన్ల తర్వాత నా చర్మం కాలిపోతున్నట్లు అనిపించింది. బాధ భరించలేక కేకలు వేయడంతో చుట్టుపక్కల ప్రజలు గుమిగూడి నా ముఖంపై నీళ్లు పోశారు. ప్రతి నీటి చుక్క నా చర్మంలోకి సూదులు గుచ్చినట్టు అనిపించింది” అంటూ ఆమె వివరిస్తుంది. ఇప్పటి వరకు ఆమెకు మొత్తం 25 శస్త్ర చికిత్సలు జరిగాయి. దాడి తర్వాత ఒక కన్ను పూర్తిగా చూపు కోల్పోయింది, మరొకటి కాస్త కనబడుతుంది. ”దాడి తర్వాత నన్ను నేను దాచుకున్నాను. తీవ్ర నిరాశకు లోనయ్యాను. నేను కోల్పోయిన నా ముఖం, నా గుర్తింపు చాలా బాధాకరమైనది. ప్రతిరోజూ అద్దంలో చూసుకుంటూ, ఆ మచ్చలను మోస్తూ కోల్పోయిన జీవితాన్ని ఊహించుకుంటూ బాధపడేదాన్ని’ అని ఆమె పంచుకుంది.
మానసిక క్షోభ…
‘యాసిడ్‌ దాడుల బాధితులు తమ శారీరక సవాళ్ల గురించి మరచిపోయి ఇతరుల మాదిరిగానే పని చేయాలని ఆశిస్తారు. మిగిలివున్న ప్రాణాలు వారి జీవితాలను కొనసాగించలేవు. ఇటువంటి సంఘటనల తర్వాత ప్రాణాలతో బయటపడినవారు సాధారణంగా తమ గుర్తింపు కోల్పోతుంటారు. జీవితకాల వైకల్యాలు, కనిపించే మచ్చలు వారి బాధను నిరంతరం గుర్తుచేస్తూనే ఉంటాయి. ఎగతాళి చేసేవారు, తమ ముఖాన్ని చూసి భయపడే పిల్లలు, విచిత్రంగా చూసే చూపులతో మానసిక క్షోభకు గురవుతుంటారు.ఈ సామాజిక వివక్ష కొన్నిసార్లు అంటరానితనం స్థాయికి చేరుకుంటుంది. దాంతో కొందరు ఆత్మహత్యకు పాల్పడుతుంటారు’ అంటారు షాహిన్‌.
జీవితాన్ని పునర్నిర్మించుకునేలా…
యాసిడ్‌ దాడుల బాధితుల కోసం భారతదేశంలో వనరులు, పునరావాస కేంద్రాలు లేవని గుర్తించిన షాహిన్‌ బ్రేవ్‌ సోల్‌ ఫౌండేషన్‌, అప్నా ఘర్‌ ప్రారంభించారు. షెల్టర్‌ హోమ్‌ గత రెండేండ్లలో ఎన్‌సిఆర్‌లోని నాలుగు ఆసుపత్రులతో కలిసి 50కి పైగా పునర్నిర్మాణ శస్త్రచికిత్సలు చేయించింది. షాహిన్‌ ఇప్పటివరకు దాదాపు 200 మంది యాసిడ్‌ దాడి బాధితులకు సహాయం చేశారు. బీహార్‌, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్‌ ప్రజలు అప్నా ఘర్‌లో భాగంగా ఉన్నారు. షెల్టర్‌ హోమ్‌ మహిళలకు ప్రాథమిక ఇంగ్లీష్‌, కంప్యూటర్‌ తరగతులను అందిస్తుంది. అదే సమయంలో వారు ప్రభుత్వం నుండి పరిహారం పొందడంలో సహాయం అందిస్తారు. అలాగే చట్టపరమైన కేసులను దాఖలు చేయడం, ఇతర రాష్ట్రాల నుండి ఢిల్లీకి వారి పిటిషన్లను బదిలీ చేయడం ద్వారా వారికి మార్గనిర్దేశం చేస్తారు. దాడికి గురైన చాలా మంది బాలికలు యుక్తవయసులో ఉన్నందున ఎన్‌జీఓ వారికి ఓపెన్‌ పాఠశాలలు, కళాశాలల ద్వారా చదువు పూర్తి చేసే అవకాశాన్ని కూడా అందిస్తుంది. హోమ్‌లో ఉండని బాధిత మహిళలకు నెలవారీ సరుకులు, మందులు సరఫరా చేస్తున్నారు. అలాగే వారి అవసరాలకు అనుగుణంగా రూ.4,000 నుంచి రూ.5,000 వరకు ఆర్థిక సహాయం అందజేస్తున్నారు.
దేశ వ్యాప్తంగా స్థాపించేందుకు
ఎన్‌జీఓ విరాళాల ద్వారా కూడా నిధులు పొందుతుంది. యాసిడ్‌ దాడి తర్వాత ఎక్కువ మంది సామాజిక ఒంటరితనం, నిరాశతో బాధపడుతున్నారని షాహిన్‌ అంటున్నారు. ఆ సమయంలో సరైన, పూర్తి పునరావాసం, మద్దతు వారికి చాలా ముఖ్యం. ‘యాసిడ్‌ దాడులు చాలా మందికి ఏదో ఒక రకమైన వైకల్యాన్ని సృష్టిస్తాయి. ఈ కొత్త వాస్తవాన్ని అంగీకరించడం చాలా కష్టం’ అని ఆమె జతచేస్తున్నారు. అందుకే ఎన్‌జీఓ వారికి పునరావాసంతో పాటు ప్రతి ఒక్కరికి మానసిక చికిత్సను కూడా అందిస్తుంది. ఇప్పటివరకు ఎన్‌జీఓకు ఢిల్లీలో ఒక కేంద్రం, కోల్‌కతాలో ఒకటి ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ అప్నా ఘర్‌ దేశవ్యాప్తంగా ప్రతి రాష్ట్రంలో స్థాపించాలనే లక్ష్యంతో షాహిన్‌ కృషి చేస్తున్నారు. యాసిడ్‌ రిటైల్‌ విక్రయాలపై నిషేధం విధించాలని ఆమె వాదిస్తున్నారు. బాధితుల పట్ల ప్రపంచం మరింత సున్నితంగా మారాలని, వారి జీవితాలను పునర్నిర్మించుకోవడానికి అవసరమైన ఉపాధి అవకాశాలు కల్పించాలని కోరుకుంటున్నారు. ‘గతంలో జరిగిన దాన్ని మేము మార్చలేము. అయితే ప్రాణాలతో బయటపడినవారికి మెరుగైన, మరింత ఆశాజనక భవిష్యత్తును సృష్టించడంలో మేము కచ్చితంగా సహాయం చేస్తాము’ అంటూ షాహిన్‌ తన మాటలు ముగించారు.
కుటుంబానికి వీరు ఆర్థిక భారం
2013లో ఆర్థిక ఇబ్బందులతో షాహీన్‌ బయటకు వచ్చి పని చేయాలని నిర్ణయించుకున్నారు. యాసిడ్‌ దాడి బాధితుల కోసం పనిచేస్తున్న ఒక సంస్థలో చేరారు. యాసిడ్‌ దాడి నుండి బయటపడిన వ్యక్తికి శారీరక, మానసిక నష్టం మాత్రమే కాకుండా ఆర్థిక భారం పెద్ద సవాలు. వారికి జీవితాంతం చికిత్స, సంరక్షణ చాలా అవసరం. జీవితకాలం మందులు వాడాల్సి వస్తుంది. దాదాపు 10 నుండి 15 శస్త్రచికిత్సలు అవసరం ఉంటాయి. ఒక్కోసారి అంతకంటే ఎక్కువ చేయించుకోవల్సి వస్తుంది. ఒక్కో శస్త్రచికిత్సకు దాదాపు లక్ష ఖర్చవుతుంది. ఈ చికిత్సలతో వారి రోగనిరోధక వ్యవస్థ, సాధారణ ఆరోగ్యం కూడా ప్రభావితమవుతాయి. దాడితో ఏర్పడిన వైకల్యం కారణంగా ఉపాధి కోల్పోవడంతో పాటు ఖర్చులు భారీగా పెరుగుతాయి. ”బాధితులు కుటుంబాలకు ఆర్థిక భారంగా మారతారు. అనేక సందర్భాల్లో వారు వారి సొంత కుటుంబాలచే వదిలివేయబడతారు” అని ఆమె చెప్పారు.