నాకే సీటివ్వలేదు.. బీసీని సీఎం ఏడ చేస్తరు?

నాకే సీటివ్వలేదు..
బీసీని సీఎం ఏడ చేస్తరు?– కార్యకర్తలను వాడుకునే అగ్రవర్ణాల పార్టీ బీజేపీ : తుల ఉమ
– కేటీఆర్‌ సమక్షంలో బీఆర్‌ఎస్‌లో చేరిక
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
‘బీసీ బిడ్డను, మహిళా నేతనైన నాకే సీటివ్వలేదు. టికెట్‌ ఇచ్చినట్టు ఇచ్చి దొంగదారిన బీ-ఫాం వేరేవారికి ఇచ్చారు. మహిళల విషయంలోనే కాకుండా బీసీపట్ల బీజేపీ వైఖరికి ఇది నిదర్శనం. అలాంటి పార్టీలో బీసీని సీఎం ఏడ చేస్తారు? అది కల మాత్రమే’ అని ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా జెడ్పీ మాజీ చైర్‌పర్సన్‌ తుల ఉమ అన్నారు. సోమవారం హైదరాబాద్‌లో బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, రాష్ట్ర మంత్రి కేటీఆర్‌ సమక్షంలో తన అనుచరులతో కలిసి ఆమె బీఆర్‌ఎస్‌లో చేరారు. వారికి కేటీఆర్‌ కండువాలు కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఉమ మాట్లాడుతూ..బీజేపీ నేతలు ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండరని విమర్శించారు. బీజేపీ అగ్రవర్ణాల పార్టీ అనీ, కింది తరగతుల నాయకులను, కార్యకర్తలను వాడుకుని వదులేస్తుందని ఆరోపించారు. బీఆర్‌ఎస్‌లో మొదటి నుంచీ అనేక హోదాల్లో పనిచేశాననీ, అక్కడ ఇచ్చిన గౌరవం బీజేపీలో ఇవ్వలేదని చెప్పారు. రెచ్చగొట్టి తమ పబ్బం గడుపుకోవాలని చూస్తే బీజేపీ నేతల మాటల్ని విని కార్యకర్తలు ఆగంకావొద్దని చేతెలెత్తి వేడుకున్నారు. బీఆర్‌ఎస్‌లో చేరడం సొంతింటికి వచ్చినట్టు ఉందని చెప్పారు. ఇదే ఉత్సాహంతో బీఆర్‌ఎస్‌ పార్టీ కోసం పనిచేస్తానని హామీనిచ్చారు. మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ..సీఎం కేసీఆర్‌ సూచనతోనే ఉమక్కకు ఫోన్‌చేసి పార్టీలోకి ఆహ్వానించానన్నారు. తమ ఆడబిడ్డ తిరిగి గులాబీ గూటికి చేరడం సంతోషకరమన్నారు. ఉమక్కకు గతంలో కంటే సమున్నతమైన హోదా, బాధ్యతలను అప్పగించి గౌరవిస్తామనీ, ఆ బాధ్యతను తానే తీసుకుంటానని భరోసానిచ్చారు. వేములవాడ నియోజకవర్గ అభివృద్ధితో పాటు రాష్ట్రంలోని మహిళా అభ్యున్నతికోసం ఉమక్క సేవలు అవసరమన్నారు. ఆమె రాకను స్వాగతిస్తున్నామని చెప్పారు.

Spread the love