ప్రజల ప్రాణం పోతుంటే రాజకీయాలా?

– బొందల తెలంగాణగా మారుస్తున్న కేసీఆర్‌
– బీఆర్‌ఎస్‌, బీజేపీ కుమ్మక్కు: రాజకీయాలు టీపీసీసీ అధ్యక్షులు రేవంత్‌ రెడ్డి
– సహాయక చర్యల్లో కాంగ్రెస్‌ కార్యకర్తలు పాల్గొనాలని పిలుపు
నవతెలంగాణ-ఉప్పల్‌
రాష్ట్రంలో ప్రకృతి వైపరీత్యాలతో ప్రజల ప్రాణం పోతుంటే సీఎం కేసీఆర్‌ రాజకీయాలు చేయడమేంటని మల్కాజిగిరి ఎంపీ, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి ప్రశ్నించారు. మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లా ఉప్పల్‌, ఎల్బీనగర్‌ నియోజకవర్గం పరిధిలోని హస్తినాపురం డివిజన్‌ ముంపు ప్రాంతాల్లో శనివారం ఆయన సందర్శించారు. ప్రజలతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బంగారు తెలంగాణ దేవుడెరుగు రాష్ట్రాన్ని సీఎం కేసీఆర్‌ బొందల తెలంగాణగా మారుస్తున్నారని విమర్శించారు. ఇస్తాంబుల్‌ డల్లాస్‌ కాదని, కనీసం రోడ్లు బాగు చేయాలని కోరారు. మరో మూడు నెలల్లో కేసీఆర్‌ పాలనకు చెరమగీతం పాడాల్సిందేనన్నారు. బీజేపీ, బీఆర్‌ఎస్‌ ప్రభుత్వాలు కుమ్మక్కై రాజకీయాలు చేస్తున్నాయని విమర్శించారు. రాష్ట్ర ప్రజలు ఇంత ఇబ్బందుల్లో ఉంటే కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి పట్టించుకోకపోవడం ఏంటని, ఆయన నోరు మూగబోయిందా అని ప్రశ్నించారు. వరదల్లో ప్రాణం కోల్పోయిన వారి కుటుంబాలకు రూ.25 లక్షల ఎక్స్‌గ్రేషియా, పంట నష్టపోయిన రైతులకు రూ.30 వేల పరిహారం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందించాలని కోరారు. ప్రభుత్వాలు స్పందించకుంటే పార్లమెంటులో కేంద్ర మంత్రులను ప్రశ్నిస్తానన్నారు. రాష్ట్రంలో వరద సహాయక చర్యల్లో పాల్గొనాలని కాంగ్రెస్‌ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట కాంగ్రెస్‌ నాయకులు మేకల శివారెడ్డి, రాగిడి లక్ష్మారెడ్డి, మందుముల పరమేశ్వర్‌ రెడ్డి, సింగిరెడ్డి సోమశేఖర్‌ రెడ్డి, పసుల ప్రభాకర్‌ రెడ్డి తదితరులు ఉన్నారు.
రచ్చకెక్కిన కాంగ్రెస్‌ విభేదాలు
ఉప్పల్‌ కాంగ్రెస్‌ పార్టీలో విభేదాలు రచ్చకెక్కాయి. రేవంత్‌రెడ్డి పర్యటనలో ఫ్లెక్సీ వివాదంతో రాగిడి లక్ష్మారెడ్డి అనుచరులు, మందముల పరమేశ్వర్‌ రెడ్డి అనుచరుల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. రాగిడి లక్ష్మారెడ్డి అనుచరులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అయితే ప్రోటోకాల్‌ లేకుండా ఫ్లెక్సీలు ఎలా ఏర్పాటు చేస్తారంటూ మందముళ్ల పరమేశ్వర్‌ రెడ్డి అనుచరులు తెల్లవారుజామున 3 గంటల సమయంలో వాటిని చించేశారు. లక్ష్మారెడ్డి రెడ్డి అనుచరులు మళ్లీ ఉప్పల్‌ బస్టాండ్‌ సమీపంలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తుండగా.. కొంతమంది పరమేశ్వర్‌ రెడ్డి అనుచరులు వచ్చి ఫ్లెక్సీలు చించి దాడికి దిగారు. దీంతో ఇరు గ్రూపుల మధ్య ఘర్షణ నెలకొనడంతో అక్కడే ఉన్న పోలీసులు వారిని చెదరగొట్టారు. అనంతరం రాగిడి లక్ష్మారెడ్డి రెడ్డి అనుచరులు ఉప్పల్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.